తిరుపతి లడ్డూ కబుర్లు…

0
614

tirupathi laddu tirupathi temple

ఏడుకొండల వాడు ఎంత ఫేమస్సో … శ్రీవారి లడ్డూ అంతే ప్రత్యేకం. అయితే అన్నమయ్య సినిమాలో చూపించినట్టు శ్రీనివాసుడికి ఆదినుంచి లడ్డూ ప్రసాదం పెట్టే సంప్రదాయం లేదు… స్వామివారికి ఎన్నో ప్రసాదాలు, నైవేద్యాలు పెట్టాక … వందల ఏళ్లు గడిచాక 70 – 80 ఏళ్ల కిందట మాత్రమే ఇపుడు మనం చూస్తున్న లడ్డు ప్రసాదం తయారీ మొదలైంది.

పల్లవుల కాలంనుంచే శ్రీవారి ఆలయంలో ప్రసాదం తయారీ, భక్తులకు పంపిణీ సంప్రదాయం మొదలైంది. రెండో దేవరాయల కాలం నుంచి ప్రసాదాల సంఖ్య పెరిగింది. అపుడు మంత్రిగా పనిచేసిన శేఖర మల్లన్న ఈ ప్రసాదాల కోసమే గుడికి భారీగా విరాళాలు ఇచ్చేవారట. అప్పటినుంచే శ్రీవారికి నైవేద్య వేళలు నిర్ణయించారు. స్వామివారికి నివేదించాక అవే ప్రసాదాల్ని భక్తులకి పంచేవారు. అప్పట్లో కొండమీద భోజన సదుపాయం ఉండేదికాదు. ఈ ప్రసాదాలు వారి కడుపు నింపేవి. ఇలా భక్తులకు అందజేసే ప్రసాదాన్ని ‘తిరుప్పొంగమ్’ అనేవారు. తర్వాత సుజాయం, అప్పం, వడ, అత్తిరసం, మనోహరపడి … ఇలా చాలా ప్రసాదాలు వచ్చాయి. అయితే ఒక్క వడ తప్ప మిగతా ప్రసాదాలు నిల్వ వుండేవి కావు.

ఇంటికి ప్రసాదం తీసుకెళ్లాలని భావించే భక్తులంతా వడ కోసం అడిగేవాళ్లు. ఇది గమనించిన మద్రాస్ ప్రభుత్వం 1803 నుంచి శ్రీవారి ప్రసాదాల్ని విక్రయించేందుకు నిర్ణయించింది. వడతో పాటు తీపి ప్రసాదం కావాలన్న ఆలోచన మొదలైంది. మీదుగా తీపి బూందీని ప్రసాదంగా విక్రయించారు. తరవాత లడ్డూగా చేసి అమ్మడం 1840 ప్రాంతంలో మొదలైంది.

తిరుపతి లడ్డూలో ఏంవేస్తారు? ఎంత వేస్తారు?

ladduలడ్డూ తయారీలో వాడే సరుకుల మోతాదును దిట్టం అంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి 1950 లో తొలిసారిగా ‘దిట్టం’ ఎంత ఉండాలో నిర్ణయించింది. 50 ఏళ్ల తర్వాత 2001 లో మళ్లీ ‘దిట్టం’ లెక్కల్ని సవరించారు. దాన్ని ‘పడి తరం దిట్టం స్కేల్’ అంటారు. పడి అంటే ప్రసాదాల్లో వాడే 51 రకాల సరుకులు. నిర్ణయించిన ప్రకారం శ్రీవారి స్టోర్ ఉగ్రాణం నుంచి ఈ సరుకుల్ని వంట చేసే పోటుకు  ఇస్తారు. అన్నప్రసాదాలకు సోల, అరసోల, పావుసోల, కొలతల్ని ఉపయోగిస్తారు.

ప్రస్తుతం 5100 లడ్డూల తయారీకి … 15 కిలోల ఆవునెయ్యి, 200 కిలోల శనగపిండి, 400 కిలోల పంచదార, 35 కిలోల జీడిపప్పు, 17.5 కిలోల ఎండుద్రాక్ష, 10 కిలోల పటికబెల్లం, 5 కిలోల యాలకులు వాడతారు. 852 కేజీల సరుకులతో 5100 లడ్డూలు తయారవుతాయి.

తల్లి రుచి చూశాకే కొడుక్కి నైవేద్యం

vakula1శ్రీవారి గర్భాలయానికి ఆగ్నేయంగా వున్న పోటులో లడ్డూలు తయారవుతాయి. ఈ వంటశాలలో పనిచేసేవాళ్లంతా ప్రత్యేక శ్రద్ధతో తమ పనులు చేస్తారు. వంటశాల ముందు శ్రీనివాసుడితల్లి వకుళమాత విగ్రహాన్ని నెలకొల్పారు. తయారైన వంటకాల్ని ఆమె ముందు కొద్దిసేపు  ఉంచాకే తర్వాత శ్రీవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ వంటకాల్ని ముందుగా తల్లి రుచిచూసి తర్వాత కొడుక్కి పెడుతుందనేది ఓ నమ్మకం.

Leave a Reply