న్యాయం కోసం నయీమ్ బాధితులు..

  we want justice nayeem effected people

గ్యాంగ్‌స్టర్ నయిమ్ భూములకు సంబంధించి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో బాధితులు కోర్టుకు వెళ్లనున్నట్టు తెలిసింది. షాద్‌నగర్‌లోని పలువురిని బెదిరించి బలవంతంగా భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్న నయిమ్ ముఠా సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే తమ భూములపై తమకే హక్కు ఉంటుందని, నయీం బెదిరింపులకు దస్తావేజులు రాసి ఇచ్చామని, మాకు న్యాయం చేయాలని కోరుతూ కొందరు యజమానులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం. గ్యాంగ్‌స్టర్ నయీంకు చెందిన భారీ డబ్బు, భూములకు సంబంధించి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న అధికారుల్లో ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలా? వద్దా? అనే మీమాంస వ్యక్తమవుతోంది.

స్వాధీనం చేసుకున్న ఆస్తులపై ముందు రాగల పరిణామాలపై అధికారులు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. బాధితులు వారివద్దనున్న ఆధారాలతో కోర్టుకు వెళితే.. రాగల పరిణామాలు ఏవిధంగా ఉంటాయోనని కూడా రెవెన్యూ అధికారులు చర్చిస్తున్నారు. నయిమ్ బలవంతంగా రాయంచుకున్న భూముల దస్తావేజులపై యాజమాన్యపు హక్కు తమకే ఉంటుందని భూ యజమానులు కోర్టుకు వెళ్లే అవకాశం లేకపోలేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలావుంటే, షాద్‌నగర్‌లో గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని బుధవారం హైదరాబాద్ రేంజ్ ఐజి నాగిరెడ్డి పరిశీలించారు. నరుూం నివాసముంటున్న ఇంటితోపాటు పరిసర ప్రాంతాలను ఐజి పరిశీలించారు. ఐజి వెంట జిల్లా ఎఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, షాద్‌నగర్ టౌన్ సిఐ రామకృష్ణ ఉన్నారు. ఐజి సందర్శన సమాచారం తెలిసిన విలేకరులు అక్కడికి వెళ్లి ఐజీతో మాట్లాడేందుకు ప్రయత్నించగా నిరాకరించారు. నయీం నివాసం ఇంటిని పరిశీలించే సమయంలో కూడా మీడియాను అనుమతించలేదు.

SHARE