ఆర్మీ పై ఊహించని దాడి..

0
448

  terrorists attacked kashmir indian army

హిమాలయన్ రీజియన్లో భారత్కు అత్యంత కీలకమైన యురి సైనిక స్థావరంపై ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో జరిగిన ఉగ్రదాడి.. ఇండియన్ ఆర్మీ చరిత్రలోనే అత్యంత దారుణమైనది. సరిహద్దు (ఎల్ వోసీ) నుంచి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ గా కొనసాగుతోన్న యురి స్థావరంలో నిత్యం 12 నుంచి 13వేల మంది సైనికులు ఉంటారు. ‘change of command’ గా ఆర్మీ వ్యవహరించే విధానంలో వేరువేరు ప్రాంతాల నుంచి విడతలవారీగా సైనిక బృందాలు ఇక్కడికి రావడం, ఇక్కడున్నవాళ్లు మరో ప్రాంతానికి వెళ్లడంలాంటివి తరచూ జరుగుతూఉంటాయి. అలా వచ్చేవారి కోసం యురి స్థావర ప్రవేశంలోనే తాత్కాలిక టెంట్లను ఏర్పాటుచేశారు. సైనికులు అక్కడ ఉండబోయే రోజులను బట్టి వారికి క్యాంప్ లోపల క్వార్టర్స్ అవీ కేటాయిస్తారు. ఇక ఆదివారంనాటి దాడి విషయానికి వస్తే.. ఉగ్రదాడిలో చనిపోయిన వారిలో ఎక్కువమంది ఈ తాత్కాలిక టెంట్లలో సేద తీరుతోన్న సైనికులే కావడం గమనార్హం.

  terrorists attacked kashmir indian armyజమ్ము- ముజఫర్ నగర్ హైవేపై గల యురి పట్టణాన్ని ఆనుకుని నిర్మించిన సైనిక స్థావరానికి మూడువైపులా(5 నుంచి 6 కిలోమీటర్ల దూరంలో) సరిహద్దు(ఎల్ వోసీ) ఉంటుంది. దీనిని అనుకూలంగా మలుచుకుంటున్న ఉగ్రవాదులు అప్పుడప్పుడూ యురి ఆర్మీ క్యాంప్ పై దాడులకు తెగబడుతున్నారు. ఈసారి మాత్రం పకడ్బందీగా వ్యవహరించిన ఉగ్రవాదులు.. ఎల్వోసీ వద్ద ఏర్పాటుచేసిన ఇనుప కంచెలను సైతం కట్టర్లతో తెంచి, మన భూభాగంలోకి చొరబడ్డారు. అది ఎలక్ట్రిఫైడ్ ఫెన్సింగ్ కాకపోవడం కూడా ఉగ్రవాదులను కలిసొచ్చింది. కంచె తెంచుకుని నేరుగా యురి ఆర్మీ క్యాంప్ వైపునకు దూసుకొచ్చిన ఉగ్రవాదులు మొదట తాత్కాలిక టెంట్లపైకి గ్రనేడ్లు విసిరారు. ఆ వెంటనే విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఏం జరుగుతుందో సైనికులకు అర్థమయ్యేలోపే వాళ్లున్న టెంట్లు మంటల్లో తగలబడ్డాయి. చనిపోయిన 17 మంది జవాన్లలో అత్యధికులు టెంట్లలో చెలరేగిన మంటల కారణంగానే చనిపోయినట్లు ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. అంతేకాదు.. గాయపడిన 30 మందిలోనూ సగానికిపైగా మంటల్లో చిక్కుకున్నవారే కావడం గమనార్హం. మూడు గంటల ఆపరేషన్ అనంతరం నలుగురు ఉగ్రవాదులను మట్టుపెట్టినట్లు భద్రతా వర్గాలు ప్రకటించాయి.

