Posted [relativedate]
జగన్ రాజధాని పర్యటన పూర్తి అయిపోయింది.భూసమీకరణకు వ్యతిరేకంగా పోరాడి ఇప్పుడు భూసేకరణతో నష్టపోతున్న రైతులకి అండగా ఆయన ఈ టూర్ పెట్టుకున్నారు.అయితే ఈ టూర్ లో ఆయన చేసిన ఓ ప్రకటన ఆసక్తి రేపింది.ఇప్పటిదాకా సీఎం చంద్రబాబు కేవలం అమరావతి వ్యవహారాలకు పరిమితం అయ్యి రాయలసీమతో పాటు ఇతర వెనుకబడిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించేవారు.ఈ టూర్ లో తాను అమరావతికి,అక్కడి ప్రజలకి వ్యతిరేకం కాదని చెప్పుకునేందుకు ప్రాధాన్యమిచ్చారు.సీఎం నివాసముంటున్న గెస్ట్ హౌస్ వ్యవహారాన్ని జగన్ సూటిగా ప్రస్తావించారు.చంద్రబాబు అద్దె ఇంట్లో ఉంటున్నాడని..తాను త్వరలో సొంత ఇల్లు కొనుక్కుని అక్కడే ఉంటానని జగన్ చెప్పడంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది.
ఇంటి గురించే ఇంతగా మాట్లాడితే ఇక పార్టీ కార్యాలయం గురించి కచ్చితంగా ప్రకటన చేస్తారని వైసీపీ శ్రేణులు భావించాయి.అయితే ఆ ఊసు లేకుండానే జగన్ అమరావతి టూర్ ముగిసింది.ఇప్పటికే పక్క రాష్ట్రం నుంచి పార్టీ కార్యకలాపాలు సాగిస్తున్నారని వైసీపీ మీద టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది.వైసీపీ శ్రేణులు ఈ విషయానికి ఎలా కౌంటర్ ఇవ్వాలో తెలియక ఇబ్బంది పడుతున్నాయి.రాజధానిలో ప్రభుత్వ భూ కేటాయింపు అవమానకరంగా ఉందన్న కారణంతో జగన్ సొంతంగా పార్టీ కార్యాలయం నిర్మించుకోడానికి ఆసక్తి చూపారు.ఆ విధమైన ప్రకటన కూడా చేశారు.కొందరు పార్టీ నేతలు కార్యాలయం కోసం స్థలాలు కూడా చూశారు.అయినా అడుగు ముందుకు పడలేదు.ఇప్పుడు రాజధాని టూర్ లో అయినా ఈ అంశానికి ఓ ముగింపు వస్తుందని వైసీపీ శ్రేణులు ఆశగా ఎదురు చూశాయి.అయినా ఆ ఊసే లేకుండా జగన్ వెళ్లిపోవడంతో వైసీపీ శ్రేణులు డల్ అయ్యాయి.జగన్ సన్నిహితులు వచ్చేది మన ప్రభుత్వమే …అప్పుడు రాజధానిలో కార్యాలయం కట్టుకుందాం అని చెప్తున్నా క్యాడర్ కి ఎక్కడం లేదు.