జీ చేతికి అంబానీ టీవీ చానల్స్….

Posted January 17, 2017

zee group buying ambani reliance group entertainment tv channels
ప్రాంతీయ టీవీ చానల్స్ కు విస్తరించాలన్న వ్యూహంలో భాగంగా జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజ్ లిమిటెడ్ అనిల్ అంబానీకి చెందిన రిలయెన్స్ గ్రూప్ టీవీ వ్యాపారాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. ఈ ఒప్పందం విలువ రూ.298 కోట్ల 40 లక్షలు. ఈ డీల్ ద్వారా బిగ్ మాజిక్, బిగ్ గంగా అనే రెండు ఎంటర్టైన్మెంట్ చానల్స్ తోబాటు మరో నాలుగు చానల్ లైసెన్సులు కూడా జీ గ్రూపు పరం అవుతాయి. బిగ్ గంగా ద్వారా సుభాష్ చంద్ర ఇప్పుడు భోజ్ పురి మార్కెట్ లో సైతం ప్రవేశించినట్టవుతుంది.

బిగ్ గంగా జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్ కిందికి వస్తుండగా బిగ్ మాజిక్ మాత్రం కామెడీ చానల్. ఆ విధంగా జీ గ్రూప్ కొత్తగా రెండు రకాల ఎంటర్టైన్మెంట్ చానల్స్ ను సొంతం చేసుకున్నట్టయింది. ప్రాంతీయంగా మరిన్ని మార్కెట్లలోకి ప్రవేశించాలనుకుంటున్న జీ గ్రూప్ ఆలోచనలకు అనుగుణంగా ఇలా అదనపు చానల్స్ కొనుగోలు చేసినట్టు జీ సి ఎఫ్ ఎస్ వో మిహిర్ మోడి చెప్పారు. జీ కొనుగోలు ధరను తటస్థీకరించటానికి 220 కోట్ల పన్ను లాభం ఉపయోగపడుతుంది. అందుకు కారణం రిలయెన్స్ టీవీ వ్యాపారం రూ. 650 కోట్ల నష్టాలలో ఉండటం, రూ. 60 కోట్ల సెన్ వాట్ క్రెడిట్ ఉండటం.

గత ఆర్థిక సంవత్సరంలో రిలయెన్స్ టీవీ వ్యాపారం రూ. 49 కోట్లు నమోదు చేసుకోగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.75 నుంచి 90 కోట్ల వరకు వచ్చే అవకాశాలున్నాయి. మొదటి అర్థ సంవత్సరంలోనే రెండు చానల్స్ కలిసి రూ.37కోట్లు నమోదు చేసుకున్నాయి. జీ గ్రూప్ తీసుకోవటం పూర్తయ్యేసరికి రూ.25-35 కోట్ల నిర్వహణ నష్టాలు పూడటంతోబాటు లాభనష్టాలు లేని స్థితికి చేరుకుంటుందని అంచనావేస్తున్నారు. బిగ్ మాజిక్, బిగ్ గంగా కలిసి గత మూడు సంవత్సరాలలో రూ.34 కోట్లు, రూ. 43 కోట్లు, రూ.49 కోట్లు సంపాదించుకున్నాయి. 2016 తొలి అర్థ సంవత్సరంలో 25 కోట్ల ఆదాయం ఉండగా అదే కాలానికి అంటే 2017 తొలి అర్థ సంవత్సరంలో అది రూ.37 కోట్లు అయింది. ఇదే స్థాయిలో రెండో అర్థ సంవత్సరంలో కూడా పెరుగుదల ఉంటుందని అంచనా.

ఈ మార్చి 31 నాటికి ఈ ఒప్పందం పూర్తవుతుందని భావిస్తున్నారు. సెబి నుంచి, సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ, బొంబాయ్ హైకోర్టు నుంచి లాంఛనపూర్వకమైన అనుమతులు కూడా రావాల్సి ఉంది. అదే విధంగా వాటాదారుల అనుమతి కూడా పొందాల్సి ఉంటుంది. రిలయెన్స్ ఆధ్వర్యంలోని బిటివిఐ మాత్రం ఈ ఒప్పందం పరిధిలో లేదు.

