టీవీ ఛానెల్స్ అడ్డ దారులు…

0
629
tv channels going to wrong way for bark ratings

Posted [relativedate]

bark

  • మీటర్లున్న ఇళ్ళ ఆచూకీ కోసం అడ్డదారుల్లో చానల్స్ యత్నాలు
  • బార్క్ రేటింగ్స్ లెక్కింపుకూ తప్పని తిప్పలు
  • మీటర్లున్న ఇళ్ళ ఆచూకీ తెలుసుకునే యత్నం
  • గతంలో తమిళనాట రాజ్ టీవీ మీద కేసు
  • ఇప్పుడు కేరళలో వెల్లువెత్తిన ఫిర్యాదులు
  • 10 ఇళ్ళు చెబితే ఐదు లక్షల లంచం
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బార్క్
  • అలాంటి చానల్స్ ను నిషేధిస్తామని హెచ్చరిక

టీవీ రేటింగ్స్ మీద ఒకప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. టామ్ ఆధ్వర్యంలో రేటింగ్స్ లెక్కింపులో ఎన్నో అవకతవకలు జరుగుతున్నట్టు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. శాంపిల్ ఇళ్ళు రహస్యంగా ఉంచలేకపోవటం కారణంగా టామ్ నిజాయితీని శంకించే పరిస్థితి వచ్చింది. ఆ మాటకొస్తే ఎన్డీటీవీ లాంటి చానల్స్ కోర్టుకెక్కాయి. ఆ విధంగా రేటింగ్స్ ఒకప్పుడు పెద్ద రాద్ధాంతమే సృష్టించింది. ఆ తరువాత పరిశ్రమ స్వయంగా ఏర్పాటు చేసుకున్న బార్క్ సైతం అదే విమర్శల సుడిగుండంలో ఎలా చిక్కుకుంది?

రేటింగ్ సంపాదించుకోవటం చానల్స్ కు జీవన్మరణ సమస్య. ఎక్కువ రేటింగ్స్ ఉంటే ఎక్కువ ప్రకటనలు వస్తాయి. ఎక్కువ ప్రకటనలు వస్తే ఎక్కువ ఆదాయం వస్తుంది. అందుకే, రేటింగ్స్ సంపాదించటమనేది చానల్స్ ముందున్న ప్రధాన సమస్య. రేటింగ్ ఎంత ఎక్కువ ఉంటే ఆ చానల్ కి సమాజంలో అంత ఎక్కువ హోదా. చానల్ కే కాదు, చానల్ లో పనిచేసే సిబ్బంది కూడా అలాంటి హోదా తమకు తాము ఆపాదించుకోవటం చూస్తున్నాం. అందుకే ప్రతివారం రేటింగ్స్ కోసం ఎదురుచూడటం ఒక అనివార్యమైన అలవాటుగా మారింది. ఉద్యోగుల ఉద్యోగభద్రత కూడా వాళ్ళు పనిచేసే చానల్ రేటింగ్స్ మీద, వాళ్లు బాధ్యత తీసుకున్న కార్యక్రమం రేటింగ్ మీద ఆధారపడి ఉందంటేనే ఈ రేటింగ్స్ ప్రాధాన్యం అర్థమవుతుంది.

అయితే ఈ రేటింగ్స్ ని ఎవరికి అనుకూలంగా వారు విశ్లేషించుకుంటూ అనుకూలమైన అంశాలను ప్రచారం చేసుకుంటూ లబ్ధిపొందాలని ప్రయత్నించటం గమనించవచ్చు. ప్రతి గురువారం మధ్యాహ్నం టీవీ చానల్స్ తమ రేటింగ్స్ కోసం ఉత్కంతతో ఎదురుచూస్తాయి. చానల్ గొప్పదనానికి అదే నిదర్శనమనే అభిప్రాయం సామాన్య ప్రజలకూ ఏర్పడింది. కేవలం రేటింగ్స్ ఆధారంగా చానల్ గొప్పతనాన్ని నిర్థారించటమే ఒక దారుణమైతే, అదే రేటింగ్స్ ని అన్ని చానల్స్ ఒక పౌరసంబంధాల ఆయుధంగా మలుచుకోవటం మరింత దురదృష్టకరం. దీన్ని బట్టి ప్రకటనలు సంపాదించుకోవటానికే రేటింగ్స్ పరిమితం కావటం లేదని అర్థమవుతోంది.

