హోదాపోరు కి హీరోలు కావాలి..

0
795

  tollywood heros need special status purpose

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకహోదా ఇచ్చే ఉద్దేశం లేదని కేంద్రం తేల్చినా దాని గురించి గట్టిగా మాట్లాడి ఉద్యమనిర్మాణం చేయగలవారే కనపడడంలేదు.దాంతో ఓ సగటు సినీ అభిమాని టాలీవుడ్ హీరోలు ఒక్కరైనా ఈ అంశం గురించి మాట్లాడితే బాగుంటుందని తన కోర్కెను ఓ లేఖ ద్వారా బయటపెట్టాడు.సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్న ఆ లేఖ మీకోసం …

ప్రత్యేక హోదాపై కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపీ,టీడీపీ ఏపీ ప్రజలను దారుణంగా వంచించాయి…అయితే దగా పడిన ఏపీ ప్రజల తరపున కనీసం మాట్లాడే దిక్కు లేకుండా పోయింది..ప్రత్యేక హోదాపై ఉద్యమం చేస్తామంటోన్న ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రజల తరపున పోరాడడానికి ఎందుకో పెద్దగా ముందుకు రావడం లేదు..ఇక ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ ప్రత్యేక హోదాపై మూడంచెల పోరాటం చేస్తానని చెప్పి…కాకినాడ సభ తర్వాత సైలెంట్ అయిపోయాడు..మరి ఏపీ ప్రజల తరపున మాట్లాడేది ఎవరు…టాలీవుడ్ లో బడా బడా హీరోలు ఉన్నారు..ఆంధ్రా ప్రజల్లో ఈ స్టార్ హీరోలకు బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది..ఆంధ్రా ప్రజల అభిమానంతో కోట్లకు పడగలెత్తారు ఈ అగ్రహీరోలు….చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా స్టార్ హీరోలంతా సీమాంధ్ర ప్రేక్షకుల అభిమానంతో ఎదిగినవారే…మరి ఇప్పుడు మోదీ, చంద్రబాబు కల్సి తమ
సీమాంధ్ర ప్రజల గొంతు కోస్తుంటే వీళ్లు మాత్రం గొంతు విప్పడం లేదు..మరి ఈ సిగ్గులని హీరోలని నిగ్గదీసి అడిగే సమయం ఆసన్నమైంది..

ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి మహా వృక్షంగా ఎదిగిన చిరంజీవిగారు..ఆయన్ని సినిమాల్లో నెంబర్ వన్ హీరోగా చేసింది సీమాంధ్ర ప్రజలు కాదా..టాలీవుడ్ ని పాతికేళ్ల పాటు చిరు శాసించాడంటే అది సీమాంధ్ర ప్రజల వల్ల కాదా..ఆఖరికి ప్రజారాజ్యం పార్టీ పెడితే 18 సీట్లు గెలిపించి గౌరవించారు..కానీ ఆయన మాత్రం పార్టీని నడపడం చేతగాక కాంగ్రెస్ లో కల్పి ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశారు..అయినా చిరంజీవిని సీమాంధ్ర ప్రజలు ఇప్సటికీ అభిమానిస్తూనే ఉన్నారు..ఆయన కుటుంబం నుంచి వస్తున్న వారసుల సిన్మాలను ఆదరిస్తూనే ఉన్నారు..ఆయన తనకు అచ్చిరాని రాజకీయాలకు గుడ్ బై చెప్పి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుంటే మురిసిపోయి మళ్లీ వెలకమ్ చెబుతున్నది కూడా ఈ సీమాంధ్ర ప్రజలే..మరి అలాంటి ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చిరు ప్రజల తరపున నిలబడి ప్రత్యేక హోదాపై పోరాడకపోవడం ఎంత వరకు సమంజసం..ఇక రాజకీయాలు నాకెందుకు మళ్లీ సిన్మాలు చేసుకుంటానంటున్నా. . చిరుకి కనీసం ప్రజల తరపున కేంద్రాన్ని నిలదీయాల్సిన నైతిక బాధ్యత లేదా..ఇలా అయితే ఆయన్ని సీమాంధ్ర ప్రజలు పూర్తిగా మర్చిపోయే ప్రమాదం ఉంది..