ఈ ఒప్పందం ప్రకారం రిలయెన్స్ గ్రూప్ సంస్థలైన బిగ్ మాజిక్ లిమిటెడ్ , రిలయెన్స్ బిగ్ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్, అజాలియా బ్రాడ్ కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ లను జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ కలుపుకుంటుంది. ఈ సంస్థల అప్పుల మొత్తాన్ని తీసుకోవటాన్నే ప్రతిఫలం చెల్లింపుగా పరిగణిస్తుంది. అదే విధంగా మరో 3 కోట్ల 95 లక్షల విలువచేసే ఆధిక్యపు వాటాలు జారీచేస్తుంది. వాటిని మూడేళ్ళలో నగదుగా మార్చుకోవచ్చు.

క్రమసంఖ్య సంస్థ అధిక్యపు వాటాలు అప్పు మొత్తం
1 ఆర్ బి బి ఎల్ 0.9 48.5 49.4
2 అజాలియా 1.3 5.0 6.3
3 బిగ్ మాజిక్ 1.7 241.0 242.7
4 మొత్తం 3.9 294.5 298.4

ఈ కొనుగోలు వలన హిందీ మాట్లాడే ప్రాంతాల్లో జీ ఉనికి బలపడింది. పెరుగుతున్న భోజ్ పురి మార్కెట్లో బిగ్ గంగా ద్వారా ప్రవేశించటానికి, హిందీ కామెడీ మార్కెట్లో బిగ్ మాజిక్ ద్వారా చేరటానికి దోహదపడినట్టయింది. ఇప్పుడు కేవలం మలయాళ మార్కెట్ లో మాత్రమే జీ ఉనికి కనబడటం లేదు.

తమిళ మార్కెట్లోకి చేరగలిగిన జీ గ్రూప్ ఇక దృష్టి పెట్టాల్సింది మలయాళంలో మాత్రమేనని తేలిపోయింది. ప్రాంతీయ మార్కెట్ లో గతంలో రూ,115 కోట్లు వెచ్చింది ఒడిశా చానల్ సార్థక్ ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆ భాషలో అది నెంబర్ వన్ చానల్ కావటం విశేషం.

ఈ రెండు రిలయెన్స్ చానల్స్ కూ గత కొన్నేళ్లుగా ప్రకటనల ఆదాయం క్రమంగా పెరుగుతూ వస్తోంది. అంతే కాకుండా జీ చానల్స్ కు బొకే రూపంలో ప్రకటనలు సేకరించే విషయంలో ఈ రెండు చానల్స్ తరఫునా మరికొన్ని ప్రకటనలు సంపాదించే వీలుంది. ఈ చానల్స్ దేశవ్యాప్తంగా ఎనిమిదిన్నర కోట్ల ఇళ్ళక్లు చేరుతున్నట్టు అంచనా. అమెరికా, కెనడా లాంట్ దేశాల్లో కూడా ఈ చానల్స్ ప్రసారాలు అందుబాటులో ఉన్నాయి.

భోజ్ పురి లో 50% పైగా మార్కెట్ ను సొంతం చేసుకొని నెంబర్ వన్ స్థానంలో నిలిచిన బిగ్ గంగా చానల్ బీహార్ లోనూ, జార్ఖండ్ లోనూ అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ రెండు రాష్ట్రాలతో బాటు ఉత్తరప్రదేశ్ లోని పూర్వాంచల్ ప్రాంతంలో సైతం మారుమూల ప్రాంతాలకు చొచ్చుకు పోయింది. ప్రాంతీయ అభిరుచులను, ఆసక్తులను, సంస్కృతిని ప్రతిబింబించటంలో విజయం సాధించింది. కేబుల్ కనెక్షన్ ఉన్న ప్రతి ఇంటికీ అందుబాటులో ఉండడంతోబాటు అన్ని ప్రధాన డిటిహెచ్ ల ద్వారా పంపిణీ జరుగుతోంది.

ఈ ఒప్పందం ద్వారా జీ గ్రూప్ కు మూడు చానల్స్ తో బాటు రిలయెన్స్ నుంచి మరో మూడు లైసెన్సులు, వాటి ట్రేడ్ మార్క్స్ కూడా సంక్రమిస్తాయి, ప్రస్తుతం జీ గ్రూప్ ఆధ్వర్యంలో 36 స్వదేశీ చానల్స్, 40 విదేశీ చానల్స్ ఉన్నాయి. 171 దేశాలలో వందకోట్లమందికి పైగా ప్రేక్షకులున్నారు. దాదాపు రెండున్నర లక్షల గంటల కార్యక్రమాలతోబాటు 3818 సినిమాల హక్కులున్నాయి.

SHARE