సింధు … నవ జీవన సింధువు …

 pv sindhu speech after taking silver medalసింధు … సింధు … సింధు … దేశమంతా ఇదే మాట. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల దాకా అదే బాట. ఒలింపిక్స్ లో ఆమె తెచ్చిన రజతం. అంతటా వినిపిస్తున్న ఆ నామజపం… దేశాన్ని ఊపేస్తున్న జోరు … సింధువంత హోరు … ఇదంతా చూస్తుంటే తమిళనాట రజని సినిమా రిలీజ్ రోజు, తొలి ఆట ఇంట్రడక్షన్ చూసినట్టుంది. అక్కడ రజని కనపడతాడు గానీ అభిమానుల హోరులో ఆయన మాట వినపడదు. ఇప్పుడు కూడా సింధు రజతాన్ని ప్రతి ఒక్కరు తామే తెచ్చినంత సంబరపడుతున్నారు. ఈ సందర్భాన్ని ఓ పండగలా చేసుకుంటున్నారు. అయితే సింధు ఒలింపిక్స్ రజతంతో పాటు ఫైనల్లో ఓటమి తర్వాత ఆమె చెప్పిన మాటలపై కూడా దృష్టి పెట్టండి. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దం లోంచి చూసి, ప్రతి విషయాన్నీ జీవన్మరణ సమస్యగా భావిస్తున్న వారికి … సింధు మాటలు జాగ్రత్తగా వినండి… అవి నేటి తరానికి ఆణిముత్యాలు… 21 ఏళ్ల సింధు … జీవన సింధువు దాటేందుకు చూపిన మార్గాలు.

రియోలో ఫైనల్ పోరు ముగిశాక … రజతం ఖరారయ్యాక సింధును ఇదే విషయం గురించి ప్రశ్నిస్తే ఏమందో తెలుసా? ఒలింపిక్స్ కి నేను పతకం గెలవాలన్న లక్ష్యం తో వచ్చా. రజతం సాధించినందుకు సంతోషం… ఈ వారం అంతా బాగా ఆడినందుకు గర్వంగా వుంది… ఇవీ సింధు పలుకులు. నిత్య అసంతృప్తి రగిలిపోయే జీవులారా ఈ మాటలు వినండి. 100 కి 90 మార్కులు వచ్చినా మిగిలిన 10 మార్కులను గురించే ఆలోచించే నిరాశా వాదులారా మేల్కొనండి. జీవితమంటే ఫై మెట్టు ఎక్కడమే కాదు … అక్కడి దాకా నడవడం. ఆ నడకని హాయిగా ఆస్వాదించడం కూడా.

ఫైనల్ పోరాటం గురించి సింధు విశ్లేషణ ఇది.

‘ఒలింపిక్స్ ఫైనల్లో ఆడటం గొప్ప అనుభవం. ఇద్దరం బాగా ఆడాం. అయినా ఎవరో ఒకరు గెలవాలి కదా. నాకన్నా ప్రత్యర్థి మెరుగైన ప్రదర్శన ఇచ్చింది. ఒక సెట్ ఓడిపోయాక కూడా మారిన్ అనూహ్యంగా పుంజుకొంది. ఆమెకు నా అభినందనలు’… శభాష్ సింధు… ఓటమిని ఇంత హుందాగా తీసుకోవడం కూడా ఓ గెలుపే… నిర్ణయాత్మక సందర్భాన్ని ఎదుర్కోవడం కూడా ఓ గెలుపే… ప్రత్యర్థి గొప్పతనాన్ని గుర్తించడం సైతం ఓ గెలుపే… బరిలో ప్రత్యర్థితో తలపడుతూ కూడా బయటినుంచి ఆ పోరును ఆస్వాదించే నిర్మలత్వం వల్లే సింధు ఆలా మాట్లాడగలిగింది. సమస్యలో ఇరుకొన్నపుడు అక్కడినుంచి గాక దాని వెలుపలినుంచి విషయాన్ని అర్థంచేసుకుంటే.. పరిష్కారాన్ని కనుక్కుంటే ఎంతో ప్రశాంతత… మనశాంతి … అదే కరువైన జనులారా సింధును స్ఫూర్తిగా తీసుకోండి…

మారిన్ అదుపుల గురించి ప్రశ్నించినపుడు సింధు నిజాయితీగా ఇచ్చిన సమాధానం ఇది!. ఆమె ఆలా అరుస్తుందని ముందే తెలుసు… మ్యాచ్ లో ఇలాంటివి మాములే… నేను కొన్ని సార్లు అరిచా కదా ! … ఓటమికి సాకులు వెదికే మహానుభావులకు సింధు మాటలు పాఠం కాదా? గెలవడానికి అర్హత సాధించాలంటే ఓటమిని ధైర్యంగా ఎదుర్కొనే సత్తా వుండాలి. సింధు మాటల్లో ఆ ధైర్యం వుంది. భవిష్యత్ తప్పకుండ ఆమెదవుతుంది. నేటి రజతం రేపటి స్వర్ణమవుతుంది.

సింధు గెలుపు హోరులో ఆమె చెప్పిన ఆణిముత్యాల్లాంటి మాటలు వినిపించకుండా పోకూడదన్న ఉద్దేశమే ‘తెలుగు బుల్లెట్.కామ్’ చేసిన ఈ చిన్న ప్రయత్నం.

