కంచుకోట‌లో టీఆర్ఎస్ కు షాక్!!

0
238
trs lot kanchukota elelctions

Posted [relativedate]

trs lot kanchukota elelctions
ఉత్త‌ర తెలంగాణ‌లో టీఆర్ఎస్ కు తిరుగులేదు. వ‌రంగ‌ల్ నుంచి ఆదిలాబాద్ వ‌ర‌కు మొత్తం గులాబీదే ఆధిప‌త్యం. ఇక వ‌రంగ‌ల్ జిల్లాలో అయితే కారుకు గ‌ట్టి ప‌ట్టుంది. కానీ అలాంటి కంచుకోట‌లో టీఆర్ఎస్ కు గ‌ట్టి షాక్ త‌గిలింది. ముల్క‌నూర్ స‌హ‌కార బ్యాంకు ఎన్నిక‌ల్లో గులాబీ అభ్య‌ర్థులు చిత్తుగా ఓడిపోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

వ‌రంగ‌ల్ జిల్లా భీమ‌దేవ‌ర‌ప‌ల్లి మండ‌లం ముల్క‌నూర్ స‌హ‌కార బ్యాంకుకు ఐదు డైరెక్ట‌ర్ స్థానాల కోసం ఎన్నిక‌లు జ‌రిగాయి. ఇందులో ప్ర‌స్తుత బ్యాంకు అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే ప్ర‌వీణ్ రెడ్డి ప్యానల్ నుంచి ఐదుగురు పోటీ ప‌డ్డారు. ఇక టీఆర్ఎస్ బ‌ల‌ప‌ర్చిన ఐదుగురు అభ్యర్థులు బ‌రిలో నిలిచారు. గులాబీకి గ‌ట్టి ప‌ట్టు ఉండ‌డంతో .. పోటీ ఏక‌ప‌క్ష‌మే అనుకున్నారంతా. నిజంగానే పోటీ ఏక‌ప‌క్షంగానే జ‌రిగింది. కానీ గెలిచింది టీఆర్ఎస్ కాదు… ప్ర‌వీణ్ రెడ్డి వ‌ర్గం కావ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌వీణ్ రెడ్డి ప్యాన‌ల్ అభ్య‌ర్థుల‌కు మొత్తం 2097 ఓట్లు పోల‌య్యాయి. ఇందులో ప్ర‌వీణ్ రెడ్డి ప్యాన‌ల్ అభ్య‌ర్థుల‌కు 1650 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్య‌ర్థులు కేవ‌లం 350 ఓట్ల‌తోనే స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. ప్ర‌వీణ్ రెడ్డి ప్యాన‌ల్ ఘ‌న విజ‌యం సాధించింది. ఏకంగా 80 శాతం ఓట్లు ప్ర‌వీణ్ ప్యాన‌ల్ కు రావ‌డం విశేషం!!

టీఆర్ఎస్ బ‌లంగా ఉన్న వ‌రంగ‌ల్ జిల్లాలో ఇంత ఘోర‌మైన ఓట‌మిని ఆ పార్టీ అస్స‌లు ఊహించ‌లేక‌పోతోంది. నిజంగానే పార్టీ అంత వీక్ గా ఉందా అని గుస‌గుస‌లాడుకుంటున్నారు క్యాడ‌ర్. వాపును చూసి బ‌లుపు అనుకున్నామా అని కూడా చ‌ర్చించుకుంటున్నారు. ఇంటిదొంగ‌లే ఈ ఓట‌మికి కార‌ణ‌మై ఉంటార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో హైక‌మాండ్ కూడా ఈ ఎన్నిక‌లపై ఆరా తీసింద‌ట‌. ఎన్నిక‌ల్లో ఓట‌మిపై రిపోర్ట్ ఇవ్వాల‌ని పార్టీ అగ్ర‌నేత‌లు జిల్లా నాయ‌కుల‌కు ఆదేశాలిచ్చిన‌ట్టు స‌మాచారం. మ‌రి ఈ పోస్టు మార్టంలో ఏం తేల‌నుంద‌నేది ఇప్పుడు ఆసక్తిక‌రంగా మారింది.

Leave a Reply