టెలివిజన్ చానళ్ల ప్రేక్షకాదరణను అంకెల్లోకి అనువదించే ప్రక్రియనే స్థూలంగా రేటింగ్స్ లెక్కింపుగా నిర్వచించుకోవచ్చు. ప్రకటనకర్తలకు ప్రేక్షకులను సమకూర్చిపెట్టటమే చానల్స్ పని కాబట్టి వీలైనంత ఎక్కువమందిని ఆకట్టుకోగలుగుతున్నట్టు నిరూపించుకోవటం వాటి బాధ్యతగా మారింది. ఆ విధంగా మరిన్ని ప్రకటనలు తెచ్చుకోగలిగే స్థోమతను చానల్స్ చాటుకుంటున్నాయి. ఒక టీవీ కార్యక్రమం ఎక్కువమంది చూడటానికీ, ఆ కార్యక్రమం ఎక్కువమందికి నచ్చడానికీ తేడా ఉంది. చూసిన వాళ్ళందరికీ నచ్చకపోవచ్చు. నచ్చని వాళ్ళు కూడా ఆ కాసేపు చూసినందుకు ఆటోమేటిక్ గా పేక్షకుల జాబితాలో చేరిపోతారు. ఆ విధంగా రేటింగ్స్ లెక్కలో వాళ్ళంతా ఆ చానల్ ప్రేక్షకులే. చానల్స్ ఇప్పుడు తమ కార్యక్రమాలకు వస్తున్న రేటింగ్స్ ను బట్టి ప్రకటనలు తెచ్చుకునే పరిస్థితి దాటిపోయింది. కేవలం రేటింగ్స్ కోసమే కార్యక్రమాలు రూపొందిస్తున్న పరిస్థితి ఏర్పడింది. దీనివలన ప్రేక్షకులకు అవసరమైన కార్యక్రమాలకంటే ప్రేక్షకులు కళ్లు తిప్పుకోకుండా చూస్తారనుకునే కార్యక్రమాలమీదనే చానల్స్ దృష్టిపెడుతున్నాయి. ఈ ధోరణి మీద విమర్శలు ఏ స్థాయికి వెళ్ళాయంటే అసలు రేటింగ్స్ అనేవే ఉండకూదదనే వాదన ఇప్పుడు తెరమీదకొచ్చింది. ఇది రేటింగ్స్ తప్పా ? రేటింగ్స్ ను ఆపాదించుకోవటంలో ఉన్న తప్పా? వాటిలో శాస్త్రీయత లోపించటం తప్పా ? ఇన్ని రకాల ప్రశ్నల నేపథ్యంలో ఈ రేటింగ్స్ లెక్కించే విధానం మొదలుకొని ఆపాదిస్తున్న తీరు వరకూ సమగ్రంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది.

audit beuro of circulationపత్రికల సర్క్యులేషన్ నిర్థారించటానికి కచ్చితమైన లెక్కలుంటాయి. అందువలన ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ( ఎబిసి) పని చాలా సులభం. టీవీ విషయానికొచ్చేసరికి అది కుదరదు. కేవలం సర్వే పధ్ధతి మీద ఆధారపడాలి. అందుకే ఇది వివాదాస్పదంగా మారింది. పత్రికల పట్ల పాఠకుల ఆదరణలో గంటలూ రోజులూ అంతగా ముఖ్యం కాదు. ఆరు నెలలకొకసారి ఫలితాలు వస్తాయి. టీవీలకు మాత్రం వారానికొకసారి రేటింగ్స్ వెలువడతాయి. ఇందుకోసం ప్రతి నిమిషం చానల్స్ ను రేటింగ్స్ సంస్థ గమనిస్తూ ఉంటుంది. అందుకే ప్రతిటీవీ చానల్ క్షణ క్షణానికీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కృషి చేయాలి. లేకపోతే రిమోట్ తన పని తాను చేసుకుపోతుంది. ఒకసారి ప్రేక్షకుడు అటువైపు వెళ్ళిపోతే ఇక్కడ ఎంత మంచి కార్యక్రమం ప్రసారం చేసినా ప్రయోజనం ఉండదు. ఇటువంటి పోటీ వాతావరణంలో టీవీ రేటింగ్స్ అత్యంత సున్నితమైన అంశంగా మారిపోయాయి.

