మోడీ వారసుడిగా యోగి?

 Posted March 27, 2017

yogi as modi's next successor
ప్రస్తుతం బీజేపీలో మోడీ మేనియా నడుస్తోంది. ఎక్కడ ఎన్నికలు జరిగినా మోడీ సెంటిమెంటు కలసి వస్తోంది. ఇదే ఊపులో 2019లోనూ హిట్ కొడతామని బీజేపీ శ్రేణులు ధీమాలో ఉన్నాయి. కొందరైతే అప్పుడే 2024 గురించి కూడా ఆలోచిస్తున్నారు. అప్పటికి బీజేపీ ప్రధాని అభ్యర్థిగా యోగి ఆదిత్యనాథ్ తెరపైకి వస్తారని కొత్తగా ప్రచారం జరుగుతోంది.

యూపీలో ఇప్పుడు ప్రధాని మోడీ కంటే ఎక్కువగా సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పేరు మార్మోగుతోంది. మోడీని మించిన పాపులారిటీని ఆయన సంపాదించారు. ఇక గోరఖ్ పూర్ లో అయితే ఎక్కడ చూసినా యోగి ఫ్లెక్సీలు, కటౌట్లు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా అందరూ ఆదిత్యనాథ్ మంత్రం జపిస్తున్నారు. అంతేకాదు 2024లో యోగినే ప్రధాని అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.

ముఖ్యంగా యూత్ అయితే యోగితోనే దేశాభివృద్ధి సాధ్యమంటూ ఆయనను జాతీయ నేతగా కీర్తిస్తున్నారు. యూపీలో జరుగుతున్న ఈ పరిణామాలు మోడీ దృష్టికి వెళ్లాయట. అయితే ప్రధాని మోడీ మాత్రం దీన్ని చాలా స్పోర్టివ్ గా తీసున్నారని సమాచారం. యూపీ సీఎంగా ఆయన సత్తా చాటితే.. 2024 నాటికి ఆయన ప్రధాని కావడంలో తప్పేముందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట.

ఇవన్నీ చూస్తుంటే ప్రధాని మోడీయే… యోగి ఆదిత్యనాథ్ ను సపోర్ట్ చేస్తున్నారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తన వారసుడిగా యోగినే కరెక్ట్ అని మోడీ భావిస్తున్నారా? అన్న చర్చ జరుగుతోంది. మరి యూపీకి సీఎంగా ఉన్న యోగి ఆదిత్యనాథ్.. మోడీలాగా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయగలుగుతారా? మోడీ అంత ఛరిష్మాను సాధిస్తారా? అన్న దానికి కాలమే సమాధానం చెప్పాలి.

SHARE