రాష్ట్రంలో కొందరు పోలీసు ఉన్నతాధికారులు, రాజకీయ ప్రముఖుల అండదండలతో నేర సామ్రాజ్యాన్ని ఏలిన నయీం గుట్టు విప్పుతున్న సిట్‌కు తాజాగా ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో అతనికున్న సంబంధం వెలుగుచూసినట్టు తెలిసింది. తనకు అందించిన సహాయసహ కారాలకు గాను కోట్ల రూపాయల విలువైన ఆస్తులను నయీం వీరికి కట్టబెట్టినట్టు తెలుస్తున్నది. మావోయిస్టుల కార్యకలా పాలను అణిచి వేసేందుకు అవసరమైన సమాచారాన్ని ఇచ్చే నయీంతో ఈ ముగ్గురు అధికారులు ఎస్ఐబీలో పనిచేసిన కాలంలో పరిచయం అయ్యారు.
వీరి హయాంలోనే కొందరు మావోయిస్టు నేతల ఎన్కౌంటర్లు కూడా జరిగాయి. అదే సమయంలో నయీంకు అవసరమైన సెక్యూరిటీని కూడా ఈ అధికారులు కల్పించారని తెలుస్తున్నది. ఈ అధికారుల ప్రాపకంతో నయీం తన అక్రమ దందాలన చాపకింద నీరులా విస్తరించాడు. నక్సలైట్ల సమాచారం కోసమని వీరిచ్చిన సీక్రెట్రిజర్వు అమౌంట్‌ను రెగ్యులర్‌గా తీసుకుంటూ ఛత్తీస్‌గఢ్, ఖమ్మం, భద్రాచలం, నల్లమల అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై సమాచారాన్ని అందించే వాడు. ఈ మేరకు చాలా వరకు నయీం ఇచ్చిన సమాచారంతో యాంటీ నక్సలైట్ ఆపరేషన్లను సదరు అధికారులు చక్క బెట్టినట్టు తెలిసింది.
అలుకాపురిలోని నయీం ఇంట్లో రాత్రి వరకు జరిపిన సోదాల్లో ఈ ముగ్గురు అధికారులతో నయీంకు ఉన్న బంధం గురించిన సమాచారం సిట్‌కు చిక్కినట్టు తెలిసింది. వీరిచ్చిన అండదండలను అడ్డుగా పెట్టుకొని కోట్ల రూపాయల సెటిల్మెంట్లను నయీం చేసినట్టు తెలిసింది. ఇందులో నగరంతో పాటు నిజామాబాద్, వరంగల్, విజయవాడ, బెంగళూరు, ఒడిషాలకు చెందిన కొందరు మార్వాడి బిజినెస్ మేగెట్లకు సంబంధించిన కోట్ల రూపాయల సెటిల్మెంట్లను నయీం చేసినట్టు గా కూడా సిట్ అనుమానిస్తున్నది. తమకు లభించిన కొన్ని పత్రాలలో నయీం చేతి రాతతో ఉన్న కొన్ని పదాలు కోడ్‌భాషలో ఉండటంతో దాన్ని అధికారులు నిపుణులతో కలిసి డీకోడ్ చేస్తున్నట్టు తెలిసింది. ఈ పత్రాలతో పాటుగా సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్న పెన్‌డ్రైవ్‌లు, సీడీలలో కూడా ఈ వ్యవహారానికి సంబంధించి మరింత లోతైన సమాచారం ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
దీంతో సదరు అధికారులు ఎస్ఐబీలో ఉండగా వ్యవహరించిన తీరు తెన్నుల గురించి కూడా సిట్ దృష్టిని సారించినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే యాంటీ నక్సలైట్ నిఘా విభాగం అయిన ఎస్ఐబీలోకి నయీం ఏ సమయంలోనైనా వచ్చి వెళ్లడానికి పై అధికారులు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్టు తెలిసింది. నేరుగా వీరి ఛాంబర్లోకి వచ్చి వెళ్లేంత చనువును కూడా ఇచ్చారని, అడపా దడపా సదరు అధికారులకు పార్టీలను కూడా నయీం ఇచ్చే వాడనే సమాచారం కూడా సిట్‌కు అందినట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ ముగ్గురు అధికారులు ఒకరు ఇతర కీలక బాధ్యతలను నిర్వహిస్తున్నారని తెలిసింది.
కాగా ఎస్ఐబీలో పనిచేసిన కొందరు డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లకు కూడా భారీ నజరానాలను నయీం అందచేసేవాడని తెలిసింది. వీరి ద్వారానే వారిపై అధికారులు తన గురించి ఏ మనుకుంటున్నారు, తనను విశ్వసిస్తున్నారా లేక అనుమానిస్తున్నారా అనే సమాచారాన్ని రాబట్టే వాడని తెలుస్తున్నది. దీని ఆధారంగానే పై అధికారులతో తన సంబంధాలను ఏ మేరకు కొనసాగించాలనే వ్యూహ రచనను నయీం చేసుకునే వాడని తెలుస్తున్నది. కాగా ముగ్గురు అధికారులు కూడా నయీం నుంచి భూముల రూపంలోనే లబ్దిని పొందారా, లేక ఇండ్లు కూడా తీసుకున్నారా అనే కోణంలో కూడా సిట్ విచారిస్తున్నట్టు తెలిసింది.