రేటింగ్స్ లెక్కించేందుకు భారతదేశంలో టామ్ ( టెలివిజన్ ఆడియెన్స్ మెజర్మెంట్ ) అనే సంస్థ ఉండేది. నిజానికి పదిహేనేళ్ల కిందట టామ్, ఇన్టామ్ అనే రెండు సంస్థ లుండేవి. ఈ రెండూ సంస్థలూ భిన్నమైన ఫలితాలు ప్రకటిస్తూండటంతో అప్పట్లో కొంత వివాదం చెలరేగింది. అయితే, అదే సమయంలో అమెరికాలోని వీటి మాతృసంస్థలు కలిసిపోవటంతో సహజంగానే ఇక్కడ గుత్తాధిపత్యం ఏర్పడింది. ఇన్టామ్ మాయమైంది. ఆ తరువాత టామ్ చెప్పిందే వేదం. ప్రకటనకర్తలూ. ఏజెన్సీలూ , చానల్ యాజమాన్యాలూ తప్పనిసరిగా టామ్ సమాచారం మీదనే ఆధారపడుతూ వచ్చారు. అటువంటి గుత్తాధిపత్యంలో టామ్ ఎంత మేర బాధ్యతాయుతంగా వ్యవహరించిందో, ఏపాటి విశ్వసనీయత సంపాదించుకున్నదో పరిశీలించాలంటే లెక్కింపు విధానాన్నే సమీక్షించాల్సి ఉంది.

ముందే చెప్పినట్టు, రేటింగ్స్ లెక్కించటమంటే సర్వే మాత్రమే. టామ్ ఆధ్వర్యంలో జరిగిన సర్వే ఎంత దారుణంగా ఉండేదో చూస్తే రేటింగ్స్ మీద కొద్దిపాటి గౌరవం కూడా మిగలదు. దేశం మొత్తం మీద 15 కోట్లకు పైగా కేబుల్ కనెక్షన్లు ఉంటే కనీసం 12వేల ఇళ్లు కూడా ఈ సర్వే లో లేవు. అంటే పదివేల ఇళ్లలో ఒకటి చొప్పున మాత్రమే సర్వే చేసి దాన్నే ప్రేక్షకుల అభిప్రాయంగా చెబుతున్నారు. 120 కోట్ల జనాభాలో 50 వేల లోపు మంది అభిప్రాయమే రేటింగ్ అవుతోంది. అంటే పాతిక వేలమందిలో ఒకరిని లెక్కపెడుతున్నారన్నమాట. రెండు తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, ఇక్కడున్న రెండు కోట్ల కనెక్షన్లలో టామ్ 1200 ఇళ్లను మాత్రమే పరిగణనలోకి తీసుకునేది. ఈ లెక్కలనే మనం ప్రేక్షకుల తీర్పుగా భావిస్తూ వచ్చాం.

సర్వే పధ్ధతి కూడా అయోమయమే. ఆంధ్ర ప్రదేశ్ లో పట్టణాలను మూడు రకాలుగా విభజించారు. మొదటిది హైదరాబాద్ నగరం. ఆ తరువాత విభాగంలోకి విశాఖపట్నం, విజయవాడ నగరాలొస్తాయి. ఈ మూడు నగరాలు కాకుండా పది పట్టణాలు కూడా రేటింగ్ పరిశీలనలో ఉన్నాయి. వీటి జాబితా రహస్యమని టామ్ సంస్థ చెబుతుంది గాని ఇది బహిరంగ రహస్యమే. అన్ని చానల్స్ కూ ఈ పట్టణాలు తెలుసు. అందుకే అక్కడ చానల్ తప్పనిసరిగా వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎంటర్టైన్మెంట్ చానల్స్ అయితే రకరకాల కార్యక్రమాల ప్రిలిమినరీ సెలక్షన్స్ కు ఈ పట్టణాలనే ఎంచుకుంటాయి. న్యూస్ చానల్స్ కూడా ఆయా పట్టణాల వార్తలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాయి. అక్కడి ఎమ్ ఎస్ ఓ కు క్యారేజ్ ఫీజు చెల్లిస్తాయి.

