బంధువులంటే ఎవరో?

 Posted May 5, 2017 at 11:41

who are known as relativesశ్లో.ఉత్సవే వ్యసనేచైవ 

దుర్భిక్షే శత్రు విగ్రహే
రాజద్వారే శ్మశానే చ యత్తిష్ఠతి స బాంధవః!!

తా.బంధువులు చాలామందే ఉన్నా , వారిలో నిజమైన బంధువులెవరో ఈ శ్లోకం చెప్తుంది.

“ఎప్పుడు సంపద కలిగిన, అప్పుడు బంధువులు వత్తురు” అని సుమతీ శతకం చెప్పింది. మనం ఐశ్వర్యవంతులమో, అధికారం కలవారిమో అయితే, మనమెరుగని మన బంధువులు కోకొల్లలుగా తరలి వస్తారు. ఎందుకు వస్తారనేది సుస్పష్టం. మన ధనమూ ,అధికారమూ అంతరిస్తే వీళ్లందరూ అంతర్థానమౌతారు.అంతమాత్రమే అయితే ఫరవాలేదు.శక్తి వంచన లేకుండా అపకారం కూడా చేస్తారు. భాస్కర శతక కర్త చెప్పినట్లు – అగ్ని బలంగా ఉంటే ,గాలి దానికి సహాయపడుతుంది. ఆ అగ్ని బలంకోల్పోయి , సూక్ష్మ దీపంగా ఉన్నప్పుడు అదే గాలి దానిని ఆర్పివేస్తుంది.

ఇలాంటి అవకాశవాదులు,చపల చిత్తులూ కాకుండా మన సుఖదుఃఖాల్లో, కరువు సమయంలో, శత్రువులు మనమీదికి దండెత్తి వచ్చి సందర్భంలో ,మనం రాజసన్మానం అందుకుంటున్న వేళలో , మనం దేహయాత్ర చాలించినప్పుడో ,మనవాళ్ళెవరైనా మరణించినప్పుడో మనతో శ్మశానానికి ఎవరు వెన్నంటి వస్తారో – వారే నిజమైన బంధువులని నిగ్గు తేలుస్తోంది ఈ శ్లోకం.

సుఖాలు పంచుకోవటం సుకరం. దుఃఖంలోనే ధైర్యమిచ్చే బంధువులు కావాలి.

ఆర్థిక పరమైన ఒడిదుడుకులు వచ్చినపుడు – మనమెక్కడ అప్పు అడుగుతామో అని మొహం చాటేసేవాడు,మనమీద ఎవడో దాడి చేస్తే , మనకు అండగా నిలబడవలసినది పోయి – ఈ తంటసం మనకెందుకు అని చల్లగా జారుకొనేవాడు,మన ప్రతిభా పాటవాలు లోకంలో గుర్తింపబడి , సభా సత్కారం అందుకొంటున్నప్పుడు తాను వచ్చి మనను అభినందించక ఈర్ష్యతో అసలా సభాప్రాంతానికే రానివాడు, మనం మరణించినపుడో ,మన వారెవరైనా మరణిస్తేనో తనతో మన అనుబంధాన్ని గౌరవిస్తూ కనీసం శ్మశానానికి రానివాడు – వీళ్ళు బంధువులౌతారా ?

అందువల్ల భ్రమలు తొలగించుకొని నీ నిజమైన బంధువులెవరో నువ్వే తెలుసుకో అని ఈ శ్లోకం మనకు సూచిస్తోంది.

SHARE