ఇక మిగిలిన మెగా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, అయితే మరీ ఘోరం..ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పనిగట్టుకుని ప్రచారం చేసిన ఈ హీరోలు ఆ తర్వాత పత్తా లేరు..తమ సిన్మాలను ఆదరిస్తున్న ప్రజల తరపున కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం నిజంగా సిగ్గు చేటు..మెగా హీరోలంతా ఇంతటి స్టార్ డం వెలగబెడుతున్నారంటే అది సీమాంధ్ర ప్రజల చలవే..మరి ఆ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే తీరిక చేసుకుని ఒక్క మాట మాట్లాడే తీరిక లేకుండా ఈ మెగా హీరోలను చూస్తుంటే సీమాంధ్ర ప్రజలకు ఒళ్లు మండిపోతుంది..

నందమూరి వారసుల గురించి మాట్లాడుకుందాం..బాలయ్య బాబు..నందమూరి వారసుడిగా సీమాంధ్ర ప్రజలు బాలయ్యను నెత్తిన పెట్టుకున్నారు..ఆయన సిన్మాల్లో తొడగొడితే ఆవేశంతో ఉప్పొంగిపోయారు..రాజకీయాల్లోకి వస్తే మన ఎన్టీవోడి వారసుడే కదా అని ఆయన్ని ఎమ్మెల్యేను కూడా చేశారు..రాష్ట్ర విభజనకు కారకుడైనా, అనుభవజ్ఞుడు అని చెప్పి ఆయన బావ చంద్రబాబు టీడీపీకి అధికారం అప్పగించారు సీమాంధ్ర ప్రజలు..ఇప్పుడు కేంద్రం ప్రత్యేక హోదాపై మాట మార్చి ప్యాకేజీ ఇస్తానంటే చంద్రబాబు ఓకే అంటూ తలూపి థ్యాంక్స్ చెబుతుంటే కనీసం బాలయ్యా..అదేంటి బావా..ప్రత్యేక హోదా తీసుకువస్తామని మనం ప్రజలకు మాట ఇచ్చాం..ఇప్పుడు ఆ మాట తప్పితే ఎలా బావా అని చంద్రబాబు ముందు తొడ కొట్టడం కాదు కదా..కనీసం ఓ మాట మాట్లాడి బాబుగారిని నిలదీయలేదు..సినిమాల్లో వీరావేశంగా డైలాగులు కొడుతూ తొడ గొట్టే బాలయ్య..రాజకీయాల్లో మాట్లాడమంటే మాత్రం బెబ్బే..ప్రత్యేక హోదాపై మాట్లాడమంటే మీడియా ముందు..మ..మ..అంటూ మాటలు తడుముకుంటాడు..మోదీ, చంద్రబాబు కల్సి ప్రత్యేక హోదాపై తమ అధికారమనే గదాయుధంతో తెలుగు ప్రజల బతుకులను కూలుస్తుంటే..ఇంట్లో తొడ కొట్టుకుంటూ కూర్చున్నాడు మన బాలయ్య.. ఇలాంటి హీరోనా మనం ఎమ్మెల్యేగా ఎన్నుకుందని ప్రజలు తమ నెత్తి నోరు బాదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది..

అలాగే మరో నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్. తాతకు తగ్గ మనవడిగా ఈ బుడ్డ ఎన్టీఆర్ ను కూడా సీమాంధ్ర ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు.. చిన్నవయసులోనే ప్టార్ డం కట్టబెట్టారు..మరి ఈయనగారు..తన తాత పెట్టిన పార్టీని గెలిపించడానికి ప్రజల్లోకి వచ్చి ప్రచారం కూడా చేశాడు..పెద్ద ఎన్టీవోడు అంతటోడు అవుతాడని సీమాంధ్ర ప్రజలు ఈ బుడ్డోడి మీద ఎన్నో ఆశలు పెట్టేసుకున్నారు..ఆ తర్వాత చంద్రబాబుగారి రాజకీయాల వల్ల రాజకీయాలకు దూరంగా సిన్మాలు చేసుకుంటున్నాడు..తాజాగా జనతా గ్యారేజీ సిన్మాతో జనాలు బుడ్డోడిని పెద్దోడిని చేశారు..ఇక సిన్మాల్లో ఎన్టీఆర్ కు తిరుగులేదనేంతగా బలాన్ని ఇచ్చారు..మరి తనకు ఇంత బలాన్ని ఇచ్చిన జనం గొంతులను తన మామ చంద్రబాబు, మోదీ కల్సి తడిగుడ్డతో కోస్తుంటే కనీసం మాట్లాడకుండా కూర్చున్నాడు…ఎట్టకేలకు తన సిన్మా హిట్ అయిందని కన్నీళ్లు పెట్టుకుంటున్న ఈ తారకరాముడు ప్రత్యేక హోదా విషయంలో దగాపడిన సీమాంధ్ర ప్రజల కన్నీళ్లను పట్టించుకోకపోవడం దారుణం..

