సర్వే కళ్లజోళ్లు పగలగొట్టిన ట్రంప్….

Posted November 10, 2016

trump won the media lostఅమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు జనానికి షాక్ అని చాలా మంది అనుకుంటున్నారు, అపోహపడుతున్నారు, కానీ అది నిజం కాదు… నిజానికి ఆ షాక్ తగిలింది మీడియా,సర్వే సంస్థలకి మాత్రమే … జనాభిప్రాయం జనానికి ఎందుకు షాక్ అవుతుంది .? ఆ జనాన్ని గొర్రెల మందగా భావించి తమ అభిప్రాయాన్ని ప్రజాభిప్రాయంగా మార్చేందుకు వారికి తమ కళ్లజోళ్లు పెట్టిన మీడియా,సర్వే సంస్థలకు షాక్ తగిలింది. ట్రంప్ గెలుపుతో మీడియా,సర్వే సంస్థల కళ్లజోళ్లు పగిలిపోయాయి. ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు.. చివరి సారి కాదు. కాకపోతే ఈ సారి ప్రపంచాన్నంతా ఆకర్షించిన ఎన్నికలు కావడంతో మీడియా, సర్వే సంస్థల డొల్లతనం బయటపడింది..

మీడియా సంస్థల అధిపతులు, వారి ప్రయోజనాల గురించి జనానికిప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరేమిటో అందరికీ తెలుసు. కాకపోతే సర్వేల గురించి ఇంకా జనానికి పూర్తిగా అర్ధం కావడంలేదు. మొన్న ఢిల్లీ ఎన్నికలు, నిన్న బీహార్, తమిళనాడు ఎన్నికలు.. ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు… పోటాపోటీ పరిస్థితి ఉన్నప్పుడు… ప్రజలు గుట్టుగా వ్యవహరించినపుడు ఒక్కసారి కూడా సర్వే సంస్థలు సరైన అంచనాలు వేయలేకపోతున్నాయి.. కేవలం మీడియా కధనాల ఆధారంగా ఓ అంచనానికి వచ్చి వాటికి అర్థంకాని గణాంకాల ముసుగులేసి, సెఫాలజీ పేరుతో జనం మీదకు వదులుతున్నాయి. కేవలం మీడియా అభిప్రాయాలకు వారధిగా పనిచేస్తున్నాయే తప్ప ఇటు ప్రజల మనోభావాలను… అటు రాజకీయ పార్టీల అవసరాలకు తగ్గట్లు వ్యవహరించలేకపోతున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ఏపీ,తెలంగాణ ఫలితాల గురించి ప్రఖ్యాత నీల్సన్-org -Ntv సంయుక్తంగా నిర్వహించిన సర్వే ఫలితాలు ఎలా బోర్లా పడ్డాయో చూశాము.. ఆ తర్వాత కూడా వరుస వైఫల్యాలు వచ్చినా రాజకీయ పక్షాలు సర్వే సంస్థల డొల్ల విధానాన్నే అనుసరిస్తున్నాయి. ప్రస్తుత సర్వే విధానంలో వున్న ప్రధాన లోపాలు ఇవే…

NTV nielsen fault surveyశాంపిల్ శాతం..:

ప్రస్తుతం సర్వేలు చేస్తున్న సంస్థలు దాదాపు అటు ఇటుగా ఒక్క శాతం శాంపిల్ తీసుకుంటున్నాయి. అంటే 100 మంది ఓటర్లలో ఒక్కరిని మాత్రమే ప్రశ్నిస్తాయి. ఆ ఒక్క శాతంలో 100 ల కొద్దీ భాషలు, వేల కొద్దీ కులాలు వున్నా సంక్లిష్ట సమాజంలో అన్ని వర్గాల వాణిని ప్రతిబింబించడం సాధ్యమా? కానే కాదు, ఉన్నది అదే దారి కాబట్టి… తప్పో ఒప్పో తెలుసుకోకుండా అదే దారిలో నడుస్తున్నారు… అదెలాగో చూద్దాం …

వెయ్యి ఓట్లున్న ఓ గ్రామాన్ని ఉదాహరణగా తీసుకుందాం.. అందులో దాదాపు 20 నుంచి 25 కులాలు వారుంటారు.. రెండు మూడు కులాలు ప్రభావ శీలంగా వ్యవహరిస్తాయి .కానీ ఆ ఊరిలో తీసే శాంపిల్ సంఖ్య 10 లోపే.. 20 కులాలున్న చోట పది శాంపిల్ తో ఫలితమెలా సజావుగా వస్తుంది? ఒకే కులంతో రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళుంటే… అప్పుడేంచేస్తారు ? 10 రెడ్డి కుటుంబాల్లో 9 వైసీపీ కి మొగ్గు చూపాయి అనుకుందాం.. ఒక్క కుటుంబ టీడీపీ తో ఉంటే… రెడ్డి కులం నుంచి తీయాల్సిన ఒక శాంపిల్, ఆ ఒక్క కుటుంబం వారిది అయితే.. ఫలితం పూర్తి రివర్స్ లో వస్తుంది కదా.? ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని కూడా అర్ధం చేసుకోకుండా సర్వేలు చేస్తున్నారు.. చేయించుకుంటున్నారు . పాశ్చాత్య సమాజాలకి భారతీయ సమాజానికి వున్నా వైరుధ్యాన్ని అర్ధం చేసుకోకుండా మూస పద్దతిలో చేస్తున్న సర్వే ల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.

