పుష్కరాలు ఎందుకు వస్తాయి..

  why coming pushkaraalu

ఇంతకూ పుష్కరాలంటే ఏంటి? 12 ఏళ్ల కోసం ఎందుకు వస్తాయి? వాటి అర్థం, పరమార్థం ఏంటి? ఆ రోజుల్లోనే స్నానం చేస్తే పుణ్యఫలాలు ఎలా వస్తాయి? ఈ ప్రశ్నలకు ఓ ఆసక్తికర కథ ఉంది. వాటి ఆచరణ వెనుక సామాజిక స్పృహ కూడా ఉంది. పుష్కరం అంటే 12. మన పవిత్ర నదుల్లో 12 నదులకు మాత్రమే పుష్కరాలొస్తుంటాయి. ఒక్కో నదికి ఒక్కో ఏడాది వస్తుంటాయి. అంటే ఒక్కో నదికి 12 ఏళ్ల తర్వాత పుష్కరాలు వస్తాయన్న మాట. అందుకే పుష్కరం అంటే 12 అన్నది స్థిరపడింది. జ్యోతిషశాస్త్ర ఆధారంగా పుష్కరాలు ఖరారు చేస్తారు.

మేష రాశి మొదలు 12 రాశులలోకి గురుగ్రహం ప్రవేశించే సందర్భాన్ని పుష్కర పుణ్యకాలంగా చెబుతారు. ఇలా గురుడు కన్యారాశిలోకి ప్రవేశించినప్పుడు కృష్ణా నదికి పుష్కరాలు నిర్వహిస్తారు. ఇక కృష్ణానది పుష్కర కాలం ఈనెల 12వ తేదీ నుంచి 23 వరకు అన్నమాట.ఈ పుష్కరాలు జరగడానికి వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. ఎన్నెన్నో యుగాల క్రితం తుంబిలుడు అనే శివ భక్తుడు ఉండేవాడట. ఎలాగైనా తన జీవితాన్ని సార్థకం చేసుకుని పరమేశ్వరుడిలో లీనమై మోక్షం పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇంకేముంది? తీవ్రమైన తపస్సు చేశాడు. ఆ తపస్సు ఫలితంగా శివుని 8 మూర్తులలో ఒకటైన జలరూపంలోకి తుంబిలుడు ప్రవేశించి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఆయనే పుష్కరుడయ్యాడు.

ఇక పుష్కర సమయంలో ఆయా నదీ జలాలకు ఎందుకంత శక్తి, పవిత్రత అన్న దానికి ఆధ్యాత్మికంగా ఎన్నో వివరణలు ఉన్నాయి. పుష్కర సంవత్సరం మధ్యలో 12 రోజులపాటు బృహస్పతి పుష్కరుడితో కలిసి ఉండడమే కాకుండా బ్రహ్మాది సమస్త దేవతలు, పిత్రు దేవతలు, రుషి, ముని గణాలతో కలిసి వచ్చి ఆయా నదుల్లో నివసిస్తారట. అందుకే అంత ప్రాధాన్యం. ఆ సమయంలో భక్తులు స్నాన, దాన, జప, అర్చన, తర్పణ, పిండప్రదానాలు చేయడం ఆనవాయితీ. అలా చేస్తే అధిక పుణ్యఫలం దక్కుతుందని రుషులు చెప్పారట. అందుకే పుష్కరాలకు అంత ప్రాధాన్యం ఏర్పడిందని పండితులు చెబుతారు.

మహారాష్ట్రలోని మహా బలేశ్వరంలో పుట్టిన కృష్ణా నది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గుండా ప్రయాణిస్తుంది. మహబూబ్ నగర్ జిల్లా తంగిడి వద్ద తెలంగాణలో ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి ఏపీలోని కర్నూలు మీదుగా తిరిగి తెలంగాణలోని నల్గొండ జిల్లాకు వస్తుంది. నాగార్జున సాగర్ మీదుగా మళ్లీ ఏపీలోని గుంటూరు, విజయవాడలను తరింప జేస్తోంది. 1400 కిలోమీటర్ల మేర ప్రవహించి చివరకు హంసల దీవి సమీపంలోని ఏటిమొగ, ఎదురుమొండి వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది. మొత్తంపై 2.58 లక్షల చదరపు కిలోమీటర్ల పరీవాహక ప్రాంతం ఉంది. కృష్ణా పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా పనులు పూర్తి చేసింది. జూలై 31 నాటికే పనులన్నీ పూర్తికావాలనే లక్ష్యంతో ముందుకు సాగింది.

