Posted [relativedate]
రాములమ్మగా వెండితెరపై ఓ వెలుగు వెలిగిన విజయశాంతి.. రాజకీయాల్లోనూ కొంతకాలం రాణించారు. ఎంపీగా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. టీఆర్ఎస్ లో ముఖ్య నాయకురాలిగా కొనసాగారు. కానీ ఆ తర్వాత కేసీఆర్ తో విభేదాలు రావడంతో … హఠాత్తుగా కాంగ్రెస్ పంచన చేరిపోయారు. ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీచేసి… ఓడిపోయారు. ఆ తర్వాత ఆ పార్టీకి కూడా దూరమైపోయారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా విశ్రాంతి తీసుకుంటున్నారు.
తెలంగాణ ఉద్యమ కాలంనాటి కేసుల నేపథ్యంలో రాములమ్మ తరచుగా రైల్వే కోర్టుకు హాజరు కావాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో నాటి ఉద్యమకారులు పలువురు ఆమెను కలుస్తున్నారు. ఎందుకు మౌనంగా ఉన్నారంటూ తరచూ ఆమెను ప్రశ్నిస్తున్నారు. దీంతో ఇక విజయశాంతి కూడా పాలిటిక్స్ లోకి మళ్లీ రావాలని అనుకుంటున్నారట. అయితే ఈసారి కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ కు దూరంగా ఒక కొత్త వేదిక అయితే మంచిదని భావిస్తున్నారట. ముఖ్యంగా టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఒక పార్టీ పెట్టేందుకు ఆమె ఆలోచిస్తున్నారని సమాచారం.
రాములమ్మ గతంలోనూ తెలంగాణ తల్లి పేరుతో పార్టీని నడిపారు. ఇప్పుడు అదే పార్టీని పునరుద్ధరించాలా.. లేక కొత్త పార్టీ పెట్టాలా.. అన్న అంశంపై ఆమె డైలామాలో ఉన్నారని సమాచారం. అయితే సన్నిహితులు మాత్రం ఆమెను కొత్త పార్టీ పెట్టాలని కోరుతున్నారట. పార్టీ పేరు తెలంగాణ పునర్ నిర్మాణ సమితి అయితే బావుంటుందని చెబుతున్నారట. అయితే విజయశాంతి మాత్రం ఈ సూచనపై తన స్పందనను ఇంకా చెప్పలేదని సమాచారం. కొంత లేటైనా రాములమ్మ మాత్రం కొత్త పార్టీ పెట్టడం ఖాయమని ఆమె సన్నిహితులు ఘంటాపథంగా చెబుతున్నారు. కచ్చితంగా అది టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. చూడాలి మరి… సెకండ్ ఇన్నింగ్స్ అయినా రాములమ్మకు కలిసి వస్తుందో.. లేదో!!