తెలుగు స్టార్ హీరోల్లో మరో ఇద్దరు..నాగార్జున, వెంకటేష్..వీరిద్దరు ఆంధ్రాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు..ఎంత సామాజిక వర్గ ప్రజల అండదండలతోనో, ఎంత ఘనమైన సినీ వారసత్వం ఉన్నా..వీరిద్దరు సీమాంధ్ర ప్రజల అభిమానం లేకపోతే ఇంతగా ఎదిగేవారా..నాగార్జున గారు అయితే మరీ ఘోరం..ఆయనది పక్కా బిజినెస్ మైండ్..సినిమాల్లో సంపాదించిన సొమ్మును వ్యాపారాల్లో పెట్టి వేల కోట్లు గడించి బిజినెస్ టైకూన్ గా ఎదిగారు..మరి తనను
ఇంత వారిని చేసిన ఏపీ ప్రజల రుణం తీర్చుకోవాల్సిన అవసరం నాగార్జునకు లేదా..కనీసం ప్రత్యేక హోదాపై సీమాంధ్ర ప్రజలు అన్యాయానికి గురవతుంటే ..ఆ నాకెందుకులే నాసిన్మాలు నాకున్నాయి..నా వ్యాపారాలు నాకున్నాయంటూ నోరు మెదపకుండా కూర్చున నాగార్జున గారిని చూస్తుంటే ఏపీ ప్రజలకు నరాలు మెలిపిట్టినట్టు బాధ కలుగుతుంది…ఇక వెంకటేష్ గారయితే ఆయన లోకం ఆయనదిది..ఆయనకు సినిమాలు లేకుంటే ఆధ్యాత్మిక అంటూ వేరో లోకంలో బతుకుతుంటాడు.. ఆయన ఏపీ ప్రజల గురించి మాట్లాడుతాడని ఆశించడమే వేస్ట్..

తెలుగు సిన్మాకే పెదరాయుడుని నేను అని గప్పాలు కొట్టుకునే నటుడు మన మోహన్ బాబు గారు..ఫ్యామిలీ ఫ్యామిలీ సినీ ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందంటే అది సీమాంధ్ర ప్రజల చలవ వల్లనే కదా..నేను అరిస్తే చరుస్తా..చరిస్తే కరుస్తా అంటూ అందరి మీద కయ్ కయ్ మంటుటాడు ఈ పెదరాయుడు.. వజ్రోత్సవాల సందర్భంగా నేనే లెజండరీ యాక్టర్ నంటూ ఏకధాటిగా రెండున్నర గంటలపాటు లెక్చర్ దంచిన మోహన్ బాబుగారు..ఇప్పుడు ప్రత్యేక హోదాపై చంద్రబాబుగారు, మోదీ కల్సి ఏపీ ప్రజలను మోసం చేస్తున్న తీరుపై కనీసం రెండు మాటలు మాట్లాడే తీరిక కూడా లేకుండా పోయింది.. కొడుకు పెళ్లికి ఫ్యామిలీ ఫ్యామిలీ ఢిల్లీకి పోయి మోదీని కల్సి ఫోటోలు దిగి వచ్చారుగా..మరి ఇప్పుడు అదే మోదీ తెలుగు ప్రజల గొంతు కోస్తుంటే మన పెద రాయుడు గారు ఎక్కడ దాక్కున్నారు.. ప్రజల తరపున కూర్చుని తప్పు చేసిన మోదీకు, చంద్రబాబుకు ఏం శిక్ష విధించాల్లో తనదైన స్టైల్లో తీర్పు ఇవ్వచ్చుగా.. మరి మన పెదరాయుడు నాకంత సీన్ లేదప్పా అంటే సినిమాల్లో కానే కాదు..ప్రజల దృష్టిలో కూడా విలన్ గా నిలవడం ఖాయం..

