సిరియా వల్ల వరల్డ్ వార్..?

Posted April 8, 2017

US and Russia could start Third World War over Syria conflictమొదటి, రెండో ప్రపంచ యుద్ధంలో లక్షలాది మంది జనం మరణించారు. ఆ తర్వాత మరో ప్రపంచ యుద్ధం రాకూడదనే ఐక్యరాజ్యసమితి ఏర్పడింది. కానీ సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధం వరల్డ్  వార్ కు దారితీసే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సిరియా రసాయన దాడులు, ప్రతిగా అమెరికా క్షిపణి దాడులతో వాతావరణం వేడెక్కింది. ట్రంప్ అధ్యక్షుడయ్యాక రష్యాతో కాస్త స్నేహంగా ఉంటున్న అమెరికా.. ఇప్పుడు ఉన్నట్లుండి రివర్సైంది. దీంతో ఒబామా హయాం కంటే పరిస్థితి మరింత క్షీణించిందని పుతిన్ సర్కారు చెబుతోంది. అమెరికా మొండిపట్టు ఇలాగే ఉంటే.. మూడో ప్రపంచ యుద్ధం తప్పదని సంకేతాలిస్తోంది.

సిరియాలో అసద్ సర్కారుకు వ్యతిరేకంగా తిరుగుబాటుదారులు చేస్తున్న పోరాటంలోకి ప్రపంచ శక్తులు అక్రమంగా చొరబడటంతోనే సిరియాలో కాస్తో కూస్తో ఉన్న శాంతి అడుగంటింది. సిరియాకు మద్దతుగా రష్యా, రెబల్స్ కు మద్దతుగా అమెరికా ఆయుధాలు, ఆర్థిక సాయం చేయడంతో.. ఆరేళ్లుగా అంతర్యుద్ధం సాగుతూనే ఉంది. ఇది ఎప్పటికి ముగుస్తుందో తెలియడం లేదు. ఇదిలా ఉంటే ఎప్పుడో నాలుగేళ్ల క్రితం జరిగిన రసాయన దాడుల బీభత్సాన్ని గుర్తుచేస్తూ సిరియా సేనలు సరీన్ ప్రయోగించడం, ప్రతిగా అమెరికా తొమహాక్ క్షిపణులతో సిరియా ఎయిర్ బేస్ పై దాడికి దిగడంతో పరిస్థితి విషమించింది.

అసలు సిరియాలో అమెరికా, రష్యా పరోక్ష యుద్ధం చేస్తున్నాయి. రెబల్స్ పై విమాన దాడుల పేరుతో రష్యా.. అమెరికా సేనల్ని టార్గెట్ చేస్తుంటే.. సిరియాపై దాడుల పేరుతో అమెరికా ఎయిర్ బేస్ లో ఉన్న రష్యా విమానాల్ని టార్గెట్ చేసిందనేది నిపుణుల మాట. ఒకప్పుడు ప్రపంచ శక్తులుగా ప్రచ్ఛన్న యుద్ధం చేసిన అమెరికా, రష్యా ఇప్పుడు సిరియా సాకుతో మళ్లీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. అగ్రరాజ్యాల్ని అదుపుచేసే శక్తి ఐక్యరాజ్యసమితికి లేదు. అందుకే అమెరికా, రష్యా ఆడింది ఆటగా ఉంది. ఇప్పటికైనా మిగతా ప్రపంచ దేశాలు జోక్యం చేసుకుని అమెరికా, రష్యాలకు సర్దిచెప్పకపోతే.. సిరియాలో మూడో ప్రపంచ యుద్ధం తప్పదని హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

SHARE