పవన్ తో వైసీపీ పరేషాన్!!

Posted January 20, 2017

ycp tension due to pawankalyan
టీడీపీకి దీటుగా రాజకీయం చేద్దామంటే వైసీపీకి కలిసి రావడం లేదు. ఏ ఇష్యూపై పోరాడాలని అనుకున్నా తుస్సుమంటున్నది. సమస్యపై గొంతెత్తే లోపే జనసేనాని పవన్ కల్యాణ్ ఎంటరైపోతున్నారు. దీంతో ఏం చేయాలో ఆ పార్టీకి పాలుపోవడం లేదు.

అప్పట్లో రాజధాని భూముల వ్యవహారంలో తలదూర్చుదామని అనుకున్నారట జగన్. అంతో ఇంతో పార్టీకి మైలేజ్ వస్తుందని భావించారట. ఇక రైతుల దగ్గరకు వెళ్లడమే ఆలస్యం అనుకునేలోపే పవన్ ఎంటరైపోయారు. దీంతో ఇక లాభం లేదనుకొని దానిపై సైలెంట్ అయిపోయింది వైసీపీ. ఏదో అప్పుడప్పుడు నామ్ కే వాస్తేగా ఈ అంశంపై మాట్లాడుతోంది.

ఇక ఉద్దానం కిడ్నీ సమస్య ఎప్పుడో జగన్ దృష్టికి వచ్చిందట. కానీ సమస్య తీవ్రత సారుకు అర్థం కాలేదట. చూద్దాంలే అని సాగదీశారట. అంతలోపే మళ్లీ పవన్ ఎంటరయ్యారు. ఉద్దానం సమస్య తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. చివరకు చంద్రబాబు స్పందించి… ఆ సమస్య పరిష్కారంపై ఫోకస్ పెట్టారు.

తాజాగా అమరావతి రాజధాని ప్రాంతంలో భూసేకరణ జరిగిన గ్రామాల్లో పర్యటనకు జగన్ సిద్ధమయ్యారట. కానీ ఈలోపే మళ్లీ పవన్ వచ్చారు. జగన్ కు షాకిచ్చారు. రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయని పాలెం, లింగాయ పాలెం గ్రామాలకు చెందిన రైతులతో పవన్ సమావేశమయ్యారు. తాను సీఎంతో మాట్లాడతానని అభయమిచ్చారు. చివరకు చేసేది లేక జగన్ అదే ప్రాంతంలో పర్యటించినా… అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. రైతుల నుంచి ఆయనకు ఆశించిన స్పందన రాలేదట.

అటు పోలవరం మండలంలోని మూల లంక గ్రామ రైతులు కూడా పవన్‌ని కలిసి బాధలు చెప్పుకున్నారు. ఈ ఇష్యూ గురించి కూడా వైసీపీ అధినేతకు ముందే తెలుసట. కానీ ఎందుకనో ఆయన దృష్టి అటు వైపు సీరియస్ గా ఆలోచించలేదట. చివరకు ఈ సమస్య కూడా పవన్ ఖాతాలోకి వెళ్లిపోయింది.

ఇలా ఏ అంశంపై పోరాటం చేద్దామన్నా నేనున్నానంటూ పవన్ వచ్చేస్తున్నారు. సమస్యలను తీర్చేస్తానంటూ భరోసా ఇస్తున్నారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తనకు చేతనైనంత చేస్తున్నారు. దీంతో జగన్ కు ఇప్పుడు పవన్ ఫోబియా పట్టుకుందట. టీడీపీ కంటే ముందు పవన్ ను ఎలా ఎదుర్కోవాలో ఆలోచించాలని పార్టీ నాయకులకు చెబుతున్నారట. చంద్రబాబు కంటే కూడా పవనే .. వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారారని ఇప్పుడు జగన్ ఫీలైపోతున్నారట. అధికారంలో లేకుండానే అధికారంలో లేని పార్టీకి పవన్ ఇన్ని తలనొప్పులు తెచ్చిపెడడం అవసరమా అని గుసగుసలాడుకుంటున్నారు వైసీపీ క్యాడర్.

SHARE