Posted [relativedate]
రాజకీయాలు,రాజకీయాల్లో నేతలు వాడే భాష గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిందని జనమంతా ఎప్పుడో డిసైడ్ అయిపోయారు.అందుకే ఎవరెంత పెట్రేగినా పెద్దగా పట్టించుకోవడం లేదు.పాపం నేతల డైలాగ్స్ దెబ్బకి వాళ్ళ సున్నితత్వం ఎప్పుడో బండబారిపోయుంటుంది.సరే ఆలా అయింది అని నాయకులు ఏమీ తమ ప్రాక్టీస్ ఆపడం లేదు. తమ మానాన తాము రెచ్చిపోతూనే వున్నారు.
తాజాగా అలాంటి ఓ ఎపిసోడ్ ఇది.పార్టీ ఏదైనా,ప్రత్యర్థి ఎవరైనా నోటికొచ్చింది మాట్లాడడంలో ముందుండే వైసీపీ నాయకురాలు రోజా ఇంకోసారి తన నోటికి పనిచెప్పారు.కొత్తగా మంత్రి అయిన లోకేష్ కి ఇంతకుముందు అదే పంచాయితీ రాజ్ శాఖ నిర్వహించిన అయ్యన్న పాత్రుడు అవసరమైతే సలహాలు ఇస్తాను అన్నారు.ఆ మాటలో రోజాకి ఏమి తప్పు కనపడిందో ..ఏమో ? ఇక రోజమ్మ రెచ్చిపోయింది.లోకేష్ పప్పు,అయ్యన్న ఎర్రి పప్పు అంటూ చెలరేగింది.
కానీ అయ్యన్న పాత్రుడు ఏమీ తక్కువ తినలేదు.రోజా స్థాయికి దిగజారి తాను మాట్లాడలేను అంటూనే ఆమెకి బాగానే కౌంటర్ ఇచ్చారు.రికార్డింగ్ డాన్స్ వేసుకునే వాళ్ళని అసెంబ్లీకి పంపించడం ప్రజల దౌర్భాగ్యమని ఆయన వ్యాఖ్యానించారు.అదే ఊపులో ఆమె స్థాయి గురించి మాట్లాడారు.మొత్తానికి జనం పట్టించుకోకపోయినా నేతల నోటి తీట తగ్గదని ఈ ఎపిసోడ్ తో అర్ధమైంది.