ఇక ఎఫ్ ఎం రేడియో తరహాలో స్థానిక చానల్స్

0
802

  tv channels coming like fm radio

 • చర్చా పత్రం విడుదల చేసిన ట్రాయ్
 • అభిప్రాయాలు చెప్పాలని సూచన
 • ఎమ్మెస్వోల స్థానిక చానల్స్ మీద పెను ప్రభావం
 • మొబైల్ లోనూ ప్రసారాల అందుబాటు
 • అయోమయంలో బ్రాడ్ కాస్టర్లు
 • స్పందనలు పంపాల్సిన గడువు తేదీ జులై 22
 • వాటి మీద ప్రతిస్పందనలకు గడువు ఆగస్టు 5

మూడు తరాల ప్రజలకు సుపరిచితమైన దూరదర్శన్ పాక్షికంగా ప్రైవేటు పరం కాబోతోందా? ఇప్పటికే రేడియోలో ఎఫ్ ఎం రూపంలో ప్రవేశించిన ప్రైవేటు రంగం ఇక దృశ్యమాధ్యమంలోనూ అడుగుపెట్టబోతున్నదా? అవును. అది నిజమే. ఆ దిశలో ప్రభుత్వం అడుగులేస్తోంది. గుత్తాధిపత్యం ఎంతో కాలం సాగదనటానికి అదే నిదర్శనం. డిడి తన టెరెస్ట్రియల్ ప్రసారాలను ప్రైవేటు రంగానికి ఇవ్వబోతోంది.

దూరదర్శన్ ఇప్పటి దాకా పూర్తిగా ప్రజాప్రసార సంస్థగా ప్రసారభారతి ఆధ్వర్యంలోనే ఉంటూ వచ్చింది. ఆకాశవాణికూడా గతంలో అలాగే ఉన్నప్పటికీ ప్రైవేట్ ఎఫ్ ఎం రేడియోలకు అనుమతించటం ద్వారా ప్రసారభారతికి అదొక ఆదాయ వనరుగా మారింది. ఇప్పుడు అదే పద్ధతి టీవీకి కూడా వర్తింపజేయాలనే ఆలోచన వచ్చింది. దీనిమీద అభిప్రాయాలు చెప్పాలని టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అందరికీ విజ్ఞప్తి చేస్తోంది. ఈ మేరకు ఒక చర్చాపత్రాన్ని విడుదలచేసింది.

దూరదర్శన్ ప్రసారాలు ఒకప్పుడు టెరెస్ట్రియల్ విధానంలో మాత్రమే అందేవి. అంటే దూరదర్శన్ ట్రాన్స్ మిషన్ కేంద్రాలలోని ట్రాన్స్ మిటర్లు వాటి పరిసరప్రాంతాలలో ఎంత దూరం వరకు తరంగాలు పంపగలిగితే అంతవరకు ప్రసారాలు అందుతాయి. అంటే ట్రాన్స్ మిటర్ శక్తినిబట్టి ప్రసారాలు అందే వ్యాసార్థం ఆధారపడి ఉండేది. ఎక్కడైనా తరంగాలు అందుబాటులో లేకపోతే అక్కడ మరో ట్రాన్స్ మిటర్ సాయంతో రిలే చేసేవారు. అయినప్పటికీ చాలా చోట్ల కొండ ప్రాంతాలాలో ప్రసారాలు సరిగా వచ్చేవి కావు. వచ్చినా కొన్ని చోట్ల బొమ్మ పక్కనే దాని నీడ కూడా వచ్చేది. అయితే, అదంతా టెరెస్ట్రియల్ యుగం.

