యోగి కేబినెట్లోకి ములాయం చిన్న‌కోడ‌లు?

 Posted April 1, 2017

up cm yogi adityanath meets aparna yadav
యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ కేబినెట్ లోకి ములాయం చిన్న‌కోడ‌లు అప‌ర్ణా యాద‌వ్ కు చోటు ద‌క్కుతుందా? ఆమె మంత్రి కావ‌డం ఖాయ‌మేనా? యోగిని మ‌రోసారి క‌ల‌వ‌డంలో ఆంత‌ర్యం ఇదేనా? అంటే ఔన‌నే గుస‌గుస‌లాడుకుంటున్నారు స‌మాజ్ వాదీ పార్టీ క్యాడ‌ర్.

యూపీ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యంతో ఎస్పీలో మ‌ళ్లీ లుక‌లుక‌లు ప్రారంభమ‌య్యాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ములాయం చిన్న కోడ‌లు అప‌ర్ణాయాద‌వ్ దంప‌తులు …ఇటీవ‌లే సీఎం యోగి ఆదిత్య‌నాథ్ ను క‌లిశారు. ఇది మ‌ర్యాద‌పూర్వ‌క భేటీయేన‌ని స‌ర్దిచెప్పుకున్నా…తాజాగా మ‌రోసారి క‌ల‌వ‌డం హాట్ టాపిక్ గా మారింది.అయితే ఈసారి ట్విస్ట్ ఏంటంటే.. అప‌ర్ణ దంప‌తుల ద‌గ్గ‌రికే సీఎం యోగి ఆదిత్య‌నాథ్ రావ‌డం గ‌మ‌నార్హం.

ల‌క్నోలో ప్ర‌తీక్-అప‌ర్ణా యాద‌వ్ దంప‌తుల‌కు 64 ఎకరాల సువిశాల స్థ‌లంలో గోశాల ఉంది. ఈ గోశాల‌కే యోగి వ‌చ్చారు. అప‌ర్ణా యాద‌వ్ దంప‌తుల‌తో పిచ్చాపాటి మాట్లాడారు. ప‌నిలో ప‌నిలో గోవుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ స‌మ‌యంలోనే యోగి కొంతసేపు యాద‌వ్ దంపతులతో రాజ‌కీయాలు కూడా మాట్లాడారాన్న వాద‌న వినిపిస్తోంది. బీజేపీలో చేరితే ఎమ్మెల్సీ ఇవ్వ‌డంతో పాటు మంత్రిప‌ద‌వి కూడా ఇచ్చేందుకు ఓకేన‌ని బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే దీనిపై పెద్దాయ‌న‌ ములాయంను అడిగి చెబుతామ‌ని అప‌ర్ణ స‌మాధాన‌మిచ్చార‌ని స‌మాచారం.

మొత్తానికి మీటింగ్ అయిపోయిన త‌ర్వాత సీఎం యోగి అంద‌రివాడంటూ అప‌ర్ణాయాద‌వ్ ప్ర‌శంసించారు. దీంతో ఈ ఊహాగానాల‌కు మ‌రింత ఊతం ల‌భించింది. ఈ పొగ‌డ్త‌లు చూస్తుంటే.. అప‌ర్ణ బీజేపీ లోకి చేర‌డం ఖాయ‌మైందా అన్న అనుమానాలు క‌లుగుతున్నాయి. ఒక‌వేళ అదేజ‌రిగితే ములాయంతో పాటు అఖిలేశ్ ఎలా స్పందిస్తారో? ఎస్పీలో ఇది ఎలాంటి ర‌చ్చ‌కు తెర‌తీస్తుందోన‌ని క్యాడ‌ర్ ఆందోళ‌న చెందుతున్నారు.

SHARE