రూ.80 వేల కోట్ల బ్లాక్‌బస్టర్‌ స్పైస్ జెట్ డీల్‌!

0
544

aieplne
స్పైస్‌జెట్… ఇండియాలో లోకాస్ట్ ఎయిర్‌లైన్స్ సంస్థగా సేవలు అందిస్తోంది. దాదాపు రెండేళ్ల క్రితం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న స్పైస్‌జెట్ ఇప్పుడు తలెత్తుకు నిలిచి లాభాల బాటలో పరుగులు పెడుతోంది. ఒకప్పుడు విమాన ఇంధనం ఇచ్చేందుకు చమురు కంపెనీలు నిరాకరించిన స్పైస్‌జెట్ నేడు బెస్ట్ డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్ స్థాయికి ఎదిగింది. ఇక తాజాగా, 100 కొత్త విమానాల కొనుగోలు కోసం స్పైస్‌జెట్ 12 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 80 వేల కోట్లు) విలువైన భారీ డీల్స్‌ను కుదుర్చుకోనుంది. బోయింగ్, ఎయిర్ బస్ వంటి కంపెనీలు స్పైస్‌జెట్‌కు విమానాలు అందించేందుకు పోటీ పడుతున్నాయని తెలుస్తోంది. ఈ భారీ డీల్‌ను తమకు ఇస్తే డిస్కౌంట్లు ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నట్టు, డీల్ చర్చల గురించి తెలిసిన కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

బోయింగ్ సంస్థకు ఈ డీల్ అత్యంత కీలకమని నిపుణులు వ్యాఖ్యానించారు. చైనా, యుఎస్‌లతో పోలిస్తే మరింత వేగంగా ఇండియాలో విమానయాన రంగం విస్తరిస్తున్న వేళ, స్పైస్‌జెట్ వంటి అభివృద్ధి చెందుతున్న సంస్థలకు విమానాల సరఫరా డీల్ కుదుర్చుకోవాలని భావించడం సహజమేనని అన్నారు. ఒకవేళ బోయింగ్ ఈ డీల్ కుదుర్చుకోకుంటే భారీగా నష్టపోయినట్టేనని కేపీఎంజీ ఏరోస్పేస్ విభాగం హెడ్ అంబర్ దూబే వ్యాఖ్యానించారు. కాగా, ప్రస్తుతం స్పైస్‌జెట్ వద్ద 43 విమానాలు ఉన్నాయి. భారత ఎయిర్‌లైన్స్ ఇండ్రస్టీలో 108 విమానాలు, 38.5 శాతం మార్కెట్ వాటాతో ఆధిపత్యం చూపుతున్న ఇండిగోను దెబ్బ కొట్టాలంటే మరిన్ని విమానాలు కొనడం ఒక్కటే స్పైస్‌జెట్ ముందు ఉన్న మార్గం.

ఇక ఇండిగో యాజమాన్య సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్, ఇప్పటికే 430 కొత్త ఎయిర్ బస్ ఏ320 నియో విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. మొత్తం 1000 విమానాలు కలిగి ఉండాలన్నది ఇంటర్ గ్లోబ్ లక్ష్యంగా తెలుస్తోంది. గత వారంలో ఫ్రాన్‌బోర్గ్‌లో జరిగిన ఎయిర్ షోలో స్పైస్‌జెట్ చైర్మన్ అజయ్ సింగ్ పాల్గొన్నారని, అక్కడికి వచ్చిన బోయింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దినేశ్ కేస్కర్‌తో చర్చలు కూడా జరిపారని స్పైస్ ప్రతినిధి తెలిపారు. ఇక సీ-సీరీస్ నారో బాడీ విమానాలను భారత కంపెనీలకు విక్రయిస్తున్న బొంబార్డియర్ సైతం స్పైస్‌జెట్‌తో డీల్ కుదుర్చుకోవాలని భావిస్తోంది. బ్రెజిల్‌కు చెందిన ఎంబ్రారర్, ఇటలీ సంస్థ ఫిన్‌మెకానికా, ఎయిర్ బస్‌ల జాయింట్ వెంచర్ ఏటీఆర్ సైతం తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశాయని విదేశీ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Leave a Reply