ఆ తరువాత కాలంలో .. మనకు శాటిలైట్ ప్రసారాలు అందుబాటులోకి వచ్చాయి. ఏషియన్ గేమ్స్ ని ఎన్నో దేశాలకు అందించగలగటానికి కారణం శాటిలైట్ ప్రసారాలు అందుబాటులోకి రావటమే. ఆ తరువాత కాలంలో కేబుల్ ఆపరేటర్లు కూడా శాటిలైట్ ప్రసారాలు అందుకుని ఇంటింటికీ ఇవ్వటం మొదలు పెట్టారు. ఒకవైపు టెరెస్ట్రియల్ ప్రసారాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. అందువలన కేబుల్ కనెక్షన్ లేకపోయినా దూరదర్శన్ ప్రసారాలకు మాత్రం ఎలాంటి ఆటంకమూ లేకుండా అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. దేశంలో కేవలం ఐదు శాతానికి మించి టెరెస్ట్రియల్ ప్రసారాలమీద ఆధారపడటం లేదని తెలిసినా, అలాంటి ప్రజలకు దూరదర్శన్ దూరం కాకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశం.

ప్రస్తుతం టెరెస్ట్రియల్ ప్రసారాలలో దూరదర్శన్ దే గుత్తాధిపత్యం. ప్రపంచంలోనే అతిపెద్ద టెరెస్ట్రియల్ నెట్ వర్క్ గా భారత దూరదర్శన్ కు పేరున్నది. మొత్తం 1412 అనలాగ్ ట్రాన్స్ మిటర్ల నెట్ వర్క్ దూరదర్శన్ సొంతం. వాటి సాయంతో దేశ వ్యాప్తంగా డిడి నేషనల్, డిడి న్యూస్ చానల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. అదే సమయంలో డిడి నెట్ వర్క్ ద్వారా అనేక ప్రాంతీయ చానల్స్ ప్రసారాలు కూడా అందుతున్నాయి.  ఆ విధంగా దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజల స్థానిక అవసరాలు తీర్చగలుగుతున్నాయి. దూరదర్శన్ ద్వారా అందే చానల్స్ అన్నీ ఉచితమే. పైగా, దూరదర్శన్ వారి డిటిహెచ్ వేదిక ఫ్రీడిష్ కూడా ఉచితం.

దూరదర్శన్ కు ఉన్నట్టే రేడియోకు కూడా ట్రాన్స్ మిటర్ టవర్లున్నాయి. వాటిని పూర్తి స్థాయిలో వాడుకోవటానికి ఫ్రీక్వెన్సీ అమ్మాలన్న  ఆలోచనను ప్రసార భారతి ముందుకు నడిపించటంతో ప్రైవేట్ ఎఫ్ ఎం రేడియోల శకం మొదలైంది. పదేళ్ళపాటు టవర్లు తదితర మౌలిక సదుపాయాలు వాడుకున్నందుకు ఆపరేటర్లు ఫీజు చెల్లించాల్సి రావటం, అది కూడా వేలంలో నిర్ణయించటం, ఆదాయంలో పది శాతాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలన్న నిబంధన విధించటం లాంటివి ప్రసారభారతికి ఆదాయం తెచ్చిపెట్టాయి. ఇప్పుడు అదే పద్ధతిని టీవీ ట్రాన్స్ మిటర్లకూ వర్తింపజేయబోతున్నారు.

అంటే, ప్రభుత్వం కొన్ని ఫ్రీక్వెన్సీలు పదేళ్ళపాటు లీజుకిస్తుంది. అలా లీజుకు తీసుకున్నవాళ్ళు స్థానికంగా టీవీ చానల్స్ నడుపుకోవచ్చు. ఒకటీ రెండు జిల్లాలకొకటి చొప్పున స్థానిక చానల్స్ నడుపుకునే వెసులుబాటు కలుగుతుంది. ఈ ట్రాన్స్ మిటర్ల డిజిటైజేషన్ ప్రక్రియ కూడా ఎంతో వేగంగా జరుగుతోంది. ఈ దశలో ప్రసారభారతి తన ట్రాన్స్ మిటర్లను సమర్థంగా వాడుకోగలిగేలా ప్రైవేట్ ఆపరేటర్లకు ఇవ్వటం ఎంత మేరకు సమంజసమనే ప్రశ్నను ట్రాయ్ చర్చకు పెట్టింది. ఒకవిధంగా అభిప్రాయసేకరణకు జనం ముందుంచింది. ప్రధానంగా ప్రజలను అడుగుతున్న ప్రశ్నలు ఇవి:

 1. టీవీ చానల్స్ పంపిణీకి బహుళ వేదికలు అందుబాటులోకి వచ్చిన ఈ తరుణంలో డిజిటల్ టెరెస్ట్రియల్ ట్రాన్స్ మిషన్ ప్రవేశపెట్టాల్సిన అవసరముందని భావిస్తున్నారా?
 2. మీ సమాధానం అవును అయితే, దేశ వ్యాప్తంగా దీన్ని అమలు చేయటానికి  ఏది సరైన వ్యూహమని భావిస్తారు?
 3.  డిజిటల్ టెరెస్ట్రియల్ ట్రాన్స్ మిషన్ ను ప్రైవేట్ వారికోసం ఇవ్వటానికి సిద్ధపడాలా?
 4. డిటిటి నెట్ వర్క్ అమలుచేయటానికి అనుసరించే విధానం ఎలా ఉండాలి(ఎమ్ ఎఫ్ ఎన్/ఎస్ ఎఫ్ ఎన్ /హైబ్రిడ్?
 5. ఏ ప్రదేశంలోనైనా డిటిటి మల్టిప్లెక్స్ కు అభిలషణీయమైన పరిమాణం కనుక్కోవటానికి ప్రాతిపదిక ఏముండాలి?
 6. ఒక్కో డిజిటల్ టెరెస్ట్రియల్ ట్రాన్స్ మిషన్ ఆపరేటర్ కు   ఎన్ని నగరాల్లో, ఎన్ని పెద్ద పట్టణాల్లో ఎన్ని గ్రామీణ ప్రాంతల్లో గరిష్ఠంగా అవకాశమివ్వవచ్చు?  ఎందుకు?
 7. డిజిటల్ 32 టెరెస్ట్రియల్ ట్రాన్స్ మిషన్ అమలుకోసం నేషనల్ ఫ్రీక్వెన్సీ అలొకేషన్ ప్లాన్ ప్రకారం ఏది సరైన ఫ్రీక్వెన్సీ బాండ్ అవుతుంది?
 8. డిజిటల్ టెరెస్ట్రియల్ ట్రాన్స్ మిషన్ (డిటిటి) కోసం ప్రత్యేకంగా స్పెక్ట్రమ్ ను కేటాయించాల్సిన అవసరముందా? ఉంటే , ప్రస్తుతం బ్రాడ్ కాస్ట్ రంగాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఎంత పరిమాణంలో ఇస్తే బాగుంటుంది?
 9. దేశంలో టెరెస్ట్రియల్ టీవీ నెట్ వర్క్ డిజిటైజేషన్ కు ఎలాంటి ప్రణాళిక ఉండాలి?
 10. డిజిటల్ టెరెస్ట్రియల్ ట్రాన్స్ మిషన్ (డిటిటి) కి ప్రణాళిక సూచిస్తున్న నేపథ్యంలో టెరెస్ట్రియల్ టీవీ అనలాగ్ సిగ్నల్స్ ఏ రోజుతో నిలిపివేస్తే బాగుంటుందనుకుంటున్నారు?

టీవీ కార్యక్రమాల ప్రసారం కోసం డిజిటల్ టెరెస్ట్రియల్ ట్రాన్స్ మిషన్ ప్రక్రియను 1998 లో మొదటి సారిగా బ్రిటన్ వాడుకున్నది. అప్పట్లో డివిబి ప్రమాణాలు ఉన్నా, ఆ తరువాత అనేక కొత్త ప్రమాణాలు రూపుదిద్దుకుంటూ వచ్చాయి. ఈ దశలో రెండో తరం ప్రమాణాలు అమలులో ఉన్నాయి.  తాజా డిటిటి టెక్నాలజీలు గతంలోని అనలాగ్ టెరెస్ట్రియల్ ప్రసారాల టెక్నాలజీ కంటే ఎన్నో ప్రయోజనలాందిస్తుంది.