సర్వే సిబ్బంది..:

అదే ఊరిలో పుట్టి.. అదే ఊరిలో పెరిగిన వాళ్ళు సైతం ఎన్నికల సమయంలో చాపకింద నీరులా వచ్చే మార్పుని పసిగట్టలేరు. కానీ ప్రస్తుతం సర్వే లు నిర్వహించే వాళ్ళు వినియోగించే సిబ్బందికి ఆ ఊరి దారి కూడా తెలియదు. ఇక అక్కడ రాజకీయ సంస్కృతి ఎలా తెలుస్తుంది. స్థానిక రాజకీయం మీద కనీస అవగాహన ఉంటేనే శాంపిల్ ఎక్కడ తీయాలో అర్ధం అవుతుంది. హార్వార్డ్ విశ్వవిద్యాలయం నుంచి MBA చేసి వచ్చిన వారి కన్నా ఊళ్ళో రచ్చబండ దగ్గర కూర్చునే వారికే స్థానిక రాజకీయం పై అవగాహన ఉంటుంది. కాకపోతే వారికి వ్యక్తిగత అభిప్రాయాలు కూడా ఉంటాయి కాబట్టి అభిప్రాయ సేకరణలో కాస్త ఫిల్టరింగ్ అవసరమవుతోంది. అయితే హార్వార్డ్ అభ్యర్థి కన్నా ఆ ఊరిలో పని చేసే కొన్ని కుల వృత్తుల వాళ్ళు అక్కడ సమాచారం అందించగలరు. అయితే ఈ విషయాన్ని ఏ సర్వే సంస్థలు, రాజకీయ పార్టీలు పట్టించుకోకుండా బోల్తాపడుతున్నాయి. పదేపదే పాత చింతకాయ పద్దతిలో వెళ్లి చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నాయి.

సర్వేలకు జవాబు దొరకని ప్రశ్నలు…

పైగా ప్రస్తుత విధానాల్లో సర్వే లు చాలా ప్రశ్నలకు జవాబు ఇవ్వలేవు…

1 . సర్వే ఫలితాలు ఉన్న పరిస్థితిని ప్రతిబింబిస్తాయోమో కానీ పార్టీలకు అవసరమైన పరిష్కారాలు చెప్పజాలవు..

2 . సర్వే ఫలితాల కాలపరిమితి తాత్కాలికం మాత్రమే…

3 . సర్వే ఫలితాన్ని సరిచూసుకోడానికి మరో సర్వే తప్ప ఆధారం ఉండదు.దాంతో సర్వే లు, కేవలం క్వశ్చన్ బ్యాంక్స్ లా ప్రశ్నలు, జవాబులు ఇస్తున్నాయి తప్ప.. వాటి మూలమైన క్షేత్రస్థాయి పరిస్థితులకు అద్దంపట్టే టెక్స్ట్ బుక్ లు తయారుచేయలేకబోతున్నాయి.

దీర్ఘకాలిక ప్రణాళిక,వ్యూహాలు, అభిప్రాయ సేకరణలో స్పష్టత లేకుండా ఇలాంటి సర్వే లు ఎన్ని చేసినా పై పై పొంగుని పట్టగలవే గానీ… లోలోన పరిస్థితి చూడలేవు.. వీటికి ప్రత్యామ్న్యాయంగా అభిప్రాయ సేకరణకు సంబంధించి సమగ్ర విధానాలు కొందరు రూపొందించినా వున్న పార్టీలు, నేతలకు అంతటి ఓపిక లేకుండా పోతుంది. ముందునుంచీ జాగ్రత్త పడకుండా అప్పటికప్పుడు సర్వే పేరుతో డబ్బు ఖర్చు చేసి వచ్చిన ఫలితాలు నిజమని భ్రమల్లో బతుకుతున్నారు.. అది నిజం కాదని తెలియగానే మరో సంస్థ దగ్గరకు వెళ్లడం తప్ప సమాచార సేకరణలో విప్లవాత్మక మార్పులకి మాత్రం శ్రీకారం చుట్టడం లేదు, అది జరిగేదాకా సర్వే లు కేవలం చేయించుకునే వాళ్ళ చేతి చమురు వదిలించడానికి .. చేసే వాళ్ళకి ఆదాయ వనరుగా మారుతుంది. అది ప్రజాభిప్రాయానికి ప్రతిబింబం కాదు.. కానేరదు.. ఖద్దరు చొక్కాలు, తెల్లటోపీలు మేల్కొనేదెన్నడో.?

*కిరణ్ కుమార్
9703330425

SHARE