నయీమ్ గురించి వాచ్ మెన్ చెప్పిన రహస్యాలు…

  watch man said nayeem secrets

గ్యాంగ్ స్టర్ నయీముద్దీన్ సెటిల్మెంట్ల ద్వారా సంపాదించినదంతా ఎక్కడ పెట్టాడు? ఒక్క భువనగిరిలోనేనా..కాదు చాలా చోట్ల.. వాటిని వెతికే పనిలో పడ్డారు పోలీసులు. వారు చెబుతున్న వివరాలను చూస్తే సొమ్ములో ఎక్కువ అతని తమ్ముడు ఫయీం మేనేజ్ చేసినట్లు తెలుస్తోంది. ఫయీమ్ కోర్టులో లొంగిపోయి తన అన్న అరాచకాలు, దందాల గురించి తనకేమీ తెలీదని బుకాయిస్తున్నాడు. కానీ పోలీసులు అదంతా కొట్టిపారేస్తున్నారు.

కుటుంబ సభ్యులను తప్ప వేరెవ్వరినీ అసలు నమ్మని వ్యక్తి నయీమ్ అనీ , డబ్బు తీసుకురాడానికీ, దాచడానికీ తమ్ముణ్ణే నియోగించేవాడని పోలీసు వర్గాలంటున్నాయి. ఫయీంతో పాటు అతని భార్యకు కూడా ఈ వ్యవహారాల్లో పాత్ర ఉందని అంటున్నారు. ఆమెనూ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్ కోర్టులో లొంగిపోయాక వీరిని 14 రోజుల పాటు చర్లపల్లి జైలుకు తరలించారు.

భూ దందాలు, ల్యాండ్ సెటిల్మెంట్లతో వచ్చిన సొమ్ముతో గోవాలో రెండు ఖరీదైన ఇళ్ళను కొనుగోలు చేశాడని, అమ్మాయిలతో జల్సాలు చేశాడని వాచ్‌మెన్ తాజుద్దీన్ పోలీసులకు కీలక సమాచారాన్ని వెల్లడించాడు. నయీం ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడని తెలుసుకొని పుప్పాలగూడలోని అల్కాపురి ఇంటికి వచ్చిన తాజుద్దీన్‌ను నార్సింగీ పోలీసులు అరెస్ట్ చేసి గురువారం 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. నయీం దందాలన్ని ఆయన ప్రధాన అనుచరురాలు ఫర్హానాకు తెలుసునని, అన్ని ఆమె కనుసన్నల్లోనే దందాలు జరిగాయని పోలీసులకు వెల్లడించినట్టు సమాచారం.

నల్లగొండ జిల్లా కానగల్ గ్రామానికి చెందిన తాజుద్దీన్ 2012 నుంచి గోవాలో ఉన్న నయీం ఇంటి వద్ద వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు.మరోవైపు నయీం పనిమనుషులు ఫర్హానా, అఫ్సాలను పోలీసులు రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరిచారు. ఫర్హానా, అఫ్సాల మూడు రోజుల కస్టడీ నేటితో ముగిసింది. మరో పన్నెండు రోజులు వారిద్దరిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. కస్టడీ పిటిషన్‌పై విచారణను ఈ నెల 16వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఫర్హానా, అఫ్సాలను చంచల్‌గూడ జైలుకు పోలీసులు తరలించారు.

SHARE