ఇక లెక్కింపు విషయానికొస్తే, ఈ ఎంపిక చేసిన ఇళ్లలో పీపుల్స్ మీటర్ ఏర్పాటు చేస్తారు. దీన్ని ఒక రిమోట్ తో అనుసంధానం చేస్తారు. ఎవరైనా టీవీ ఆన్ చేయాలంటే ఈ మీటర్ మీద తమకు సంబంధించిన బటన్ నొక్కాలి. స్త్రీపురుషులకు వేరువేరు బటన్స్ ఉంటాయి. వయసులను బట్టి కూడా బటన్స్ మారతాయి. ఎవరైనా టీవీ దగ్గరనుంచి పక్కకి వెళ్ళిపోవాలంటే వాళ్ల బటన్ ఆఫ్ చేసి వెళ్ళాలి. ఆ విధంగా ఎవరెవరు ఎంత సేపు ఏ చానల్ చూశారో బరోడాలోని టామ్ కార్యాలయ రికార్డులలో నమోదయ్యేది. ” అందరూ అంత కచ్చితంగా టీవీ చూసేముందూ, అక్కడినుంచి వెళ్ళేముందూ బటన్ నొక్కుతారా ” లాంటి ధర్మసందేహాలకిక్కడ తావు లేదు. లక్షలోపు జనాభా ఉన్న మండలకేంద్రాలూ, గ్రామపంచాయితీలూ లెక్కకు రావా అంటే రావన్నదే సమాధానం. సగం జనాభా అభిప్రాయాలు లెక్కలోకి తీసుకోకుండా ఇది సరైన సర్వే ఎలా అవుతుందనేది జవాబు దొరకని ప్రశ్న.

అయితే, అదే సమయంలో పాత పద్ధతిని గుర్తుచేసుకునే వారు కూడా ఉన్నారు. అమెరికా లాంటి దేశాల్లో రేటింగ్ లెక్కింపు మొదలుపెట్టిన తొలినాళ్ళలో డైరీ పద్ధతి అమలులో ఉండేది. అంటే, ప్రేక్షకులు తాము ఏయే కార్యక్రమాలు ఎంతసేపు చూశారో తమకిచ్చిన డైరీ లో నమోదు చేయాల్సి ఉంటుంది. దీని ఆధారంగా రేటింగ్స్ లెక్క వేస్తారు. దూరదర్శన్ కూడా మొదట్లో ఇదే పద్ధతి పాటించేది. ఈ విధానం గురించి తరువాత అధ్యాయాల్లో చర్చిద్దాం. ఇప్పటికీ ఎక్కువ దేశాల్లఓ పీపుల్స్ మీటర్ ద్వారా రేటింగ్స్ లెక్కిస్తున్నప్పటికీ కొన్ని దేశాలు ఇందుకు భిన్నమైన పద్ధతులను కూడా అనుసరిస్తున్నాయి. ఆయా పద్ధతులగురించి, వాటి మంచిచెడ్డల గురించి కూడా విశ్లేషిద్దాం.

టామ్ రేటింగ్స్ మీద అలా ఎన్నో విమర్శలొచ్చాయి. అతి తక్కువ శాంపిల్స్ తో రూపొందించే నివేదికలు సమగ్రంగా ఉండే అవకాశమే లేదు. అయినా సరే టామ్ దగ్గర ఒక రెడీమేడ్ గడసరి సమాధానం ఉండేది. రక్తపరీక్ష చేయటానికి ఎంత రక్తం తీస్తారన్న ఎదురు ప్రశ్నే వాళ్ళ సమాధానం. భిన్నమైన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక నేపథ్యం ఉన్న భారతదేశంలో ఏకరూపత ఉండదని తెలిసినా ఇదే బుకాయింపు. అసలు కారణం ఏమిటంటే, రేటింగ్స్ లెక్కించటానికి ఇళ్లలో టీవీలకు బిగించే పీపుల్స్ మీటర్ ఖరీదు దాదాపు లక్షన్నరరూపాయలు. అప్పటికే దేశంలో పదివేల మీటర్లకు వంద కోట్లు ఖర్చుపెట్టిన టామ్ ఇంతకుమించి ఖర్చు వద్దనుకుంది. రేటింగ్స్ నిర్ణయించే ఏకైక సంస్థ గనుక అందరినీ శాసించే స్థితిలో ఉండి గుత్తాధిపత్యం ప్రదర్శించింది.