నాణ్యమైన దృశ్యం అందటంఒకటైతే, డిటిటి ట్రాన్స్ మిటర్ అనేక చానల్స్ ను ప్రసారం చేసే వీలుండటం వలన ఫ్రీక్వెన్సీ ని సమర్థంగా వాడుకోగలుగుతాం. టీవీ చానల్స్ ను మొబైల్ ఫోన్లో, ఐ పాడ్, టాబ్ లో కూడా అందుకునే వీలుంది. 7 లేదా 8 మెగా హెర్ట్జ్ టీవీ ఫ్రీక్వెన్సీ బాండ్ లో 10-12 స్టాండర్డ్ డెఫినిషన్ చానల్స్ పట్టే వీలుంది. లేదా, రేడియో సర్వీసులతో సహా రకరకాల సర్వీసులందించే పైప్ లైన్ లాగా కూడా వాడుకోవచ్చు.  అనలాగ్ టెరెస్ట్రియల్ బ్రాడ్ కాస్టింగ్ అయితే రకరకాల పరిమితులున్నాయి. ప్రసార నాణ్యత తక్కువగా ఉండటం, రేడియో ఫ్రీక్వెన్సీ పరంగా ఇబ్బందులు,  ఒక్కో చానల్ కు ఎక్కువ ఫ్రీక్వెన్సీ అవసరం పడటం వలన తక్కువ చానల్స్ మాత్రమే అందించగలగటం లాంటి సమస్యలు ఎదురవుతాయని ట్రాయ్ తన చర్చా పత్రంలో వివరించింది.

భారత్ సహా 138 దేశాలలో  డిజిటల్ టెరెస్ట్రియల్ ట్రాన్స్ మిషన్ మీద అధ్యయనం జరిపి ఒక పరిశోధనా సంస్థ విడుదలచేసిన నివేదికలోని అంశాలను కూడా ట్రాయ్ ప్రస్తావించింది. 2015 చివరినాటికి డిజిటల్ టెరెస్ట్రియల్ ట్రాన్స్ మిషన్ 74.6 శాతం ఉందని, ప్రపంచవ్యాప్తంగా117 కోట్ల ఇళ్ళకు చేరిందని అంచనా.  ఇక అనలాగ్ టెరెస్ట్రియల్ టీవీ విషయానికొస్తే 26 కోట్ల 19 లక్షల ఇళ్ళున్నాయి. డిజిటల్ టెరెస్ట్రియల్ ట్రాన్స్ మిషన్ ఇళ్ళలో 23 కోట్ల 94 లక్షలు ఉచిత టీవీ ఇళ్ళు కాగా మిగిలిన కోటీ 26 లక్షలు పే టీవీ ఇళ్ళు. 2010-2015 మధ్య కాలంలో 58 కోట్ల 40 లక్షల డిజిటల్ టీవీ ఇళ్ళు కొత్తగా చేరాయి. వాటిలో 15 కోట్ల 60 లక్షలు ప్రాథమికంగా డిజిటల్ టెరెస్ట్రియల్ ట్రాన్స్ మిషన్ నుంచి వచ్చినవేనని కూడా నివేదిక వెల్లడించిందని ట్రాయ్ పేర్కొంది.

అనేక దేశాలు అనలాగ్ టెరెస్ట్రియల్ నుంచి డిజిటల్ టెరెస్ట్రియల్ కు ఒక నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించుకోగా, భారత్ లో మాత్రం అలాంటి పని జరగలేదని ట్రాయ్ గుర్తుచేసింది. అయితే అనలాగ్ నుంచి డిజిటల్ కి మారటానికి ఇప్పటికే దూరదర్శన్ పనులు సాగిస్తున్న విషయం మాత్రం ప్రస్తావించింది. ఈ కార్యక్రమం ఎప్పటికి పూర్తవుతుందన్న స్పష్టత దూరదర్శన్ కు లేదని ట్రాయ్ విశ్లేషించింది.

సశేషం.

మిగతా భాగం తరువాతి సంచికలో…

  *తోట భావనారాయణ

Leave a Reply