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రభాస్ ల విషయానికి వద్దాం..కృష్ణగారబ్బాయిగా మహేష్ బాబును నెత్తినపెట్టుకుంది సీమాంధ్ర ప్రజలే…ఇప్పుడు మహేష్ బాబు టాలీవుడ్ నెంబవర్ వన్ హీరోగా వెలుగుతున్నాడంటే అది సీమాంధ్ర ప్రజల అభిమానం వల్లనే..పార్టీలకు, కులాలకు అతీతంగా సీమాంధ్ర ప్రజలు మహేష్ ను ఆదరించారు..మహేష్ బాబు ఇప్పుడు ఆగర్భ శ్రీమంతుడు అయ్యాడంటే దానికి కారణం సీమాంధ్ర ప్రేక్షకుల అభిమానం వల్లనే..ఊరు మనకు చాలా
ఇచ్చింది…ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి లేకుంటే లావెక్కుతా అంటే..ప్రేక్షకులు వందల కోట్లు ఈ శ్రీమంతుడికి కుమ్మరించారు..మరి ఇప్పుడు తనను ఇంతటి శ్రీమంతుడిని చేసిన ఏపీ ప్రజలకు రుణం తీర్చుకోవాల్సిన సమయం వస్తే.. ఆ ప్రత్యేక హోదాలు..ప్యాకేజీలంటూ ఆ పెద్ద పెద్ద సబ్జెక్టులు నాకు తెలియదు..నాకు తెల్సిందల్లా స్టార్ ..కెమెరా..యాక్షన్, ప్యాకప్ అంటోన్న మహేష్ ను చూసి ఏపీ ప్రజలకు నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు..
అలాగే బాహుబలి ప్రభాస్..ఎన్ని సిన్మాలు చేసినా రాని కీర్తిని ఒకే ఒక్క సిన్మాతో కట్టబెట్టారు ఏపీ ప్రజలు..మరి సిన్మాలో తన మహిశ్మతి రాజ్యానికి ఆపద వస్తే కాలకేయుల మీద అరివీర భయంకరుడిలా విజృంభించిన ఈ బాహుబలి..ఇప్పుడు తన ఆంధ్రా రాజ్యంపై పడిన కాలకేయుల్లాంటి మోదీ, చంద్రబాబు మీద పోరాటం దేవుడెరుగు..కనీసం నోట్లోంచి ఒక్క డైలాగ్ కూడా వదలకుండా బాహుబల్లిలా సిన్మాకే కరుచుకుని కూర్చోవడం మరీ దారుణం..

ఇలా మన ఘనత వహించిన మన హీరోలంతా తాము పుట్టిన గడ్డ ప్రత్యేక హోదా రాకుంటే..మున్ముందు పుట్టగతులు లేకుండా పోతుందన్న వాస్తవం తెల్సినా ..ఏమి తెలియనట్టు నటిస్తూ ..తెరమీదే కాదు నిజజీవితంలో కూడా తాము మహానటులం అని నిరూపించుకుంటున్నారు..అదే కన్నడ , తమిళ హీరోలను చూడండి..తమ ప్రాంత ప్రయోజనాల కోసం అక్కడి హీరోలు, హీరోయిన్లు అంతా ప్రజల తరపున మాట్లాడుతారు..ప్రజలతో కల్సి పోరాడుతారు..కావేరీ జలాల
వివాదంలో కన్నడ, తమిళ హీరోలు తమ ప్రజల తరపున వకాల్తా పుచ్చుకుని పోరాడుతున్నారు..అవసరమైతే ఈ విషయంలో తమ వ్యక్తిగత ప్రయోజనాలను కూడా పణంగా పెట్డడానికి వెనుకానడరు..కానీ మన హీరోలు అలా కాదు..ఏం మాట్లాడితే ఎవరికి కోపం వస్తుందో..ఎందుకొచ్చిన గోల మన సిన్మాలు, ఆస్తులు బాగుంటే చాలు..ప్రజలు ఎటుపోతే ఏంటి అని తడిగుడ్డ వేసుకుని ఇంట్లో తొంగుంటారు.. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని ప్రత్యేక హోదాపై పోరాడడం పక్కన
పెట్టండి..కనీసం మాట్లాడినా చాలు..మరి మన హీరోలకు అంత దమ్ముందా..లేదనే అనిపిస్తోంది..ఏమిరా బాలరాజు. ఈ హీరోల వల్ల ఆంధ్రాకు ఒరిగిన లాభం..ఛీఛీ అనుకోవడం తప్ప చేసేదేం లేదు..

Leave a Reply