ఓపిగ్గా ఉండు… జగన్ కి వెంకయ్య సలహా

Posted September 27, 2016

 venkaiah advice jagan  

ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినందుకు తెనాలిలో వెంకయ్యనాయుడుకు బీజేపీ నేతల సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు జగన్‌ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. తాను రాజకీయ ప్రయోజనాలను ఆశించి పార్లమెంట్‌లో గొంతెత్తలేదని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రతినిధిగా పార్లమెంట్‌లో నోరెత్తలేదని చెప్పారు. తాను ఇప్పుడు కూడా బీజేపీ ప్రతినిధిగా ఇక్కడకు వచ్చి రాబోయే ఎన్నికల్లో బీజేపీకి, టీడీపీకి ఓట్లెయ్యమని అడిగేందుకు రాలేదని వెంకయ్య చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఎలక్షన్స్ కూడా లేవన్నారు.

ఈ సందర్భంలోనే వెంకయ్య ప్రతిపక్ష నేత జగన్‌కు పరోక్షంగా చురకలంటించారు. ప్రస్తుతం ఎన్నికలేమీ లేవని, కానీ కొందరు బాబు దిగిపోవాలని కోరుకుంటున్నారని విమర్శించారు. బాబు దిగిపోతే తానెక్కాలని ఉబలాటపడుతున్నాడని జగన్‌‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో సహనం అవసరమని, తాను ఎన్నో సంవత్సరాలు కష్టపడితే ఈ స్థాయికి వచ్చానని గుర్తుచేశారు. ఓపికతో వ్యవహరించాలని జగన్‌కు సలహా ఇచ్చారు. ఇప్పటికే సగం మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడారని, మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఉంటారోలేదో తెలియదని ఎద్దేవా చేశారు. విశాఖలో జగన్ సభలో తాను మాట్లాడిన మాటలు స్క్రీన్ మీద ఎందుకు చూపించారో వారికే తెలియాలన్నారు.

 venkaiah advice jaganఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెంకయ్య ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ విడిపోవాలనే ఆకాంక్ష, తెలంగాణ ఉద్యమం 1969లో మొదలైందని చెప్పారు. ఆ ఉద్యమ సమయంలో 3వందల మంది చనిపోయారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ నాయకులే కాల్పులు జరిపారని వెంకయ్య ఆరోపించారు. ఏపీకి న్యాయం జరగాలనే రాజ్యసభలో ఆనాడు పోరాడానని వెంకయ్య సభ గుర్తు చేశారు. రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదని ఆయన చెప్పారు. లోక్‌సభ తలుపులు వేసి 23 నిమిషాల్లోనే బిల్లు ఆమోదించారని ఆయన మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు 28 హామీలు అడిగానని వెంకయ్య చెప్పారు. అడిగినవన్నీ ఇస్తామన్నారు కానీ బిల్లులోమాత్రం పెట్టలేదని వెంకయ్య చెప్పారు.

అద్వానితో రాష్ట్ర విభజన అంశంపై గట్టిగా మాట్లాడానని, తానంత గట్టిగా ఎప్పుడూ మాట్లాడలేదని వెంకయ్య చెప్పారు. ఏపీకి అన్యాయం జరిగితే సహించే ప్రసక్తే లేదని, తానెంత వరకైనా వెళతానని అద్వానీకి చెప్పానని తెలిపారు. హోదా కావాలని ఆరోజు పార్లమెంట్‌లో మాట్లాడింది వెంకయ్యనాయుడేనని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారని, ఆ విషయం వాస్తవమేనని వెంకయ్య అంగీకరించారు. ఆ ఒక్కటే కాదని 28 అడిగానని వెంకయ్య చెప్పుకొచ్చారు. విభజన చట్టంలో హోదా అంశాన్ని ఎందుకు చేర్చలేదంటే కాంగ్రెస్ దగ్గర సమాధానం లేదన్నారు. పార్లమెంట్‌లో తాను పోరాడినప్పుడు తన ముందు ఇతర పార్టీల ఎంపీలు నానా గందరగోళం సృష్టించారని… ఆ విజువల్స్ మీడియాలో చూపించలేదని వెంకయ్య చెప్పారు.

SHARE