Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత ఆ పార్టీ నాయకుల మొహాలు ఎలా వెలిగిపోతున్నాయో చూస్తూనే వున్నాం.ఇక వారి ప్రకటనల సంగతి సరేసరి.ఇది చాలు …ప్రధాని మోడీ కరుణ కోసం,బీజేపీ తో కలిసి పోవడం కోసం,కేసుల నుంచి తప్పించుకోవడం కోసం జగన్ అండ్ కో ఎంతగా ఎదురు చూస్తున్నారో చెప్పడానికి.వైసీపీ నేతలు ఇంతలా సంబరాలు జరుపుకోవాల్సిన అవసరం ఉందా? ఆ స్థాయిలో ఇప్పుడేమి జరిగింది.ఎన్నాళ్ళ నుంచో ట్రై చేస్తుంటే ఇప్పటికి ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ దొరికింది.అంతమాత్రానికే వైసీపీ ఇంతలా పండగ చేసుకుంటుంటే చూడ్డానికి ఏదోలా వుంది. పైగా మోడీ ఏమి ఊరక పిలవలేదు.రాష్ట్రపతి ఎన్నికలు ముందున్నాయి కాబట్టి పిలిచారు. జగన్ తో కాస్త ఆప్యాయంగా మాట్లాడి ఆయనతోటే ఆ ఎన్నికల్లో బీజేపీ కి మద్దతు అని చెప్పించగలిగారు.
కుడుము ఇస్తే పండగ చేసుకుంటున్న వైసీపీ కొన్ని విషయాల్ని తన అవసరార్ధం మర్చిపోతోంది. ఒకప్పుడు బీజేపీ దగ్గరికి వెళితే మైనారిటీలు,ఎస్సీలు పార్టీకి దూరం అవుతారని జగన్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ వర్గాలు జగన్ మాటల్ని,వైసీపీ వ్యవహారాల్ని గమనించడం లేదనుకుంటే పొరపాటే. అది పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకున్న చందమే.కేసుల కోసం నిజంగా బీజేపీ అండ కావాలనుకున్నా లేక ఆ పార్టీ తో విలీనానికి సిద్ధపడ్డా దానికి ప్రతిగా ఎదురయ్యే రాజకీయ సమీకరణాల ప్రభావాన్ని కూడా వైసీపీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.అంతకన్నా ముఖ్యమైన విషయం ఇంకోటుంది.అదే ..బీజేపీ రాజకీయ వ్యూహం.ఇప్పటికిప్పుడు జగన్ కి బీజేపీ అవసరం ఉందేమో కానీ బీజేపీ కి జగన్ అవసరం లేదు.పైగా రాజకీయంగా ఊహించని ఎత్తులు వేస్తున్న మోడీ,షా ద్వయాన్ని ఒక్క అపాయింట్ మెంట్ తో ఓ అంచనాకి రావడం తప్పే.వాళ్ళ దీర్ఘకాలిక వ్యూహాల గురించి ఓ అంచనా లేకుండా ఇప్పుడు బీజేపీ ని భుజాన మోస్తే…రేపు భిన్నమైన పరిణామాలు ఎదురైనప్పుడు వారిని ఏమైనా విమర్శించినా దానికి పెద్దగా విలువ ఉండబోదు.