వీణా వాణీ.. వీళ్ళు ఇల్లు మారుతున్నారు

0
473

  Veena Vani Conjoined Twins change home

అవిభక్త కవలలు వీణా వాణిలకు ఇక స్టేట్ హోం ఇల్లు కాబోతోంది..ఇన్నేళ్ళు హాస్పెటల్ లో జీవితాన్ని సాగించిన ఈ అవిభక్త కవలలను ఇక స్టేట్ హోం కి తరలించాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ఆపరేషన్ చేస్తే ప్రాణాపాయమని ఎయిమ్స్ వైద్యులు చెప్పడంతో హాస్పెటల్ నుండి తరలించాలని వైద్యశాఖ నిర్ణయించింది.ఇక వీరి ఆలనా పాలన స్త్రీ శిశు సంక్షేమ శాఖకు అప్పగించాలని అధికారులు నిర్ణయించారు.

వీణావాణీ… తెలుగు రాష్ట్రాలకు ఇవి పరిచయమైన పేర్లు. శరీరాలు వేరైనా ఒకే ప్రాణంగా బతుకుతున్న ఆ ఇద్దరూ తిరిగి సాధారణ మనుషులుగా మారుతారా అని ఎదురు చూస్తున్న తల్లితండ్రులకు ఎప్పుడూ నిరాశే మిగులుతోంది. ఇప్పటికే ఎన్నోసార్లు ఆపరేషన్ చేసేందుకు అనేక మంది ప్రయత్నించినా..చివరిదాకా వచ్చి ఆగిపోయిన పరిస్థితి..తాజాగా సర్జరీ చేస్తే ప్రాణాపాయమని ఎయిమ్స్ వైద్యులు తేల్చడంతో ఇక వీరికి భవిష్యత్తులో ఆపరేషన్ లేనట్టు వైద్యశాఖ తేల్చింది.

వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలం బీరిశెట్టిగూడెంకు చెందిన మురళి, నాగలక్ష్మి దంపతుల రెండో సంతానంగా 2003 లో వీణా వాణిలు అవిభక్త కవలలలుగా జన్మించారు.అయితే అప్పుడే వీరికి సర్జరీ చేసి విడదీస్తామని డాక్టర్ నాయుడమ్మ ప్రకటించడంతో తల్లితండ్రులు అక్కడకు తీసుకెళ్ళారు. కాని వసతుల లేమి దృష్ట్యా నీలోఫర్ లో సర్జరీ చేయడానికి ఇక్కడికి తరలించారు. ఇక అంతే, తల్లితండ్రులు కూడా ఈ పిల్లలను పట్టించుకోవడం మానేశారు. అప్పటి నుండి వైద్యు లు, నర్సుల ఆలనాపాలనలో పెరుగుతున్నారు. అయినా వీరి ఆపరేషన్ గురించి పట్టించుకునే వారు కరువయ్యారు.గత పదేళ్ళుగా డాక్టర్లు ఆయాలనే వారి కుటుంబ సభ్యులుగా భావించి ఈ పిల్లలు జీవితాన్ని గడుపుతున్నారు.

పన్నెండేళ్ళ వయసు దాటిన వారు నీలోఫర్ హాస్పెటల్ లో ఉండటానికి నిబంధనలు ఒప్పుకోవంటూ సూపరింటెండెంట్ ప్రభుత్వానికి లేఖరాశారు…చిన్నపిల్లల హాస్పెటల్ అయినందున వీణావాణిల బాద్యత తమ వల్ల కాదని ఇప్పుడు ఈ హాస్పెటల్ చేతులెత్తేస్తోంది.పదమూడేళ్ళు వచ్చినందున వీణావాణిలను హాస్పెటల్ నుండి మార్చాలంటూ ఆసుపత్రి వర్గాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన నేపద్యంలో వీరిని హాస్పెటల్ నుండి తరలించాలని వైద్యశాఖ భావిస్తోంది.

అవిభక్త కవలలు వీణా వాణిల భాద్యతను స్త్రీశిశు సంక్షేమ శాఖకు అప్పగించాలని వైద్యశాఖ అధికారులు నిర్ణయించారు. వీరికి ఆపరేషన్ సాద్యంకాదన్న విషయం స్పష్టం కావడం, పిల్లల వయస్సు 12 ఏళ్లు దాటడంతో వీరిని స్టేట్ హోం కి తరలించాలని అధికారులు భావించారు. ఇప్పటిదాకా హాస్పెటల్ ను ఇల్లు గా భావించి బ్రతుకుతున్న ఈ అవిభక్త కవలలు ఇకపై స్టేట్ హోం లో జీవనం సాగించనున్నారు.

Leave a Reply