అక్కడ బడుల్లోకూరగాయల సాగు ..

    vegetables planting in schools east godavari district

తూర్పు గోదావరి జిల్లాలో ‘న్యూట్రీ గార్డెన్స్’ పేరుతో ఒక పథకాన్ని అమలుచేయనున్నారు. స్కూళ్లలోని  తోటల్లో రసాయన రహిత పోషక విలువలతో కూడిన కూరగాయలు, ఆకుకూరలు పెంచడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నారు. తొలివిడతగా జిల్లాలోని 514 పాఠశాలల్లో ‘న్యూట్రీ గార్డెన్స్’ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

ఈ విధానం ద్వారా విద్యార్థుల్లో మొక్కల పెంపకం పట్ల ఆసక్తిని కలిగించడం, పోషక విలువలతో కూడిన తాజా కూరగాయలు, ఆకుకూరలను మధ్యాహ్న భోజనంలో అందించడం ముఖ్య ఉద్దేశం. పాఠశాలల్లో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న స్థలాలను వినియోగంలోకి తీసుకురావడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. కూరగాయల్లో ఉండే పోషక విలువలు, ఆకుకూరలను తినడం ద్వారా కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు తెలియజేయడంతో పాటు సేంద్రీయ ఎరువుల వలన కలిగే లాభాలు, రసాయనిక రహిత మొక్కల పెంపకం పట్ల విద్యార్థులకు బాల్య దశ నుండి అవగాహన పెంపొందించడానికి ‘న్యూట్రీ గార్డెన్స్’ పథకం ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు.

తూర్పు గోదావరి జిల్లాలో మొక్కల పెంపకానికి అనువైన స్థలం, ప్రహారీగోడ, నీటి వసతి కలిగిన 514 పాఠశాలలను తొలివిడతగా ఎంపిక చేశారు. ఈ పాఠశాలలకు 16 రకాల కూరగాయలు, ఆకు కూరల విత్తన కిట్లను పంపిణీచేస్తారు. ఈ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులకు మొక్కల పెంపకం, సేంద్రీయ ఎరువుల తయారీ (కంపోస్టు పిట్), వాడకం తదితర అంశాలపై నిపుణులచే అవగాహన కలిగిస్తారు. విద్యార్థుల్లో ‘ఈ బడితోట నాది’ అనే భావనను పెంపొందిస్తారు. ‘న్యూట్రీ గార్డెన్స్’కు పూర్తి నాణ్యతా ప్రమాణాలతో కూడిన కంపెనీలు తయారుచేసిన విత్తనాలను సేకరించనున్నారు.

SHARE