చివరికి చానల్స్ అన్నీ టీ ఆర్ పీ (టెలివిజన్ రేటింగ్ పాయింట్స్) చట్రంలో ఇరుక్కు పోయాయి. మొత్తం టీవీ పరిశ్రమనే శాసించే స్థానంలో రేటింగ్స్ స్థిరపడ్డాయి. చానల్స్ కూడా మంచి రేటింగ్ వస్తే ఆనందించటం, రాకపోతే రేటింగ్స్ ని తిట్టుకుంటూ టామ్ ని విలన్ గా చిత్రీకరించటం ఆనవాయితీగా తయారైంది. అయితే, ప్రత్యామ్నాయ వ్యవస్థ మీద దృష్టి పెట్టటంతో బాటు టామ్ పనితీరుమీద పర్యవేక్షణ ఉండాలన్న కోణంలో చర్చ మొదలైంది. ఒకే రేటింగ్ ఏజెన్సీ సరిపోతుందా, ఎక్కువ దేశాల్లో ఉన్నట్టు కనీసం రెండు ఉండాలా అనేది కూడా ఆ చర్చలో భాగమైంది. టీవీ రేటింగ్స్ లెక్కించే టామ్ మీద విమర్శలు భారతదేశానికే పరిమితం కాలేదు.అమెరికాలో టామ్ మాతృ సంస్థ ఏసీ నీల్సెన్ కూడా ఎన్నో ఆరోపణలు ఎదుర్కోక తప్పలేదు. ఏసీ నీల్సెన్ గుత్తాధిపత్యానికి అక్కడి మరో సంస్థ టీ ఎన్ ఎస్ బ్రేక్ వేసింది. ఒక్కసారిగా ఏసీ నీల్సెన్ అరాచకాలు వెలుగు చూడటంతో ఎన్నో కోర్టుకేసులు ఎదుర్కోవలసి వచ్చింది.

అమెరికాలో మీడియా రేటింగ్స్ కౌన్సిల్ ఉంది. అది రేటింగ్స్ తీసే క్రమాన్ని పర్యవేక్షిస్తుంది. భారత్ లో మాత్రం అలాంటి వ్యవస్థ ఏదీ లేదు. ట్రాయ్ ఎప్పుడు ఏ విషయంలో జోక్యం చేసుకుంటుందో ఎవరికీ తెలియదు. ఏయే అంశాలలో దాని పాత్ర ఉంటుందో ఇప్పటికీ ఎవరూ చెప్పలేరు. కార్యక్రమాలకు సంబంధించినంతవరకు తన ప్రమేయం ఎంతమాత్రమూ ఉండదని ట్రాయ్ చెబుతుంది. ఇది సాంకేతిక మైన అంశం కాదు గనుక పట్టించుకోనంటుంది. ఈ రేటింగ్స్ ఆధారంగానే కార్యక్రమాలు తయారవుతున్నాయి కాబట్టి సమాచార ప్రసారాల శాఖ పరిధిలోనివని మరో వాదన. ప్రకటనకర్తలు, యాడ్ ఏజెన్సీలు, చానల్స్ కలసి అంగీకరించి ఏర్పాటుచేసుకున్న ఈ వ్యవస్థ మీద అభ్యంతరాలుంటే వాళ్ళే సరి చేసుకోవాలని ట్రాయ్ సూచిస్తూ వచ్చింది. చాలాకాలం పాటు సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ కూడా చేతులెత్తేసింది. ఒక దశలో అప్పటి సమాచార కార్యదర్శి అరోరా ’ సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ ’ ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడుతూ ” మియా బీవీ రాజీ హై తో క్యా కరేగా ఖాజీ ” అన్నారు. అంటే, “భార్యాభర్తలు రాజీ పడితే మధ్యలో ఖాజీ ఏం చేస్తాడు ?” అనటం ద్వారా రేటింగ్స్ విషయంలో ప్రభుత్వం చేయగలిగేదేమీ లేదని నేరుగానే చెప్పేసినట్టయింది. ఇది కేవలం ప్రకటనదారులకూ, సంస్థలకూ, చానల్స్ కూ సంబంధించిన వ్యవహారంగానే ప్రభుత్వం చాలా కాలం దాటవేస్తూ వచ్చింది.

