Posted [relativedate]
నంద్యాల ఉపఎన్నిక నోటిఫికేషన్ రాకముందే ఏపీ రాజకీయాల్ని హీటెక్కిస్తోంది. ఇప్పటికే టీడీపీ తరపున భూమా కుటుంబానికే టికెట్ ఇస్తారని ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. దీంతో బలమైన నాయకుడి కుటుంబాన్ని ఎదుర్కోవాలంటే.. వ్యూహం అవసరమని ప్రతిపక్షం వైసీపీ ఆలోచిస్తోంది. అందుకే ముస్లిం అభ్యర్థిని రంగంలోకి దించాలని జగన్ ఆలోచిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గ ఇంఛార్్ గా ఉన్న మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీకి సిద్ధమని చెప్పినా.. జగన్ మాత్రం తర్జనభర్జన పడుతున్నారు.
నంద్యాల నియోజకవర్గం నుంచి గతంలో నబీసాహెబ్ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత టీడీపీ దిగ్గజం ఎన్ఎండీ ఫరూఖ్ కూడా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. మగ్బుల్ హుసేన్, నౌమాన్ కూడా ఎమ్మెల్యేలుగా గెలిచారు. అందుకే ఈసారి ముస్లిం అభ్యర్థిని దించితే ఎలా ఉంటుందని జగన్ ఆలోచిస్తున్నారు. టీడీపీ ఊహించని అభ్యర్థిని బరిలోకి దింపి.. ముందుగానే ప్రత్యర్థిని నైతికంగా దెబ్బ కొట్టాలని జగన్ వ్యూహం రచిస్తున్నారు. కానీ ఎవర్ని దించినా భూమా సానుభూతిలో కొట్టుకుపోతారని టీడీపీ ధీమాగా ఉంది.
అసలు నంద్యాలలో వైసీపీకి బలమైన నేతలే లేరు. అందుకే టీడీపీలో ఉన్న మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డిని దువ్వి.. టికెట్ ఇస్తామని ఎరేసింది. అయితే ఆయన అధికార పార్టీని వీడాలా.. వద్దా అన్న విషయంపై లెక్కలేసుకుంటున్నారు. ఉంటే లాభమా.. వెళ్లిపోతే లాభమా అని మంతనాలు జరుపుతన్నారు. ఇక సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డి కూడా వైసీపీకి వెళ్లొద్దని శిల్పా మీద ఒత్తిడి తెస్తున్నారు. అసలు అభ్యర్థికే దిక్కులేని వైసీపీ.. గెలుపు గురించి ఆలోచించడమేంటని టీడీపీ ఎద్దేవా చేస్తోంది.