ప్రత్యేక హోదాపై ప్రత్యేక బిల్లు అవసరం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. పార్లమెంటు సాక్షిగా ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారని, దాన్ని బీజేపీ కూడా అంగీకరించిందని చెప్పారు. 2015 అగస్టులో.. 2016 మార్చిలో ప్రత్యేక హోదా కోసం తీర్మానం ప్రవేశపెడితే తాము పూర్తి స్థాయి మద్దతిచ్చామన్నారు. ప్రత్యేక హోదాపై ఎవరు పోరాడినా మద్దతిస్తామని అన్నారు.
పోలవరానికి సంబంధించి తెలంగాణ నుంచి కొన్ని మండలాలు కలపాలనే విషయాలు కూడా విభజన సమయంలో మాట్లాడారని, దాన్ని అమలు చేశారని, కానీ ప్రత్యేక హోదా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంటుతో ఎందుకు ముడిపెడుతున్నారని నిలదీశారు. పార్లమెంటుకు ప్రైవేటు బిల్లు తెస్తున్నామని, ఆ బిల్లు విషయంలో టీడీపీ ఎలాంటి చావు తెలివితేటలు చూపించి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందోనని అనుమానం వ్యక్తం చేశారు. నిజంగా టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం ఇప్పటి వరకు తాము చేయని ఆందోళన లేదని చెప్పారు. ఏదేమైనా తమ పార్టీ అంతిమ లక్ష్యం ప్రత్యేక హోదా సాధించడమే అన్నారు.