టీఆర్ఎస్ ను డిఫెన్స్ లోకి నెట్టేసిన జ‌గ‌దీశ్ రెడ్డి?

Posted March 23, 2017

trs minister jagadish reddy comments on modi about power issue in assembly
ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ- తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌ధ్య మంచి స్నేహ‌బంధం ఉంది. అందుకే టీఆర్ఎస్ .. ఎన్డీయేలో లేక‌పోయిన‌ప్ప‌టికీ కేసీఆర్… ఛాన్స్ దొరికిన‌ప్పుడ‌ల్లా మోడీని ప్ర‌శంసిస్తారు. అటు మోడీకి కూడా కేసీఆర్ పై మంచి అభిప్రాయ‌ముంది. అందుకే కేంద్ర‌ప్ర‌భుత్వం- తెలంగాణ మ‌ధ్య మంచి సంబంధాలు కొన‌సాగుతున్నాయి. తెలంగాణ‌కు రావాల్సిన నిధులు, ఇత‌రత్రా ప‌నులు చ‌క‌చ‌కా జ‌రిగిపోతున్నాయి. ఆ ప్ర‌భావ‌మో .. ఏమో కానీ తెలంగాణ బీజేపీ కూడా టీఆర్ఎస్ పై పెద్ద‌గా విమ‌ర్శ‌లు చేయ‌డం లేదు. కానీ బుధ‌వారం ఒక్క‌సారిగా సీన్ మారిపోయింది. మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి స్పీచ్ ఒక్క‌సారిగా అగ్గిని రాజేసింది.

క‌రెంటు విష‌యంపై మాట్లాడుతున్న‌ప్పుడు మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి … ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ పేరును లేవ‌నెత్తారు. మోడీ స‌ర్కార్ తెలంగాణ‌కు ప్ర‌త్యేకంగా ఇచ్చిందేమీ లేద‌ని స్ప‌ష్టం చేశారు. అంతేకాదు ఆ మాట‌ల సంద‌ర్భంగా ఆయ‌న ముఖంలో ఆవేశం క‌నిపించింది. దీంతో ప్ర‌శాంతంగా సాగిపోతున్న అసెంబ్లీలో ఒక్క‌సారిగా అగ్గి రాజుకుంది. బీజేపీ ఎమ్మెల్యేలు … జ‌గదీశ్ రెడ్డి తీరుపై అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ప్ర‌ధాని మోడీపై ఆయ‌న భాష అభ్యంత‌ర‌క‌రంగా ఉంద‌ని వాదించారు.

మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి ప్ర‌సంగంతో ఇంత ర‌చ్చ జ‌రుగుతుందని ఎవ‌రూ అంచ‌నా వేయ‌లేక‌పోయారు. క‌డియం శ్రీహ‌రి, హ‌రీశ్ రావు లాంటి సీనియ‌ర్లు జోక్యం చేసుకున్నా ప‌రిస్థితి మార‌లేదు. దీంతో ఒక్క‌సారిగా ప్ర‌భుత్వం డిఫెన్స్ లో ప‌డిపోయింది. అందుకే టీఆర్ఎస్ లోనూ జ‌గ‌దీశ్ రెడ్డి తీరుపై అభ్యంత‌రం వ్య‌క్త‌మవుతోంద‌న్న గుస‌గుసలు వినిపిస్తున్నాయి. అన‌వ‌స‌రంగా మోడీ పేరు ఎత్త‌డం ద్వారా కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టార‌ని ఎమ్మెల్యేలు అభిప్రాయ‌ప‌డుతున్నార‌ట‌. జ‌గ‌దీశ్ రెడ్డి అలా మాట్లాడాల్సింది కాద‌ని కొంద‌రు మంత్రులు కూడా అంగీక‌రిస్తున్నార‌ని టాక్.

ఈ అసెంబ్లీ స‌మావేశాల్లో ఇప్ప‌టిదాకా టీఆర్ఎస్ ప్ర‌భుత్వానిదే పై చేయి అయ్యింది. కానీ జ‌గ‌దీశ్ రెడ్డి వ్య‌వ‌హారంతో ఒక్క‌సారిగా కేసీఆర్ స‌ర్కార్ డిఫెన్స్ లో ప‌డిపోయింది. తొలిసారిగా ప్ర‌భుత్వం అసెంబ్లీలో ప‌దేప‌దే వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది. ఈ వ్య‌వ‌హారంపై సీఎం కేసీఆర్ కూడా ఆరా తీశార‌ట‌. కేంద్ర‌ప్ర‌భుత్వంతో గివ్ అండ్ టేక్ పాల‌సీతో ముందుకు పోతున్న త‌రుణంలో … ఇలాంటి రెచ్చ‌గొట్టే ప్రసంగాలు చేయ‌డం స‌రికాద‌ని జ‌గ‌దీశ్ రెడ్డిని మంద‌లించిన‌ట్టు స‌మాచారం. మొత్తానికి ఈ సెష‌న్ లో తొలిసారిగా టీఆర్ఎస్ ప్ర‌భుత్వం సెల్ప్ గోల్ చేసుకున్న‌ట్ట‌య్యింది!!!

SHARE