వైజాగ్ లో కింద నుంచి కరెంటు..

112

vizag underground electrification
హుదూద్ వంటి భారీ తుపాన్లనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోనే తొలి ప్రయోగంగా నిర్వహించే భూగర్భ విద్యుద్దీకరణ భారీ ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన ముహూర్తం ఖరారు కానుంది. విశాఖలోని పలు సబ్‌స్టేషన్ల పరిధిలో 109 కిలోమీటర్ల మేర విద్యుద్దీకరణ ప్రాజెక్టుకు అయ్యే రూ. 720 కోట్ల ప్రతిపాదనలకు మోక్షం లభించనుంది. దీనికి సంబంధించి తుది పరిశీలన కోసం ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి బృందం ఈ నెల 20న విశాఖ రానుంది. ఇప్పటికే అనేకసార్లు వచ్చిన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి బృందం తుది విడతగా కాంట్రాక్ట్ విధానంపై ఓ అంగీకారం కుదుర్చుకోవడంపై చర్చించనుంది.

ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) ఆధ్వర్యంలో ఈ బృందం అన్ని అంశాలను పరిశీలించి, సంబంధిత ప్రతిపాదనలపై చర్చించనుంది. నాలుగు ప్యాకెజీల్లో ప్రాజెక్టు పనులను నిర్వహిస్తారు. తొలి దశలో ఆరు విద్యుత్ సబ్‌స్టేషన్ల పరిధిలో దీనిని పూర్తి చేస్తారు. ఈ పనులకు మరో రెండు మాసాల్లో టెండర్లు ఖరారవుతాయి. అలాగే రెండవ దశ ప్యాకేజీ కింద భూగర్భ విద్యుద్దీకరణ పనులు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ విధంగా వరుసగా నాలుగు దశల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తిచేయాలనేది ప్రధాన లక్ష్యం. తొలి దశ పనులు ప్రారంభమైన నెల రోజుల వ్యవధిలోనే రెండవ దశ ప్రాజెక్టు పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియను పూర్తిచేస్తారు. ఇలా నాలుగు దశల్లో ప్రాజెక్టు పనులు కొద్దిపాటి వ్యవధిలో ప్రారంభం కానున్నాయి.

తొలి దశ ప్రాజెక్టు ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభించి 18 మాసాల్లో వ్యవధిలో పూర్తిచేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఆరు సబ్‌స్టేషన్ల పరిధిలో ఒక్కో దశ ప్రాజెక్టును పూర్తిచేయడం ద్వారా పనులు వేగవంతంగా నిర్వహించవచ్చని భావిస్తున్న సంస్థ ఈ క్రమంలో ప్రణాళికలను రూపొందిస్తోంది. ఇక టెండర్ల ప్రక్రియ అనేది జాతీయ స్థాయిలో జరగనుంది. 2014 అక్టోబర్ 12న విశాఖలో సంభవించిన హుదూద్ తుపాన్ నేపథ్యంలో ఇటువంటి భూగర్భ పాజెక్టును విశాఖలో చేపట్టాల్సిన అవసరాన్ని ఈపిడిసిఎల్.. ప్రభుత్వం దృష్టికి తెచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here