రజతం వద్దన్న బంగారు యోగి…

  yogeshwar dutt said don't want silver medalరెజ్లర్‌ యోగేశ్వర్‌దత్‌ తన పసిడి మనసుతో మానవత్వం చాటుకున్నాడు. భారతీయుల ప్రేమానురాగాల్ని మళ్లీ గెలుచుకున్నాడు. లండన్‌ ఒలింపిక్స్‌లో కైవసం చేసుకున్న కాంస్యం మంగళవారం రజతానికి మారిన సంగతి తెలిసిందే. అయితే ఆ పతకాన్ని గెలుచుకున్న రష్యా రెజ్లర్‌ బెసిక్‌ కుదుఖోవ్‌ కుటుంబంతోనే రజతాన్ని ఉండనివ్వండని కోరాడు.

నాలుగేళ్ల క్రితం లండన్‌ ఒలింపిక్స్‌లో రష్యా రెజ్లర్‌ బెసిక్‌ కుదుఖోవ్‌ రజత పతకం గెలిచాడు. అతడి చేతిలో ఓడిన యోగేశ్వర్‌ రెపిచేజ్‌ ద్వారా కాంస్య పతకం సాధించాడు. నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్‌, రెండు సార్లు ఒలింపిక్‌ పతకం పట్టిన బెసిక్‌ 2013లో కారు ప్రమాదంలో మరణించాడు. అయితే అతడి నమూనాలను అత్యాధునిక పద్ధతిలో మళ్లీ పరీక్షించగా డోపింగ్‌ పరీక్షలో విఫలమయ్యాడు. దీంతో బెసిక్‌ రజతాన్ని యోగేశ్వర్‌దత్‌కు ఇవ్వాలని నిర్ణయించారు. కాగా ఆ పతకాన్ని అతడి కుటుంబ సభ్యుల వద్దే ఉండనివ్వాల్సిందిగా యోగి కోరుతున్నాడు.

‘బెసిక్‌ కుదుఖోవ్‌ అద్భుతమైన కుస్తీవీరుడు. అతడు మరణించిన తర్వాత డోప్‌ పరీక్షలో విఫలమవ్వడం బాధాకరం. ఒక రెజ్లర్‌గా అతడిని గౌరవిస్తాను. రజత పతకం రష్యాలోనే ఉంచే వీలుంటే బెసిక్‌ కుటుంబంతోనే ఉండనివ్వండి. నా వరకైతే మానవత్వాన్ని మించింది ఏదీ లేదని’ యోగేశ్వర్‌దత్‌ బుధవారం ట్విట్టర్‌ ద్వారా స్పందించాడు. అయితే యోగేశ్వర్‌కు రజత పతకం ఇస్తున్నట్లు అంతర్జాతీయ రెజ్లింగ్‌ సమాఖ్య ఇంకా ధ్రువీకరించలేదు. ఒకట్రెండు రోజుల్లో పూర్తి సమాచారం లభిస్తుంది. లండన్‌లో కాంస్య పతకం సాధించిన యోగి రియో ఒలింపిక్స్‌లో మాత్రం తొలి రౌండ్లోనే ఓటమి చవిచూశాడు.

SHARE