పుష్కరాలకు దాదాపు 825 కోట్ల రూపాయలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేటాయించారు. ఆరు నెలలుగా ప్రతేక సెల్ ఏర్పాటు చేసిన సీఆర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని మానిటర్ చేస్తు్నారు. పుష్కరఘాట్‌ల వద్ద 12 రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేలా రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ 80 లక్షల రూపాయలు మంజూరు చేసింది. 14 శాఖలతో రాష్ట్ర ప్రభుత్వం సమన్వయ కమిటీని ఏర్పరిచింది. మొత్తం అంతా కూడా తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.పుష్కరాలకు నిధులను రాష్ట్ర బడ్జెట్‌లోనే కేటాయించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. భక్తుల సౌకర్యాల విషయంలో నిధుల కొరత లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు.

ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పోటాపోటీగా ఏర్పాట్లు చేసింది. మొత్తం నాలుగు కోట్ల మంది భక్తులు వస్తారన్న అంచనాలతో పనులు పూర్తి చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి విషయాన్నీ దగ్గరుండి చూసుకున్నారు. ఎప్పటికప్పుడు మంత్రులు, అధికారులు సూచనలు, సలహాలు అందజేశారు. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పుష్కర భక్తుల కోసం 175 ఘాట్లు ఏర్పాటు చేశారు. 150 కోట్ల రూపాయలతో ఘాట్లతో రోడ్లను అనుసంధానించారు. పుష్కరాల్లో రోజూ 15లక్షల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేసేందుకు పలు ఆలయాలు, స్వచ్ఛంద సంస్థల సాయంతో కార్యాచరణ రూపొందించారు.

పుష్కరాల కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించామని, దీని ద్వారా ఏ ఘాట్‌లో ఎంతమంది జనం ఉన్నారు, ఘాట్లకు ఎలా వెళ్లాలనే వివరాలు తెలుస్తాయని ఏపీ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. ఇక ఏపీలో ఎక్కువ మంది భక్తులు విజయవాడకే వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకే విజయవాడ కేంద్రంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పుష్కర భక్తుల కోసం బెజవాడ నగరం వెలుపల 35 పుష్కర్ నగర్లు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క నగర్‌లో ఐదువేల మంది ఉండేలా వసతులు కల్పించారు. ఇక పుష్కర 12 రోజులూ వాహనాలను విజయవాడ నగరంలోకి అనుమతించడం లేదు. భక్తులను ఉచితంగా బస్సుల్లో ఘాట్ల వద్దకు తీసుకెళ్లే ఏర్పాట్లు చేశారు.

పుష్కరాల వేళ భక్తులకు అత్యంత ముఖ్యమైన అంశం ఘాట్. పుణ్యస్నానాలకు అనుగుణంగా ఉండే ప్రదేశం. భద్రతతో కూడిన స్థలం. అందుకే వాటికి అంత ప్రాధాన్యం. అందుకే ఏపీ ప్రభుత్వం శ్రమకోర్చి, శ్రద్ధ తీసుకుంది. విజయవాడలో భక్తులకు అందుబాటులో ఎన్నో ఘాట్లు ఉన్నాయి. వాటికి ప్రత్యేక పేర్లు ఉన్నాయి. ఇది అత్యంత ప్రముఖమైంది. జన సందోహం ఎక్కువ ఇక్కడికే రావడానికి ఇష్టపడుతారు. దారులు తేలికగా ఉండడం, రవాణ సదుపాయం అందుబాటులో ఉండడం ఓ కారణం. కాలినడకన కూడ సులువుగా చేరుకోవచ్చు. ఇక నదిలో విజయవాడ దక్షిణ దిక్కున ఉన్న ప్రజలంతా నిత్య స్నానాలు చేసే ఘాట్ అవడంతో దీనికి చాలా ప్రాచుర్యం ఉంది.

