ఏపీ సచివాలయ తరలింపు మరింత ఆలస్యం కానుంది. ఈనెల 10 నాటికి సచివాలయంలోని అన్నిశాఖలు అమరావతికి తరలిరావాలని ప్రభుత్వం చెప్పినా సాంకేతిక కారణాలు అడ్డుగా మారుతున్నాయి. వెలగపూడిలో సరైన వసతులలేమి తరలించేందుకు అవరోధంగా మారింది. దీంతో శాఖల తరలింపు కొన్నిరోజలు వాయిదా వేయడమే బెటరని ఏపీ సర్కార్ అభిప్రాయపడుతోంది. హైదరాబాద్ నుంచి వెలగపూడికి ఏపీ సచివాలయశాఖల తరలింపు మరింత ఆలస్యం కానుందా.. ఈ నెల 10 నాటికి డెడ్ లైన్ విధించినా ఇంకా తరలిరాని పలు శాఖలు.
దీంతో తరలింపును పోస్ట్ పోన్ చేయాలనే ఆలోచనలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సచివాలయ శాఖల తరలింపుపై పలుమార్లు డెడ్ లైన్లు విధించిన సర్కార్ మరోసారి వాయిదాకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. వెలగపూడిలోని కొత్త సచివాలయంలో పలుశాఖల మంత్రులు ఈ నెల 10 న తమ పేషీలను ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే చివరి నిమిషంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. ఆరోగ్య, రెవెన్యూ, విద్యాశాఖ మంత్రులు తమ పేషీల ప్రారంభాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.ఇరుకైన గదుల్లో ఎలా విధులు నిర్వహించాలని పలు శాఖల మంత్రులు వాపోతున్నారు. ఇప్పుడు నిర్మించిన వాటిని మరింత పెద్దవిగా నిర్మించాలని కొందరు మంత్రులు గుత్తేదారులకు సూచిస్తున్నారు.
నిర్మించిన భవనాల్లో మౌలిక వసతులు లేకపోవడంపై కూడా ఉద్యోగులు, మంత్రుల పేషీ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు పుష్కరాలకు మంత్రులు, ఉన్నాతాధికారులు విధులు నిర్వహించనున్నారు. ఈ పుష్కరాలు ముగియగానే వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు కూడా హైదరాబాద్ లో జరగవచ్చని సమాచారం. దీంతో సచివాలయంలోని వివిధ శాఖలతో పాటు హైదరాబాద్ లోని హెచ్ఓడీలను తరలించాల్సి ఉంది. ఇది మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి అమరావతికి ఉద్యోగుల తరలింపు ప్రక్రియకు మరోసారి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది. మరో మూడు నెలలు గడిచినా పాలన పూర్తిస్థాయిలో గాడిలో పడేలా లేదు.