తెలుగుకి ఆ హోదా వుంది …

teluguku pracheena hodaతెలుగు భాష ప్రాచీన భాషే అనడానికి ఎంతమాత్రమూ సందేహం లేదని మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడింది. తెలుగుతో పాటు మలయాళం, కన్నడం, ఒడియా భాషలకు కేంద్ర ప్రభుత్వం ప్రాచీన హోదా కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని మద్రాసు హైకోర్టు సోమవారంనాడు కొట్టివేసింది. ఆయా భాషలకు ప్రాచీన హోదా కల్పించడానికి తగిన అర్హతులున్నాయని, నిబంధనల ప్రకారమే ప్రాచీన హోదా కల్పించారని న్యాయస్థానం స్పష్టం చేసింది. తెలుగు, కన్నడ, మలమాళం, ఒరియా భాషలకు ప్రాచీన హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ.. 2009లో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఎనిమిదేళ్లుగా విచారణలో ఉన్న ఈ పిల్‌పై చీఫ్ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఆర్.హమదేవన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఎట్టకేలకు తీర్పు ప్రకటించింది. నిబంధనల ప్రకారమే ప్రాచీన భాషా హోదా కల్పించారని స్పష్టం చేస్తూ పిల్‌ను కొట్టివేసింది. తెలుగుకు ప్రాచీన హోదాకు సంబంధించి ఏపి, తెలంగాణ ప్రభుత్వాల తరఫున న్యాయవాది రవీంద్రనాథ్‌ ధర్మాసనానికి వివరాలు సమర్పించారు. కాగా, తెలుగుకు ప్రాచీన హోదాపై కోర్టు తీర్పు ఇవ్వడంపై ఇరు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు, భాషాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. తీర్పును ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ స్వాగతించారు.

తెలుగును ప్రపంచ భాషగా మార్చేందుకు రెండు తెలుగు ప్రభుత్వాలూ కృషి చేయాలని, తెలుగు భాషపై ఉదాసీనంగా ఉండటం తగదని ఆయన సూచించారు. భాషా అధ్యయన కేంద్రం ఏర్పాటుకు కేంద్రం అంగీకరించినా తెలుగు ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని, తెలుగును ఆధునిక భాషగా గుర్తించేందుకు కృషి చేయాలని యార్లగడ్డ చెప్పారు.

SHARE