గురు రివ్యూ..!!

130

 Posted March 31, 2017, 1:45 pm

venkatesh guru movie reviewచిత్రం: గురు 
తారాగణం: వెంకటేష్‌, రితికా సింగ్‌, ముంతాజ్‌, జకీర్ హుస్సేన్,  నాజర్‌, తనికెళ్ల భరణి

సంగీతం: సంతోష్‌ నారాయణన్‌ 
ఛాయాగ్రహణం: శక్తివేల్‌ 
మాటలు: హర్షవర్థన్‌  
నిర్మాత: ఎస్‌.శశికాంత్‌ 
సంస్థ: వై నాట్‌ స్టూడియోస్‌

రచన, దర్శకత్వం: సుధ కొంగర

విడుదల తేదీ: 31-3-17

టాలీవుడ్ లో గేమ్స్ బ్యాక్ డ్రాప్ లో చాలా  సినిమాలే వచ్చాయి. అయితే  గేమ్స్ అనేది అది ఓ సైడ్ ట్రాక్ లా సాగుతుందే తప్ప మెయిన్ లీడ్ గా ఉండదు. సై, తమ్ముడు, ఒక్కడు, అమ్మానాన్న తమిళమ్మాయి, గోల్కొండ హైస్కూల్ ఇలా పలు రకాల సినిమాలు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.  అయితే ఈ సినిమాల్లో లవ్, కామెడీ, యాక్షన్ వంటి కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే చాలా రోజుల తర్వాత కేవలం స్టోర్ట్స్ ఆధారంగానే తెరకెక్కిన సినిమా గురు. బాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన సాలా ఖద్దూస్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన  ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ లీడ్ రోల్లో నటించాడు. మొట్టమొదటిసారిగా బాక్సింగ్ కోచ్ గా వెంకటేష్ ఎలా అలరించాడో తెలుగు బుల్లెట్ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

కధ ఏంటంటే:

ఈ సినిమాలో వెంకటేష్.. ఆదిత్య రావుగా, జకీర్ హుస్సేన్ ..దేవ్ ఖత్రీగా, రితికా సింగ్.. రామేశ్వరిగా, ముంతాజ్ సర్కార్.. లక్ష్మీగా నటించారు.

ఆదిత్య రావు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో బాక్సింగ్ కోచ్‌ గా పని చేస్తుంటాడు. ఆదిత్యకు బాక్సింగ్ అసోసియేషన్ సభ్యులకు అస్సలు పడదు. వాళ్లు చేసే కుట్రలకు, రాజకీయాలకు ఆది దూరంగా ఉంటాడు. దీంతో ఆదిని ఎలాగైనా  బయటకు పంపించాలని ఆలోచిస్తుంటారు అసోషియేషన్ సభ్యులు. సమయం చూసుకుని  ఆదిని ఢిల్లీ నుంచి వైజాగ్ ట్రాన్స్ ఫర్  చేస్తారు. అక్కడ కూరగాయలు అమ్ముకొంటూ తల్లిదండ్రుల్ని పోషించే రాములు తారసపడుతుంది. ఆమె అక్క లక్స్‌ మాత్రం  బాక్సర్‌ గా రాణించి తద్వారా పోలీస్‌ ఉద్యోగం సంపాదించాలనుకొంటుంది. అందుకోసం ట్రైనింగ్ కూడా తీసుకుంటుంటుంది. అయితే.. రాములులో తెగువ ఆదికి నచ్చుతుంది. ఆమెలో ఓ మంచి బాక్సర్‌ దాగుందని, దానికి మెరుగులు దిద్దితే భారత్‌ కు పతకాలు సాధించి పెడుతుందని నమ్ముతాడు. కానీ రాములు మాత్రం కేవలం డబ్బు కోసమే కోచింగ్‌ తీసుకొంటుంది. అయితే ఎలాగైన రాముల్ని  తిప్పి పంపేయాలన్న ఆలోచనతో ఓ ప్లాన్ వేస్తుంది లక్స్.  కీలక మ్యాచ్ కు ముందు రాములు  చేతికి దెబ్బ తగిలేలా చేస్తుంది. రాములు  కావాలనే తనకిచ్చిన అవకాశాన్ని చెడగొడుతోందని భావించిన ఆది  ఆమెను తరిమేస్తాడు. ఆ తర్వాత ఆమె తన కోచింగ్ ని ఎలా కంటిన్యూ చేసింది… పెంకిగా వ్యవహరించే రాములుని ఆది  ఛాంపియన్‌ గా తీర్చిదిద్దాడా… గురువు  ఆశించిన విధంగా రాములు వరల్డ్ ఛాంపియన్‌ షిప్ సాధించిందా … అనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే సినిమాను వెండితెర మీద  చూడాల్సిందే..

కధనం ఏంటంటే:

తను సాధించలేని ఘనత తన శిష్యురాలితో  సాధింపజేయాలని ఓ గురువు పడే తపనే గురు సినిమా. ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో  కూరగాయలు అమ్ముకొనే ఓ అమ్మాయిని బాక్సింగ్‌ బరిలో దింపడానికి గురువు  గట్టిగా ప్రయత్నిస్తాడు. గురువు, శిష్యురాలి మధ్య ఉండే ఎమోషన్స్ అలానే అక్క, చెల్లి మధ్య ఉండే అనురాగాన్ని చక్కగా పండించారు. రీమేక్‌ సినిమాల్లో ఎమోషన్‌ ని క్యారీ చేయడం కాస్త కష్టమే. కానీ గురు ఆ గండాన్ని దాటాడు.  

ఎవరు ఎలా చేశారంటే:

పట్టుదలతో ఉండే కోచ్ పాత్రలో వెంకటేష్‌ జీవించాడని చెప్పాలి. సాల్ట్ అండ్  పెప్పర్ లుక్ లో కొత్త బాడీలాంగ్వేజ్ తో  వెంకీ నటన అద్బుతం. బాధ్యత లేని అల్లరి అమ్మాయిగా, మెడల్ సాధించడానికి ఎంత కష్టాన్నైనా బరించే సిన్సియర్ ప్లేయర్ గా రితికా సింగ్ మంచి వేరియేషన్స్ చూపించింది. మిగిలిన నటీనటులు తమతమ పరిధి మేరకు నటించారు. వెంకీ పాడిన పాట అలరిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలకు తగ్గట్టు ఉంది. కథ పక్కదారి పట్టకుండా సుధా కొంగర చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.

ప్లస్ పాయింట్స్ :

వెంకటేష్, రితికా సింగ్ నటన

వెంకీ సాంగ్

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :

కొన్ని పాటలు

ఆఖరిపంచ్: గురు… ప్రేక్షకులను కూడా బాగానే మోటివేట్ చేస్తున్నాడు.

Telugu Bullet Rating: 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here