అయితే, ప్రబుత్వం చెబుతున్నట్టుగా అది కేవలం మార్కెట్ కి సంబంధించిన సమస్యేనా ? రేటింగ్స్ ని ప్రజాదరణగా అర్థం చేసుకోవటమే తప్పన్న విషయాన్ని ప్రభుత్వమే పట్టించుకోకపోతే చౌకబారు కార్యక్రమాలతో ప్రేక్షకులు ఇబ్బంది పడాలా ? సెక్స్, క్రైమ్ లాంటి కార్యక్రమాలు ప్రసారమవుతున్నప్పుడు చాలామంది ఆసక్తితో చూడవచ్చు. ఆ తరువాత అలాంటి కార్యక్రమాలు మంచివి కావనే అభిప్రాయానికి రావచ్చు. అంతమాత్రాన ఆ కార్యక్రమాలకు ప్రజాదరణ ఉన్నట్టు భావించటం సమంజసం కాదు. చూస్తే తప్ప మంచో చెడో తెలియనప్పుడు తీరా చూశారు కాబట్టి మంచి కార్యక్రమమనే నిర్ధారణకు రావటం మీద విమర్శలొచ్చాయి. కేవలం రేటింగ్ వచ్చినంత మాత్రాన అది మంచి కార్యక్రమం అనుకోవటానికి వీల్లేదు. దురదృష్టవశాత్తూ అలా అనుకోవటం వల్లనే మిగిలిన చానల్స్ కూడా అటువంటి కార్యక్రమాన్నే ప్రసారం చెయ్యాలని తహతహలాడుతున్నాయి. కనీసం ప్రయోగాత్మకంగానైనా మంచి కార్యక్రమాలు అందించే ప్రయత్నం చేయటం లేదు. ఒక విధంగా చెప్పాలంటే చానల్స్ కంటే ప్రకటనకర్తలే కాస్త బాధ్యతతో వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. రేటింగ్స్ ఎక్కువ వస్తున్నప్పటికీ క్రైమ్ కార్యక్రమాలకు ప్రకటనలు ఇవ్వటానికి ముందుకు రావటం లేదు. ప్రకటనకర్తలకు సహాయ పడాల్సిన రేటింగ్స్ ఇప్పుడు కార్యక్రమాల రూపకల్పనకు మార్గదర్శనం చేస్తున్నాయి. ఆ మాట కొస్తే , యాడ్ ఏజెన్సీల కంటే చానల్స్ ఎక్కువగా రేటింగ్స్ ని వాడుకుంటున్నాయేమో అనిపిస్తుంది.

మరో సారి టామ్ వారి రేటింగ్స్ తీరు గమనిస్తే, గ్రామీణ ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను లెక్కలోకి తీసుకోవటం లేదని ఆ సంస్థ స్వయంగా అంగీకరించింది. లక్షలోపు జనాభా ఉన్న ప్రదేశాలను పట్టించుకోదు. దీన్ని బట్టి చానల్స్ కూడా గ్రామీణ ప్రజలకు అవసరమయ్యే కార్యక్రమాల గురించి ఆలోచించటం కూడా అనవసరమనే అభిప్రాయానికి వచ్చాయి. ఎంటర్టైన్మెంట్ చానల్స్ తమ కార్యక్రమాలలో ప్రేక్షకులకు భాగస్వామ్యం కల్పించాలనుకుంటే రేటింగ్స్ లెక్కించే పట్టణాలనే ఎంచుకుంటాయి. అక్కడి ప్రేక్షకుల దృష్టిలో పడాలన్న ఆశే అందుకు కారణం. న్యూస్ చానల్స్ అయితే రేటింగ్స్ లెక్కించే పట్టణాల వార్తలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం, అటువంటి “కీలక పట్టణాల” లో గట్టి రిపోర్టర్లను నియమించటం రహస్యమేమీ కాదు. మొత్తంగా టామ్ రేటింగ్స్ మీద విశ్వసనీయత పూర్తిగా సడలి పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రేక్షకుల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదే అభిప్రాయం బలపడుతూ వచ్చింది.

