టుడే హైలైట్స్ ..

0
681
today news highlights

Posted [relativedate]

today news highlights1. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్లో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన ఉభయసభలకు వెల్లడించారు.

2. దేశంలో అవినీతి నిర్మూలనే ధ్యేయంగా ప్రభుత్వ చర్యలు చేపట్టిందని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తెలిపారు. నల్లధనాన్ని నిరోధించేందుకే పెద్ద నోట్లను రద్దు చేశామని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రజలు సహకరించారని ప్రశంసించారు.

3. యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు కృషి చేశామని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన ద్వారా కోటి మంది యువతకు వచ్చే ఐదేళ్లలో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రూ.10వేల కోట్లతో నేషనల్‌ అప్రెంటిస్‌ పథకాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు.

4. ముస్లిం మెజార్టీ దేశాల వలసదారులు, శరణార్థులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన ఆంక్షలను వ్యతిరేకించినందుకు యునైటెడ్‌ స్టేట్స్‌ తాత్కాలిక అటార్నీ జనరల్‌గా పనిచేస్తున్న సాల్లీ యేట్స్‌ను పదవి నుంచి తొలగించారు. అమెరికా పౌరుల రక్షణ కోసం న్యాయపరంగా తీసుకొచ్చిన ఆదేశాన్ని తిరస్కరించి యేట్స్‌ న్యాయశాఖకు ద్రోహం చేస్తున్నారని వైట్‌హౌస్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

5. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజా నిర్ణయాన్ని ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఒబామా తీవ్రంగా తప్పుబట్టారు. మతం, విశ్వాసాల ఆధారంగా వ్యక్తులను వివక్షకు గురిచేయడంపై తాను ఎంతమాత్రం ఏకీభవించనని, తన విదేశాంగ విధానాలు కూడా అదే విషయాన్ని చాటాయని ఒబామా స్పష్టం చేశారు. అమెరికా విలువలు ప్రమాదంలో పడుతున్నప్పుడు ఏం జరగాలని ఆశించామో ఇప్పుడు అదే జరుగుతోందని వ్యాఖ్యానించారు. ట్రంప్‌ వివాదాస్పద ఆదేశాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

6. భద్రాచలంలో భక్త రామదాసు 384వ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా రామదాసు విగ్రహానికి అభిషేకం నిర్వహించి.. చిత్రపటాన్ని వూరేగించి నగర సంకీర్తన జరిపారు. ఈ వేడుకలు ఫిబ్రవరి 4వరకు జరుగుతాయని ఈవో రమేష్‌బాబు తెలిపారు.

7. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీకి లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కొన్ని పార్టీలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. పెద్దనోట్ల రద్దుపై మన్మోహన్‌సింగ్‌, చిదంబరం చేసిన వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. ప్రస్తుత బడ్జెట్‌ సమావేశాల్లో అర్ధవంతమైన చర్చలు జరిగేలా ప్రతిపక్షాలు సహకరించాలని వెంకయ్య కోరారు.

8. అమెరికాలోని నార్త్‌ డకోటా విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కేసులో గుజరాత్‌కు చెందిన వ్యాపారి పరమన్‌ రాధాకృష్ణన్‌ని అరెస్ట్‌ చేయడంపై భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ ఆరా తీశారు . అమెరికాలో భారత రాయబారిని ఈ ఘటనపై నివేదిక కోరినట్లు ఆమె ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

9. మహారాష్ట్రలోని లాథూర్‌లో ఓ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. పరిశ్రమలో విష వాయువులు పీల్చి తొమ్మిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. కెమికల్‌ ట్యాంక్‌ లీక్‌ కావడం వల్లనే విష వాయువులు వ్యాపించినట్లు తెలుస్తోంది.

10. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో జరిగిన రోడ్డుప్రమాదంలో 10 మంది గాయపడ్డారు. కర్నూలు నుంచి నంద్యాలకు వెళ్తున్న లారీ.. కడప నుంచి కర్నూలు వైపు ప్రయాణిస్తున్న బస్సు ఓర్వకల్లు బస్టాండ్‌ వద్ద జాతీయ రహదారిపై ఎదురెదురుగా ఢీకొన్నాయి. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Leave a Reply