Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సొసైటీ లో మనం ప్రజా ప్రతినిధులుగా వ్యవహరించినప్పుడు పదవి ఉన్నా లేకున్నా జనంలో గుర్తింపు మాత్రం అలాగే ఉంటుంది. ఈ విషయాన్నీ నాయకులు మరీ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు బాగా గుర్తు పెట్టుకోవాలి. ఒకప్పుడు అయితే మనం ఏం మాట్లాడినా చెల్లేది కాని ఇప్పుడు అలా కాదు. సోషల్ మీడియా బాగా అప్రమత్తంగా ఉండటం స్టార్ట్ అయ్యాక క్షణాల్లో మనం అన్న మాటలకు కౌంటర్ ఎటాక్ జరుగుతోంది. అందుకే నేతలతో సహా ఈ మధ్య సామాన్యులు కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు.
కాని యుపి మాజీ సిఎం మాత్రం ఈ విషయం బొత్తిగా మర్చిపోయి మరీ నోరు జారి మొత్తం కంప కంప చేసుకున్నాడు. అదేనండి సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్య మంత్రి అఖిలేష్ యాదవ్ గురించే ఇదంతా. దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న సైనికులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదం రేపుతున్నాయి. అసలు ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా ఇలా మాట్లాడకూడదు అని సర్వత్ర నిరసన వ్యక్తం అవుతోంది.
ప్రాణాలు కోల్పోతున్న సైనికులు అధికారులు అందరు బీహార్, యుపి, మధ్య ప్రదేశ్ ప్రాంతాలకు చెందిన వాళ్ళు అధికంగా ఉన్నారని అసలు నరేంద్ర మోడీ గతంలో ప్రాతినిధ్యం వహించిన గుజరాత్ నుంచి ఎవరు లేరు అన్నట్టు మాట్లాడడంతో సైనిక అధికారులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. తాము ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోయి దేశం కోసం ప్రాణాలు ఒడ్డి పోరాడుతూ ఉంటె అక్కడ ఎసి రూముల్లో కూర్చుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదని, అసలు అఖిలేష్ కుటుంబం నుంచి ఇంతవరకు ఎవరు దేశం కోసం పోరాటం చేయడానికి ముందుకు రాలేదని, గుజరాత్ నుంచి ఎవరు లేరు అనటం ఆయన కుసంస్కారానికి నిదర్శనమని సైనిక అధికారి ఒకరు ఘాటుగా సమాధానం ఇచ్చారు.