దుర్గా ఘాట్..
ఇది కనకదుర్గమ్మ పాదాల చెంత ఉంది. అందుకే దుర్గాదే వి భక్తుల తాకిడి ఎక్కువ. అలాగే ఇది కూడా అన్ని రవాణా సౌకర్యాలకు మెరుగ్గా ఉన్న ప్రదేశం. దుర్గగుడికి వెళ్లే ఉచిత బస్సు సైతం ఇక్కడ అగుతుంది. ఇక్కడ స్నానం చేయడం కోసం కావలసిన అన్ని వసతులు ఉన్నాయి. స్నానం చేసిన వెంటనే అమ్మవారి దర్శనానికి వెళ్లే వెసులుబాటు ఉంటుంది. స్నానం చేసే సమయంలో కూడా పవిత్రమైన అమ్మవారి కొండను చూస్తూ తాదాత్మ్యం చెందుతుంటారు భక్తులు.
భవానీ ఘాట్..

ఇది భవానీ భక్తులు స్నానాదికాలు చేసే ఘాట్. అందుకే దీనికా పేరు వచ్చింది. ఏడాదిలో రెండు సార్లు జరిగే భవానీ మాలల ఉత్సవాలకు హైదరాబాద్ వైపు నుంచి వచ్చే యాత్రికులకు ఎంతో అనువైన ఘాట్. ఇక్కడ స్నానం చేసి అమ్మవారి దర్శనానికి సులువుగా వెళ్లొచ్చు. అందుకే పుష్కర యాత్రికులు ఈ ఘాట్ ను ఎక్కువగా ఎంచుకునే అవకాశం ఉంది. వీఐపీలకు ఇక్కడే ఏర్పాట్లు ఉన్నాయి.
కృష్ట వేణి ఘాట్..

ఇది కూడా విజయవాడలోని ప్రధాన ఘాట్ల లో ఒకటి. పుష్కర స్నానాలకు ఎక్కువ మంది ప్రాధాన్యం ఇవ్వడంతో పుష్కరఘాట్ గా పిలుస్తుంటారు. విజయవాడ స్థానికులు ఎక్కువగా ఇక్కడికే వెళ్లడం ఆనవాయితీ. ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. పుష్కర ఘాట్ అన్న పేరుంది కనుక ఎక్కువ మంది దీన్నే ఎంచుకుంటారని అంచనా వేస్తున్నారు. దీంతో భద్రత పరంగా చిక్కులు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
పున్నమి ఘాట్..

ఏపీ టూరిజం వారి ప్రతిష్టాత్మకతకు అద్దం పడితే ఆ ప్రతిబింబమే పున్నమి ఘాట్. పున్నమి రిసార్ట్ లు, పున్నమి హోటళ్లతో భక్తులకు సకల సౌకర్యలతో ఉంటుంది. వాస్తవానికి పర్యాటక ప్రదేశం ఇది. పుష్కర సమయంలోనూ ఆ ప్రకృతిని ఆస్వాదించే అవకాశం ఉంది. విజయవాడలో విహార యాత్రా స్దలమైన భవానీ ఐలాండ్ బోటుషికారు కూడా ఇక్కడే ఉండటంఈ ఘాట్ కు భక్తుల రద్దీ ఎక్కువే అని చెప్పొచ్చు.
ఫెర్రీఘాట్..

ఇది ఇబ్రహీంపట్నం వైపు ఫెర్రీ వద్ద కృష్టా-గోదావరి నదుల కలయిక ప్రదేశం. ఈ ఘాట్ తరాల నుంచి ఉంది. గోదావరి నది చేరిన పవిత్ర సంగమ ప్రదేశం ఇది. దీనికి ఓవైపు నమూన ఆలయాలు ఉండడంతో అనువైన ప్రదేశంగా భక్తులు భావిస్తుంటారు. దీనికి సమీపంలో కొండపల్లి ఉన్నందున్న మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఘాట్ ఏదయినా నది అంతా ఒకటే. ఆ నదిలో ఎక్కడ మునిగినా పుణ్యస్నానం చేసినట్లే. భక్తులు తమ వీలుకు తగ్గట్లుగా అనువైన ప్రదేశం ఎంచుకోవాలని, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి.

SHARE