తెలుగుకి ఆ హోదా వుంది …

teluguku pracheena hodaతెలుగు భాష ప్రాచీన భాషే అనడానికి ఎంతమాత్రమూ సందేహం లేదని మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడింది. తెలుగుతో పాటు మలయాళం, కన్నడం, ఒడియా భాషలకు కేంద్ర ప్రభుత్వం ప్రాచీన హోదా కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని మద్రాసు హైకోర్టు సోమవారంనాడు కొట్టివేసింది. ఆయా భాషలకు ప్రాచీన హోదా కల్పించడానికి తగిన అర్హతులున్నాయని, నిబంధనల ప్రకారమే ప్రాచీన హోదా కల్పించారని న్యాయస్థానం స్పష్టం చేసింది. తెలుగు, కన్నడ, మలమాళం, ఒరియా భాషలకు ప్రాచీన హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ.. 2009లో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఎనిమిదేళ్లుగా విచారణలో ఉన్న ఈ పిల్‌పై చీఫ్ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఆర్.హమదేవన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఎట్టకేలకు తీర్పు ప్రకటించింది. నిబంధనల ప్రకారమే ప్రాచీన భాషా హోదా కల్పించారని స్పష్టం చేస్తూ పిల్‌ను కొట్టివేసింది. తెలుగుకు ప్రాచీన హోదాకు సంబంధించి ఏపి, తెలంగాణ ప్రభుత్వాల తరఫున న్యాయవాది రవీంద్రనాథ్‌ ధర్మాసనానికి వివరాలు సమర్పించారు. కాగా, తెలుగుకు ప్రాచీన హోదాపై కోర్టు తీర్పు ఇవ్వడంపై ఇరు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు, భాషాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. తీర్పును ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ స్వాగతించారు.

తెలుగును ప్రపంచ భాషగా మార్చేందుకు రెండు తెలుగు ప్రభుత్వాలూ కృషి చేయాలని, తెలుగు భాషపై ఉదాసీనంగా ఉండటం తగదని ఆయన సూచించారు. భాషా అధ్యయన కేంద్రం ఏర్పాటుకు కేంద్రం అంగీకరించినా తెలుగు ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని, తెలుగును ఆధునిక భాషగా గుర్తించేందుకు కృషి చేయాలని యార్లగడ్డ చెప్పారు.

‘యాపిల్’ విలాపం..

   apple crying looked tomatoయాపిల్ పండుకి ఘోర అవమానం జరిగింది. భారతదేశ చరిత్రలో తొలిసారి సిగ్గుతో చితికిపోయింది. ధరల పట్టికలో తన సరసన కూర్చున్న టమోటాను చూసి దాని గుండె బీటలువారింది..

‘తనకన్నా ఆకారంలో చిన్నది.. రేటులో తన పక్కనే కూర్చోవడమా.? హతవిధీ… ఎంత అవమానం… హైబ్రిడ్ వెరైటీ కాస్త సరేగాని ..  నా మెరుపుల ముందు నాటుటమోటో ఏపాటి .? రేటు సంగతి సరే దాని పుటక మాట ఏంటి.? నేనేమో చల్లటి కాశ్మీరంలో పుడతా, అక్కడే పెరుగుతా , అక్కడే పండుతా. ఏసి వాహనంలోనే ఎక్కడకైనా వెళతా.. ఎసి మాల్స్ లోనే కొలువు తీరుతా. పేద బిక్కి నా దగ్గరకు రావాలి అంటే పది సార్లు ఆలోచించేలా చేస్తా.  

ఇక ఆ టమోటా చెట్లమ్మటా, పుట్లమ్మట , చేను గట్లమ్మట, పెరటిలో ఇలా ఎక్కడ  పడితే అక్కడ కాస్తుంది. ఇప్పుడైతే దానిని టమోటా అంటున్నాం గాని….. దాని అసలు పేరు తెల్సా ‘రామ ములగ’… గోలి కాయంత ఉండేది. హైబ్రిడ్ పుణ్యామా అని ఇప్పుడు కాస్త సైజు పెరిగింది. ఎన్ని చెప్పుకుంటే ఏమి    భారతీయులు కిలో వంద రూపాయలు పెట్టి టమోటాలు, నన్ను కొనేస్తున్నారు… రేటు ఒకటే కదా ! ఇంకెక్కడ గౌరవం .? ఆ సంచిలోనే నన్నూ  కుక్కేస్తున్నారు… ఏంచేద్దాం’ ఇవండీ మార్కెట్ నుంచి వస్తుంటే మా సంచిలో ఆపిల్ ఏడుస్తూ చెప్పిన మాటలు.. కాస్త జాలిచూపండి బ్రదర్ .!

*కిరణ్ కుమార్ ..

 

ఆ కూర వండి ఎన్నాళ్ళో…

 tamota dhaal curry cooking

తెలుగు వంటిళ్ళను ఘుమఘుమలాడించే ఈ కూర వాసన ఈ మధ్య ముక్కుల్ని తాకడం లేదు.. ఏంటా కూర అనుకుంటున్నారా.? ఇంకేముంది టమాటపప్పు .. అంతక ముందు అంటే కందిపప్పు ధరలు పెరగక ముందు చాలా ఇళ్ళల్లో రోజూవారీ పప్పు వండుకునేవాళ్ళు.. కందిపప్పు ధరలకు రెక్కలొచ్చాక వినియోగం కాస్త తగ్గింది. అంతలో ఉరు ఉరిమి మంగళం మీద పడ్డట్లు టమాట ధర కూడా  కొండెక్కి కూర్చొంది. కేజీ 80 నుంచి 100 రూపాయలు పలుకుతోంది. ఇంకేముంది.. ఈ రెంటి కాంబినేషన్లో వచ్చే టమాట పప్పు వంటింట్లో ఉడకటం మానేసింది … అదేలెండి ఈ ఖర్చుకు భయపడి మహిళామణులే మానేశారు..