Posted [relativedate]
జయలలిత చివరిరోజుల్లో ఆ నలుగురే కీలకపాత్ర పోషించారు. ఆ నలుగురు కూడా మన తెలుగు వాళ్లే కావడం గమనార్హం. మొదట చెప్పుకోవాల్సింది తమిళనాడు సీఎస్ గురించి. ఈయన తెలుగువారే. జయలలిత ఆస్పత్రిలో చేరింది మొదలు అధికారిక కార్యకలాపాల్లో ఆయన కీ రోల్ ప్లే చేశారు. ముఖ్యంగా అమ్మ ఇన్నిరోజులు ఆస్పత్రిలో ఉన్నా.. పాలన సాఫీగా సాగిందంటే అది రామ్మోహన్ రావు వల్లే.
జయ మంచానికే పరిమితమైన వేళ గవర్నర్ విద్యాసాగర్ రావు పోషించిన పాత్ర తక్కువేం కాదు. కేంద్రానికి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ .. తమిళనాడు పరిస్థితి కంట్రోల్ లో ఉండేలా చేసింది విద్యాసాగర్ రావే. అమ్మ ఆరోగ్యం విషమించిన చివరిరోజుల్లో అయితే గవర్నర్ .. ఎక్కువ అపోలో ఆస్పత్రికి వచ్చి వెళ్లారు. పన్నీర్ సెల్వం, శశికళకు కూడా కొన్ని కీలకమైన సూచనలు చేసి భేష్ అనిపించుకున్నారు.
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా జయలలిత చివరి రోజుల్లో వెన్నంటి నిలిచారు. కేంద్రానికి, తమిళనాడు ప్రభుత్వానికి ఈయనే వారధిగా పనిచేశారు. తమిళనాడులో రాజకీయ సంక్షోభం లాంటి పరిస్థితులు తలెత్తకుండా.. ముఖ్యమంత్రి, మంత్రులతో ఎప్పటికప్పుడు మంతనాలు జరిపారు. అమ్మ ఆస్పత్రిలో ఉన్న తరుణంలో వారు తప్పటడుగులు వేయకుండా గైడ్ చేశారు.
ఇక నాలుగో తెలుగువారు అపోలో ఆస్పత్రి ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి. అపోలో అధినేతగా ఉన్న ఆయన.. జయ చివరి మజిలీ వరకు దగ్గరే ఉండి డాక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెస్ట్ డాక్టర్లతో మాట్లాడి.. అమ్మకు మంచి ట్రీట్ మెంట్ అందించేందుకు కృషి చేశారు. అంతేకాదు జయ మరణవార్తను హఠాత్తుగా చెప్పకుండా కొంచెం విజ్ఞతను ప్రదర్శించారు. ఆస్పత్రి బయట అమ్మ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయినా.. పరిస్థితి చేయి దాటకుండా చేశారు. ఒకవేళ అపోలోలో కాకుండా వేరే ఆస్పత్రిలో అమ్మ మరణిస్తే పరిస్థితి వేరేలా ఉండేది అనడంలో ఎలాంటి సందేహం లేదు.