Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దేశ ప్రధాని నుండి సామాన్యుడి వరకు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. గత రెండు సంవత్సరాలుగా ఈ విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఈనెల 28తో ఆ ప్రశ్నకు సమాధానం దొరకనుంది. ‘బాహుబలి 2’ చిత్రం విడుదలకు అంతా సిద్దం అయ్యింది. ఈ సమయంలోనే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే విషయంపై ఊహాలు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న ఊహల్లో నిజం కూడా ఉండవచ్చు అనే ప్రచారం జరుగుతుంది.
అన్నింటి కంటే ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కథ ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అదేంటంటే.. బాహుబలి రాజు అయిన తర్వాత గిరిజన రాజు కుమార్తె అయిన దేవసేనను ప్రేమిస్తాడు. వీరి ప్రేమకు భళ్లాలదేవుడు మద్దతు ఇస్తున్నట్లుగా పైకి నటిస్తూ మాహిష్మతి రాజ్యంకు బాహుబలిని దూరం చేస్తాడు. బాహుబలి రాజ్యంను విడిచి పోవడం వల్లే రాజ్యంలో అల్ల కల్లోల పరిస్థితులు నెలకొన్నాయని రాజమాత శివగామి దేవికి భళ్లాలదేవుడు చెప్పిస్తాడు. దాంతో ఆగ్రహించిన రాజమాత శివగామిదేవి సైన్యంను బాహుబలిని తోడ్కొని రావాల్సిందిగా ఆదేశిస్తుంది. ఆ సైన్యంను భళ్లాలదేవుడు చంపించి, బాహుబలి చేతిలో ఆ సైన్యం చనిపోయారని చెప్పిస్తాడు. దాంతో ఆగ్రహించిన రాజమాత శివగామి దేవి భళ్లాలదేవుడిని, కట్టప్పను యుద్దానికి బాహుబలిపైకి పంపిస్తుంది. బాహుబలిని చంపాల్సిందిగా ఆదేశిస్తుంది. బాహుబలిపై భళ్లాలుడు యుద్దం ఓడిపోతున్న సమయంలో రాజమాత ఆదేశాల మేరకు కట్టప్ప బాహుబలిని చంపేస్తాడు. ఆ తర్వాత రాజమాతకు అసలు విషయం తెలవడంతో బాహుబలి కొడుకును కాపాడుతుంది. ఇదే నిజమని కొందరు వాదిస్తున్నారు. అయితే ఇందులో నిజం ఎంతుందనే విషయం తెలియాలంటే మరో నాలుగు రోజులు ఆగాల్సిందే.