దీంతో ప్రభుత్వం రంగ ప్రవేశం చేసింది. రేటింగ్స్ కమిషన్ ను నియమించింది. ఆ కమిషన్ సిఫార్సుల ప్రకారం మీటర్ల సంఖ్య 50 వేలకు పెంచాలి, గ్రామీన ప్రాంతాలనూ లెక్కలోకి తీసుకోవాలి. రేటింగ్స్ లెక్కించే సంస్థకు ప్రకటనల సంస్థలతో భాగస్వామ్యం ఉండి ఉండకూడదు లాంటి సిఫార్సులు వచ్చాయి. కేంద్రం ఈ సిఫార్సులకు ఆమోద ముద్ర వేసింది. అదే సమయంలో టీవీ పరిశ్రమ స్వయంగా ఒక రేటింగ్స్ ఏజెన్సీ ఏర్పాటుకు సిద్ధమైంది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లేని టామ్ అనివార్య పరిస్థితుల్లో మూతబడగా, టీవీ చానల్స్ యాజమాన్యాలు, ప్రకటనల ఏజెన్సీలు, ప్రకటనకర్తలు భాగస్వాములుగా స్వయంగా బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) అమలులోకి వచ్చింది.

బార్క్ రంగ ప్రవేశంతో చానల్స్ అన్నీ ఇక రేటింగ్స్ న్యాయబద్ధంగా ఉంటాయని భావించాయి. క్రమంగా మీటర్ల సంఖ్య పెంచటం ద్వారా మరింత కచ్చిత ఫలితాలు వస్తున్నాయని చానల్స్ సంతృప్తి వ్యక్తం చేశాయి. అయితే, అదే సమయంలో గ్రామీణ ప్రేక్షకుల ఆదరణను సైతం కొలవటం మొదలవటం ఒక పెను సంచలనమైంది. చానల్స్ తలరాతలు మారిపోయాయి. గ్రామీణ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కార్యక్రమాలు, చానల్స్ ప్రారంభించటం మొదలైంది. మరోవైపు ఇంతకాలంగా గ్రామీణ ప్రేక్షకులను లెక్కించకపోవటం వల్లనే వెనుకబడినట్టు చెప్పుకుంటూ వచ్చిన దూరదర్శన్ ఇప్పుడూ వెనకబడటంతో మారు మాట్లాడలేకపోయింది.

కానీ బార్క్ సైతం విమర్శలకు తావిచ్చింది. చాలా చోట్ల మీటర్లున్న ఇళ్ళు బైటికి తెలిసిపోతున్నాయని, చానల్ యాజమాన్యాలు అక్రమ మార్గాల ద్వారా తెలుసుకొని ప్రలోభ పెడుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. టెలివిజన్ పోస్ట్ అనే పోర్టల్ ఏర్పాటు చేసిన డిజిటైజ్ ఇండియా సదస్సులో బార్క్ సీఈవో పార్థోదాస్ స్వయంగా ఈ ఆరోపణలను ఒప్పుకున్నారు. కొన్ని చోట్ల తమ సిబ్బందిని ప్రలోభపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలు వచ్చాయని వెల్లడించారు. పది ఇళ్లు చెబితే ఐదు లక్షలిస్తామంటూ లక్ష రూపాయలు అడ్వాన్సుగా ఇచ్చినమాట నిజమేనని తమ దర్యాప్తులో వెల్లడైందని ఆయనే చెప్పటంతో మళ్లీ ఈ కోణంలో విమర్శలు మొదలయ్యాయి.