కాగా సరిహద్దు వెంబడి అత్యంత కీలకమైన యురి స్థావరంలో కనీసం ఫైర్ ఫ్రూఫ్ టెంట్లు ఏర్పాటుచేసుకోలేకపోవడం శోచనీయం. దాడుల కోణంలోనే కాక అగ్నిప్రమాదాల నివారణకు కూడా ఇవి అత్యవసరమని అధికారులు గుర్తించకపోవడం దారుణం. ఎప్పటిలాగే రాష్ట్రపతి, ప్రధానమంత్రి మొదలు సామాన్య భారతీయుడు, అగ్రరాజ్యం అమెరికా, మరికొన్ని దేశాలు సైతం ముక్తకంఠంతో ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించాయి. దుష్ట పాకిస్థానే ఈ దురాగతాలను చేయిస్తున్నదని, అంతర్జాతీయంగా ఆ ఉగ్రదేశాన్ని వెలివేయాలని హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. తన విదేశీ పర్యటనను రద్దుచేసుకున్న ఆయన ఢిల్లీలో అత్యవరసర సమావేశం నిర్వహించారు. ఇటు రక్షణ మంత్రి మనోహర్ పారికర్, ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ లు కశ్మీర్ లోనే ఉండిపరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

ఇటీవలి కాలంలో మన భద్రతా బలగాలపై చోటుచేసుకున్న హేయమైన దాడులను ఒక సారి పరిశీలిస్తే..

మే 22, 2016, మణిపూర్ లోని చండేల్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో అసోం రైఫిల్స్ కు చెందిన ఆరుగురు జవాన్లు మృతి

జనవరి 2, 2016: పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై నలుగురు ఉగ్రవాదులు జరిపిన దాడిలో అధికారులు, జవాన్లు సహా ఏడుగురు భద్రతా సిబ్బంది చనిపోయారు.

జూన్ 4, 2015: ఆర్మీ కాన్వాయ్ పై ఉగ్రవాదులు మెరుపుదాడికి పాల్పడగా మణిపూర్ లో 18 మంది సైనికులు నేలకొరిగారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.

డిసెంబర్ 5, 2014: కశ్మీర్ లోని వేరువేరు ప్రాంతాల్లో (యురి, అహ్మద్ నగర్, షోఫియాన్, పుల్వామాల్లో) ఒకేరోజు జరిగిన దాడుల్లో ఎనిమిది మంది ఆర్మీ జవాన్లు, ముగ్గురు పోలీసులు, ఇద్దరు సాధారణ పౌరులు చనిపోయారు. దాడులకు పాల్పడ్డ ఎనిమిది మంది ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుపెట్టాయి.

జూన్ 24, 2013: శ్రీనగర్ కు సమీపంలోని హైదర్ పొరాలో చోటుచేసుకున్న ఉగ్రదాడిలో 10 మంది ఆర్మీ జవాన్లు నేలకొరిగారు.

జులై 19, 2008: కశ్మీర్ లోని నర్బల్ క్రాసింగ్ వద్ద ఉగ్రవాదులు అమర్చిన ఐఈడీ బాంబులు పేలి 10 మంది ఆర్మీ జవాన్ల మృతి.

జూన్ 24, 2004: శ్రీనగర్ పట్టణంలోని దాల్ సరస్సుకు సమీపంలో రాష్ట్రీయ రైఫిల్స్ కాన్వాయ్ పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో తొమ్మిది మంది సైనికులు మరణించగా, 21 మంది గాయపడ్డారు.

మే 23, 2004: శ్రీనగర్- జమ్ము హైవేపై గల లోయర్ ముందా వద్ద ఉగ్రవాదులు ఎల్ఈడీ బాంబులను అమర్చి దాడికి దిగారు. ఈ ఘటనలో మొత్తం 30 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 19 మంది బీఎస్ఎఫ్ జవాన్లు.

జూన్ 28, 2003: జమ్ము సిటీ శివారులోని దోగ్రా రెజిమెంట్ క్యాంప్ వద్ద ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 12 మంది సైనికులు చనిపోయారు.

మే 14, 2002: కలూచాక్ దాడిగా అభివర్ణించే ఈ దాడిలో.. ఆర్మీ జవాన్లు కుటుంబాలతోసహా ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడిచేసి మొత్తం 34 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఆర్మీ దుస్తులు ధరించిన నలుగురు ఉగ్రవాదులు.. మొదట డ్రైవర్ ను కాల్చిచంపి, తర్వాత బస్సులోని ప్రయాణికులపై విచక్షణా రహితంగా బుల్లెట్ల వర్షం కురిపించారు. చనిపోయిన 34 మందిలో 22 మంది ఆర్మీ జవాన్లు, వారి కుటుంబ సభ్యులేకావడం గమనార్హం.

Leave a Reply