నీ తండ్రి నేర్పిన విద్యే నీరజాక్ష

yj1రాజకీయాల్లో పరస్పర విమర్శలు సర్వ సాధారణమే…అధికార పక్షాన్ని ప్ర్రతిపక్షం నిలదీయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనం…కాలం మారింది. దాంతో పాటు విలువలు, సంప్రదాయాలు కూడా మారిపోయాయి. అందుకే ప్రతిపక్షం ప్రశ్నకు ప్రభుత్వాలు కూడా ప్రశ్నలనే సమాధానాలుగా చెప్తున్నాయి. తాజాగా జగన్ తలపెట్టిన ‘గడపగడపకు వైఎస్సార్ సీపీ’ కార్యక్రమంలో ఈ వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. టీడీపీ ఇచ్చిన 600 వాగ్దానాల్లో ఆరైనా నెరవేర్చారా అంటూ జగన్ ప్రశ్నిస్తున్నారు… ప్రభుత్వాన్ని ఇపుడు ప్రశ్నించకపోతే ఇంటింటికీ విమానం ఇస్తారని కూడా జగన్ ఎద్దేవా చేస్తున్నారు.

సహజంగానే ఈ విమర్శలు అధికార పక్షానికి మంటెక్కిస్తాయి. వాళ్ళుకూడా ఎదురుదాడికి దిగుతున్నారు. ప్రశ్నల పేరుతో మీ ఇంటికి లక్ష కోట్లు దాటిన దొంగలొస్తున్నారు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. జగన్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాకపోగా ఆయన పైనే విమర్శనాస్త్రాలు దూసుకొస్తున్నాయి. ఎందుకలా? కాస్త ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే ఈ విషయం బాగా అర్థమవుతుంది. టీడీపీ వ్యూహానికి పదును పెట్టింది జగన్ తండ్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డే.

2004 నుంచి 2009 దాకా వైఎస్ ప్రభుత్వం మీద అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, పత్రికలు ఎన్నో అవినీతి ఆరోపణలు చేశాయి. ఈ మూకుమ్మడి దాడితో ఏ సీఎం అయినా వెనక్కి తగ్గేవాడు…అయితే వైఎస్ పంథా అదికాదు. ఆయన ఎదురుదాడి అస్త్రాన్ని ఎంచుకున్నారు. ఆ రెండు పత్రికలు అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతిని ముప్పతిప్పలు పెట్టారు. వాటి శీలానికి ప్రజల దృష్టిలో పరీక్ష పెట్టారు. ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబునైతే…అసెంబ్లీ వేదికగా వైఎస్ ఎన్ని వ్యంగ్యాస్త్రాలు సంధించారో చాలా మందికి తెలుసు. అప్పట్లో బాబుని ఏకవచనంతో పిలవడం వైఎస్ కి అలవాటైపోయింది. ఇక అసెంబ్లీలో వైఎస్ అనుచర గణం రఘువీరా, కన్నా, బొత్స, చంద్రబాబు మీద ఎంతగా పెట్రేగిపోయేవారో… వరస అవమానాలతో బాబు కూడా సహనం కోల్పోయేవారు. ఇదంతా గతం…ఆ గతం పునాదులపైనే ఇపుడు వర్తమానం నడుస్తోంది.

ఒకప్పుడు వైఎస్ పెంచి పోషించిన ఎదురుదాడి అస్త్రాన్ని తెలుగుదేశం సేన మరింత పదునుగా ప్రయోగిస్తోంది. సమాధానాల్లేని ప్రశ్నలతో జగన్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అందుకే వ్యక్తులు ఎలా వున్నా వ్యవస్థల్లో చెడు సంప్రదాయాలు వస్తే అవి అంత తేలిగ్గా పోవు. ఇదంతా తెలిసి కూడా దేశం నేతలు  ‘నీ తండ్రి నేర్పిన విద్యే నీరజాక్ష ‘ అంటూ జగన్ ని ఇంకా కవ్విస్తున్నారు. ఏం చేద్దాం … నాటి తండ్రి తప్పు నేడు కొడుకు మెడకు చుట్టుకుంది..

*కిరణ్ కుమార్

Leave a Reply