మరికొద్ది రోజులకే ఒక చానల్ సిబ్బంది కొన్ని మీటర్లున్న ఇళ్ళకు వెళ్ళి ప్రలోభపెట్టే ప్రయత్నం చేసిందని కూడా చూచాయిగా చెప్పిన బార్క్ సీఈవో ఆ కొద్ది రోజుల తరువాత తమిళనాడుకు చెందిన రాజ్ టీవీ యాజమాన్యానికి నోటీసులివ్వటంతో ఆయన ప్రస్తావించిన చానల్ అదేనని తేలిపోయింది. దీన్ని బట్టి బార్క్ హయాంలోనూ దొడ్డిదారి వ్యవహారాలు నడుస్తున్నాయని దీన్ని సమర్థంగా ఎదుర్కోలేకపోతున్నదని విమర్శలు పెరుగుతూ వచ్చాయి. తాజాగా కేరళ టీవీ సమాఖ్య చేసిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం ముదురుపాకాన పడింది. కొంతమంది ఈ మీటర్లున్న ఇళ్ళకు వెళ్ళి తాయిలాలు ఇవ్వజూపుతూ తమ చానల్స్ కు రేటింగ్స్ సంపాదించుకునే పనిలో ఉన్నారని స్వయంగా కేరళ టీవీ సమాఖ్యతోబాటు బార్క్ కూడా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఇది తారస్థాయికి చేరింది. ఈ వ్యవహారం పోలీసుల దర్యాప్తులో ఉంది.

బార్క్ మీటర్లు ఉన్న ఇళ్ళ చిరునామాల కోసం పదే పదే ప్రయత్నాలు జరుగుతున్నట్టు బార్క్ ఇండియా వారి విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదులు అందుతూ వచ్చాయి. ఆ విధంగా ఆ ఇళ్ళను ప్రభావితం చేయాలన్నది వాళ్ళ లక్ష్యంగా కనబడుతోందని బార్క్ ఆ ఫిర్యాదులో పేర్కొంది. రెండు చానల్స్ కోసం బార్క్ ఇండియా వారి ప్రేక్షకాదరణ సమాచారాన్ని తస్కరించినట్టు నిర్దుష్టమైన సాక్ష్యాధారాలు లభించాయని బార్క్ సీఈవో పార్థోదాస్ గుప్తా వెల్లడించారు. విజిలెన్స్ బృందం క్షేత్రస్థాయిలో జరిపిన దర్యాప్తును బట్టి చూస్తే ఆ వ్యక్తులు కేవలం మీటర్లున్న ఇళ్ళను గుర్తించటానికే పరిమితం కాకుండా ఆ ఇళ్ళలోనివారికి తాయిలాలు ఇచ్చి వారిని ఫలానా కార్యక్రమాలు మాత్రమే చూసేలా కూడా ప్రయత్నించినట్టు తేలిందన్నారు. దీనివలన కొన్ని చానల్స్ ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని, మిగిలిన చానల్స్ ప్రతిష్ఠ దిగజారే ప్రమాదమూ ఉన్నదని, అదే సమయంలో బార్క్ కున్న విశ్వసనీయత సైతం మంటగలిసే ప్రమాదం ఏర్పడిందని వ్యాఖ్యానించారు.

ఈ విషయం తెలిసిన వెంటనే బార్క్ ఆ ఇళ్ళను రేటింగ్స్ లెక్కింపు నుంచి మినహాయించింది. దాని ప్రభావం మొత్తం రేటింగ్స్ మీద పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంది. బార్క్ ఇచ్చే లెక్కలమీద ఆధారపడి టీవీ పరిశ్రమ నడుస్తున్నప్పుడు ప్రతి బ్రాడ్ కాస్టర్ కూ ఒక్కో రేటింగ్ పాయింట్ ఎంతో విలువైంది కాబట్టే తక్షణ చర్యలతో పరిస్థితిని చక్కదిద్దుతున్నట్టు బార్క్ ప్రకటించింది. అక్రమాలకు యత్నించిన ఇద్దరు బ్రాడ్ కాస్టర్లను గుర్తించామని చెప్పినప్పటికీ ఇంకా పేర్లు వెల్లడించాల్సి ఉంది. ఎవరైనా అలాంటి అడ్డదారులు తొక్కితే ఆ చానల్స్ పేర్లు బైటపెట్టటంతోబాటు రేటింగ్స్ లెక్కలనుంచి తొలగిస్తామని బార్క్ విస్పష్టంగా ప్రకటించింది. నిజానికి మీటర్లున్న ఇళ్ల వివరాలు బైట పడకూడదనే ఉద్దేశంతోనే ఏటా కనీసం 25% మీటర్లను మార్చివేస్తున్నామని కూడా పార్థోదాస్ గుప్తా వెల్లడించారు.

Leave a Reply